Share News

అందరిచూపు టీడీపీ వైపే!

ABN , Publish Date - Mar 14 , 2024 | 02:12 AM

జిల్లాలో తెలుగుదేశం పార్టీలోకి ఓటు బ్యాంకులైన నాయకులు పోలోమని పోతున్నారు. టీడీపీ, జనసేనలతోపాటు బీజేపీ కూడా ఆ పార్టీలతో జతకట్టిన నేపథ్యంలో చేరికల్లో మరింత ఊపు పెరిగింది.

అందరిచూపు టీడీపీ వైపే!
ఒంగోలులో మాజీ ఎమ్మెల్యే జనార్దన్‌ సమక్షంలో టీడీపీలో చేరిన నల్లమల్లి బాలు, ఆర్యవైశ్యులు

16న సైకిలెక్కనున్న ఎంపీ మాగుంట, రాఘవరెడ్డి, భారీగా అనుచరులు

అదేరోజు గరటయ్య, చైతన్య కూడా చేరిక

మరికొందరు ప్రముఖులు సైతం టీడీపీ తీర్థం

జిల్లాలో ఒకేరోజు వైసీపీ నుంచి భారీగా వలసలు

ఒంగోలులో ఆర్యవైశ్య సామాజిక నేత, యువకులు

గిద్దలూరు, పర్చూరులో రెడ్డి సామాజికవర్గం

(ఆంధ్రజ్యోతి, ఒంగోలు)

జిల్లాలో తెలుగుదేశం పార్టీలోకి ఓటు బ్యాంకులైన నాయకులు పోలోమని పోతున్నారు. టీడీపీ, జనసేనలతోపాటు బీజేపీ కూడా ఆ పార్టీలతో జతకట్టిన నేపథ్యంలో చేరికల్లో మరింత ఊపు పెరిగింది. ఈనెల 17న జిల్లాకు సమీపంలో జరిగే కూటమి బహిరంగ సభలో చంద్రబాబు, పవన్‌తోపాటు ప్రధాని మోదీ కూడా పాల్గొంటున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో కొన్ని స్థాయిల్లోని వైసీపీ శ్రేణులు, నాయకులు ఇప్పటి వరకూ రాష్ట్రప్రభుత్వ కక్షసాధింపు చర్యలపై ఉన్న భయాన్ని వీడి పోలోమని టీడీపీలో చేరుతున్నారు. ముందు నుంచి అనుకున్న ప్రకారం ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఆయన కుమారుడు రాఘవరెడ్డి, వారి అనుచరులు 16న చంద్రబాబు సమక్షంలో సైకిలెక్కుతున్నారు. సాయంత్రం 4గంటలకు ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో వీరి చేరిక కార్యక్రమం జరగనుంది. వీరితోపాటు వైసీపీలో ఉన్న మాగుంట అనుచరగణం టీడీపీలో చేరబోతోంది. వారిలో కొందరు ఎంపీపీలు, జడ్పీటీసీ సభ్యులు, సింగిల్‌ విండో అధ్యక్షులు, కొన్ని కార్పొరేషన్ల డైరెక్టర్లు కూడా ఉన్నారు.

అదే రోజు బాచిన

మరోవైపు వైసీపీలో దగాపడ్డ మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ బాచిన చెంచుగరటయ్య, ఆయన కుమారుడైన వైసీపీ అద్దంకి మాజీ ఇన్‌చార్జి కృష్ణచైతన్య టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఎమ్మెల్యేలు రవికుమార్‌, సాంబశివరావు ఇచ్చిన సమాచారంతో చంద్రబాబు వీరి చేరికకు సమయాన్ని కేటాయించారు. వీరితోపాటు ప్రధానంగా నియోజకవర్గంలోని వారి అనుచరులు భారీగా చేరనున్నారు. ఇంకోవైపు మాజీ మంత్రి శిద్దా రాఘవరావు పేరు ప్రచారంలో ఉండగా, తాజాగా కనిగిరి మాజీ ఎమ్మెల్యే కదిరి బాబూరావు కూడా టీడీపీలో చేరే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది.

