అమ్మ భాష అంటే అంత చులకనా?
ABN , Publish Date - Feb 22 , 2024 | 01:00 AM
మాతృ భాషకు పట్టం కట్టాల్సిన రాష్ట్ర ప్రభుత్వం దానిని నిర్వీర్యం చేస్తుంటే, యథా రాజా తఽథా అధికారులు అన్నట్లు జిల్లా యంత్రాంగం ప్రవర్తిస్తున్న తీరు భాషాభిమానులను కలచివేసింది.
మాతృభాషా దినోత్సవాన్ని పట్టించుకోని యంత్రాంగం
తెలుగుతల్లి విగ్రహం చుట్టూ ఫ్లెక్సీలు, మద్యం బాటిళ్లు
ఎర్రన కవికి కూడా కరువైన నివాళి
ఒంగోలు(కల్చరల్), ఫిబ్రవరి 21: మాతృ భాషకు పట్టం కట్టాల్సిన రాష్ట్ర ప్రభుత్వం దానిని నిర్వీర్యం చేస్తుంటే, యథా రాజా తఽథా అధికారులు అన్నట్లు జిల్లా యంత్రాంగం ప్రవర్తిస్తున్న తీరు భాషాభిమానులను కలచివేసింది. బుధవారం అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా పలు సాహిత్య సంఘాలు వారి శక్తిమేరకు వేడుకలను నిర్వహించగా అధికార యంత్రాంగం మాత్రం ఆవైపు కన్నెత్తి చూడలేదు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో మాతృభాషా దినోత్సవాన్ని జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించి పలువురు సాహితీవేత్తలను సన్మానించే వారు. అయితే ప్రస్తుతం కనీసం తెలుగుతల్లి విగ్రహానికి సైతం పూలమాల సమర్పించే తీరిక అధికార యంత్రాంగానికి లేకుండాపోయింది. స్థానిక ఉత్తర బైపాస్ ఫ్లైఓవర్ కింద నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో గతంలో తెలుగుతల్లి విగ్రహాన్ని నెలకొల్పారు. అయితే బుధవారం ఆ విగ్రహానికి ఏఒక్క అధికారి కనీసం పూలమాల కూడా వేయకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అంతేకాకుండా తెలుగుతల్లి విగ్రహానికి పూలమాల వేద్దామని వచ్చిన సాహిత్యసంఘాల ప్రతినిధులకు కూడా నిరాశే ఎదురైంది. విగ్రహం చుట్టూ అధికారపార్టీ ఫ్లెక్సీలు, మందుబాబులు తాగిపడేసిన మద్యం సీసాలు, చెత్తాచెదారం వారికి దర్శనమిచ్చాయి. దీంతో చేసేదేమీ లేక వెనుదిరిగారు. తెలుగుతల్లి విగ్రహం వద్ద శుభ్రం చేయించమని నగరపాలక సంస్థ కమిషనర్‌కు రెండు రోజుల కిందటే విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదని నరసం రాష్ట్ర గౌరవాధ్యక్షురాలు తేళ్ల అరుణ ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు కలెక్టర్ కార్యాలయమైన ప్రకాశం భవన్ ఎదుట, ఆర్డీవో కార్యాలయ ప్రాంగణంలో ఉన్న ఎర్రన విగ్రహం వైపు కూడా అధికారులు కన్నెత్తి చూడలేదు. విగ్రహం వద్ద ఏర్పాటుచేసిన గేటుకు తాళం, గ్రిల్స్‌పై బిచ్చగాళ్లు వేసిన పాతవస్త్రాలు, చుట్టూ పేరుకుపోయిన చెత్త దర్శనమిచ్చాయి. దీనినిబట్టి ప్రభుత్వానికి, జిల్లా యంత్రాంగానికి తెలుగుభాష పట్ల మమకారం ఏపాటిదో అర్థమవుతుందని పలువురు భాషాభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.