విజయనగర రాజుల శాసనం లభ్యం
ABN , Publish Date - Feb 23 , 2024 | 12:24 AM
మండలంలోని సంగంతాండ వెళ్లే దారిలో విజయనగర రాజుల కాలం నాటి శాసనాన్ని అధికారులు గుర్తించారు.
ఎర్రగొండపాలెం, ఫిబ్రవరి 22 : మండలంలోని సంగంతాండ వెళ్లే దారిలో విజయనగర రాజుల కాలం నాటి శాసనాన్ని అధికారులు గుర్తించారు. ఈ శాసనం తెలుగు బాషలో ఉంది. సామాన్యశకం 1482లో చెక్కారు. మహామండలేశ్వర అనివారణసింహారావు, రామరాయదేవ మహారాజు తన తల్లిదండ్రులు సింగరయ్యల పుణ్యం కోసం కంచుకుంట్ల తిప్పాబట్టుండుకు యేరువ సీమలో ఉన్న శింగవరం గ్రామాన్ని కానుకగా అందించినట్లు నమోదు చేశారు. ఈ గ్రామంలోని కట్టనం, కణికె, వెట్టి పన్నులు కూడా వారికే చెందేటట్లు నమోదు చేశారు. ఈ శాసనాన్ని రెవెన్యూ సీనియర్ అసిస్టెంట్ తురిమెళ్ల శ్రీనివాసప్రసాద్ గుర్తించి భారత ఆర్కీయాలజీ డైరెక్టరు కె.మునిరత్నంరెడ్డికి పంపించారు. ఆయన శాసనంలోని అంశాలను పరిశీలించి వివరాలను వెల్లడించారు. అనివారణసింహారావు అనే బిరుదు ఉన్న శ్రీనాథరాజు వంశీయులు, విజయనగర, గజపతులు రాజుల ఏలుబడిలో యేరువ సీమ, (మార్కాపురం కంభం ప్రాంతాలు) నాగార్జున కొండసీమ (పల్నాడు), కొలుకుల సీమ (ఎర్రగొండపాలెం పరిసరాలు-ప్రకాశం జిల్లా) పెన్నాంబడి సీమ (గుత్తి పరిసరాలు-అనంతపురం జిల్లా) కేతవరం సీమ(బెల్లంకొండ, ముప్పాళ్ల పరిసరాలు, పల్నాడు జిల్లా)లను పాలించిననట్లు 15, 16 శతాబ్ధి శాసనాల ద్వారా తెలుస్తోంది. ఈ శాసనం పరిశీలనలో పిల్లగాలి నాగార్జున, జి.ఆదినారాయణ పాల్గొన్నారు.