ఒంగోలు, గిద్దలూరు, పర్చూరుల్లో భారీ చేరికలు

జిల్లాలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో బుధవారం వైసీపీ నుంచి, వివిధ ప్రజాసంఘాల నుంచి టీడీపీలో చేరే వారి సంఖ్య భారీగా కనిపించింది. ప్రధానంగా ఒంగోలు, గిద్దలూరు, పర్చూరులో ఆయా సామాజికవర్గాల్లోనూ, వైసీపీలోనూ కీలక భూమిక పోషిస్తున్న పలువురు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఒంగోలులో మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ సమక్షంలో ఆర్యవైశ్య సామాజికవర్గం నుంచి భారీగా టీడీపీలో చేరడం విశేషం. ప్రధానంగా వైసీపీకి గుడ్‌బై చెప్పి వారంతా టీడీపీలోకి వచ్చారు. ఒకప్పుడు ఎమ్మెల్యే బాలినేనికి అత్యంత సన్నిహితునిగా మెలిగిన నల్లమల్లి బాలుతోపాటు ఆసామాజికవర్గంలోని యువకులు టీడీపీలో చేరడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఇక గిద్దలూరు, పర్చూరు నియోజకవర్గాల్లో రెడ్డి సామాజికవర్గం, బలహీనవర్గాలకు చెందిన వారు పెద్దసంఖ్యలో టీడీపీలో చేరారు. గిద్దలూరు మండలంలోని పొదలకొండపల్లి పంచాయతీ, సమీప గ్రామాల్లో పట్టు ఉన్న వైసీపీ నేత జయరామిరెడ్డి పెద్దసంఖ్యలో అనుచరులతో టీడీపీలో చేరారు. టీడీపీ నేత ముత్తుముల అశోక్‌రెడ్డి సమక్షంలో జయరామిరెడ్డితోపాటు గ్రామసర్పంచ్‌, ఐదుగురు వార్డుసభ్యులు, గ్రామంలో ఆయా వర్గాల ప్రజలపై ప్రభావం చూపే కీలక వ్యక్తులు 250మంది టీడీపీలో చేరారు. పర్చూరు నియోజకవర్గంలో అయితే గ్రామాలకు గ్రామాల ప్రజలే తరలివచ్చి ఎమ్మెల్యే సాంబశివరావు సమక్షంలో టీడీపీలో చేరారు. ప్రధానంగా చినగంజాం మండలంలోని కొత్తపాలెం, మున్నంవారిపల్లె, రాజుబంగారుపాలెం గ్రామాల నుంచి భారీగా వైసీపీ శ్రేణులు టీడీపీలో చేరారు. రెడ్డి సామాజికవర్గం, బలహీనవర్గాల నాయకులు, ప్రజలు కూడా సైకిలెక్కారు. తమకు పట్టున్న మండలంగా వైసీపీ నాయకులు భావిస్తున్న చినగంజాం మండలం నుంచి పూర్తిస్థాయి వైసీపీ శ్రేణులు పచ్చకండువాలు కప్పుకున్నారు. మూలగారివారిపాలెం నుంచి ఎ.చెన్నారెడ్డి, బి.వెంకటేశ్వర్‌రెడ్డితోపాటు 50 కుటుంబాల వారు టీడీపీలో చేరారు. మున్నంగివారిపాలెం నుంచి నరేంద్రరెడ్డి, బాలిరెడ్డి, కోటిరెడ్డిలతోపాటు పలు కుటుంబాల వారు చేరారు. రాజుబంగారుపాలెం నుంచి ఎ.చిన్ననరసింహారెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, 40 కుటుంబాల వారు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. అలాగే యద్దనపూడి మండలం నుంచి కూడా కొన్ని గ్రామాల వారు ఎమ్మెల్యే సమక్షంలో టీడీపీలో చేరారు.

Updated Date - Mar 14 , 2024 | 02:12 AM