Share News

మంత్రి కోసం పడిగాపులు

ABN , Publish Date - Jan 30 , 2024 | 11:43 PM

స్టడీ మెటీరియల్‌ పంపిణీ పేరుతో మంగళవారం కొండపిలో మంత్రి సురేష్‌ చేపట్టిన కార్యక్రమం సందర్భంగా విద్యార్థులు నరకం చూశారు. 3.30 గంటలపాటు పడిగాపులు కాశారు. మూత్ర విసర్జనకు కూడా అవకాశం లేక అల్లాడిపోయారు.

మంత్రి కోసం పడిగాపులు
ఎండలో గంటల తరబడి నిల్చుని నీరసం వచ్చి చెట్టు నీడకు చేరుకున్న విద్యార్థినులు

ఎండలోనే విద్యార్థినుల ఎదురుచూపులు

మూడున్నర గంటలు ఆలస్యంగా కార్యక్రమం

పదో తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్‌ పంపిణీ

కొండపి, జనవరి 30 : స్టడీ మెటీరియల్‌ పంపిణీ పేరుతో మంగళవారం కొండపిలో మంత్రి సురేష్‌ చేపట్టిన కార్యక్రమం సందర్భంగా విద్యార్థులు నరకం చూశారు. 3.30 గంటలపాటు పడిగాపులు కాశారు. మూత్ర విసర్జనకు కూడా అవకాశం లేక అల్లాడిపోయారు. కొండపి, మర్రిపూడి, పొన్నలూరు మండలాలకు చెందిన పదో తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్‌ పంపిణీ కార్యక్రమాన్ని స్థానిక కామేపల్లి రోడ్డులోని ఓ కల్యాణ మండపంలో ఏర్పాటు చేశారు. షెడ్యూల్‌ ప్రకారం ఉదయం 10.30 గంటలకు కార్యక్రమం ప్రారంభం కావాల్సి ఉంది. దీంతో ఆ సమయానికి మూడు మండలాల నుంచి దాదాపు 900 మంది విద్యార్థులు, 40 మంది ఉపాధ్యాయులు, ఆరుగురు ఎంఈవోలు అక్కడికి చేరుకున్నారు. అయితే మధ్యాహ్నం 1.30 గంటల వరకూ మంత్రి రాలేదు. అప్పటి వరకూ ఆయన కోసం విద్యార్థులు ఎదురు చూడాల్సి వచ్చింది. మంత్రి సురేష్‌ రాగానే పూలు చల్లేందుకు కల్యాణమండపం ముఖద్వారం వద్ద దాదాపు 30మందిని ఎండలోనే నిల్చోబెట్టారు. వారు అర్ధగంటసేపు ఉండి ఎండ తీవ్రతకు తట్టుకోలేక పక్కకు వెళ్లిపోయారు. దీం తో మరో 30 మందిని తిరి గి ఎండలో ఉపాధ్యాయు లు నిల్చోబెట్టారు. అలా 100 మందిని మార్చారు. ఎట్టకేలకు మధ్యాహ్నం 1.30 గంటలకు మంత్రి రావడంతో విద్యార్థినులు ఊపిరి పీల్చుకున్నారు.

ఒత్తిడి లేకుండా పరీక్షలు రాయాలి

స్టడీ మెటీరియల్‌ పంపిణీకి ముందు మాట్లాడిన మంత్రి సురేష్‌ పరీక్షలను ఒత్తిడి లేకుండా రాసి అత్యధిక మార్కులు సాధించాలని కోరారు. అదేవిధంగా విద్యారంగ అభివృద్ధికి కృషి చేసిన జగన్‌కు విద్యార్థులంతా తమ ఇళ్లలోని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులకు చెప్పి ఓట్లేయించాలని కోరారు. అనంతరం కొందరు విద్యార్థులకు ఆయన స్టడీ మెటీరియల్‌ను పంపిణీ చేశారు. మిగిలిన వారికి తర్వాత అందజేస్తారని చెప్పారు. కార్యక్రమానికి ముందుగా మహాత్మా గాంధీ, సరస్వతీదేవి చిత్ర పటాలకు నాయకులు పూలమాలలు వేశారు. కార్యక్రమంలో డీఈవో సుబ్బారావు, జడ్పీటీసీ సభ్యులు మారెడ్డి అరుణకుమారి, బెజవాడ వెంకటేశ్వర్లు, చినకండ్లగుంట సర్పంచ్‌ షేక్‌ వన్నూరు, వైసీపీ మండల అధ్యక్షుడు ఆరికట్ల కోట్లింగయ్య, జేఏసీ మండల కన్వీనర్‌ గొట్టిపాటి మురళి, వైసీపీ మైనారిటీ సెల్‌ మండల అధ్యక్షుడు షేక్‌ మునీర్‌ బాషా, ఎస్సీసెల్‌ మండల నాయకుడు గర్నెపూడి రమేష్‌ పాల్గొన్నారు.

Updated Date - Jan 30 , 2024 | 11:43 PM