Share News

అందరికీ ఆహ్వానం

ABN , Publish Date - Jun 11 , 2024 | 01:13 AM

ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు బుధవారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆ కార్యక్రమానికి భారీగా వెళ్లేందుకు జిల్లాలోని తెలుగు తమ్ముళ్లు సన్నద్ధమవుతున్నారు.

అందరికీ ఆహ్వానం
విద్యుత్‌ దీపాలతో కాంతులీనుతున్న ప్రకాశం భవన్‌

రేపు సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం

కేసరిపల్లి వద్ద కార్యక్రమం

నియోజకవర్గానికి 150 పాస్‌లు

కలెక్టర్‌ ద్వారా అందజేత

20 కార్లు, నాలుగు బస్సులకు అనుమతి

నేడు విజయవాడలో కూటమి శాసనసభాపక్ష సమావేశం

ఒంగోలు, జూన్‌ 10 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు బుధవారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆ కార్యక్రమానికి భారీగా వెళ్లేందుకు జిల్లాలోని తెలుగు తమ్ముళ్లు సన్నద్ధమవుతున్నారు. అయితే పార్టీశ్రేణులు అందరికీ అధినేత ప్రమాణస్వీకారానికి ఆహ్వానం పలుకుతున్న అధిష్ఠానం అక్కడి సభా ప్రాంగణంలోకి మాత్రం పరిమిత సంఖ్యలోనే అనుమతిం చాలని నిర్ణయించింది. గన్నవరం విమానాశ్రయం ఎదురు కేసరపల్లి వద్ద బుధవారం ఉదయం 11.27కు సీఎంగా చంద్రబాబు ప్రజల సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రధాని మోదీతోపాటు పలురాష్ట్రాల సీఎంలు, పలువురు కేంద్రమంత్రులు హాజరుకానున్నారు. దీంతో ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టింది. మరోవైపు ప్రమాణ స్వీకారోత్సవం జరిగే ప్రాంగణం కేవలం 18 ఎకరాలు మాత్రమే. అలా స్థలం తక్కువగా ఉండటం, ఎక్కువగా ప్రముఖులు వస్తుండటంతో వారి భద్రత దృష్ట్యా సభా ప్రాంగణంలోకి ముఖ్యనేతలను మాత్రమే అనుమతించాలని అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది. ఆ ప్రకారం ఒక్కోనియోజకవర్గానికి 150 పాసులను మాత్రమే ఇవ్వనున్నారు. అందులో 20 వీవీఐపీవి, 130 వీఐపీలవి ఉంటాయి. వారంతా ఎవరి వాహనాలలో వారు వస్తే ట్రాఫిక్‌ సమస్య ఏర్పడుతుందనే భావనతో వాహనాల పాసులను కూడా నియంత్రిస్తున్నారు. నియోజకవర్గానికి కేవలం 20 పాసులు మాత్రమే ఇవ్వనున్నారు. మిగిలిన వారు ఏసీ బస్సులలో వచ్చేవిధంగా నియోజకవర్గానికి నాలుగు బస్సులను కేటాయిస్తున్నారు.

ప్రభుత్వపరంగానే కార్యక్రమం

ప్రమాణ స్వీకార కార్యక్రమం ప్రభుత్వపరంగానే సాగుతుంది కనుక పాసులను కూడా అధికారులే ఇవ్వనున్నారు. జిల్లాలో కలెక్టర్ల ఆధ్వర్యంలో నియోజకవర్గానికి 150 పాసులు అక్కడి టీడీపీ ఎమ్మెల్యే లేదా ఇన్‌చార్జికి అందజేయాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశించింది. అలాగే 20 వాహన పాసులను ఇవ్వడంతో రవాణా శాఖ ద్వారా నియోజకవర్గానికి నాలుగు బస్సులను సమకూర్చే బాధ్యత కూడా కలెక్టర్లకు అప్పగించారు. పాసులు, వాహనాల అనుమతి ఇతర అంశాలపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.అచ్చెన్నాయుడు సోమవారం ఉదయం టెలీకాన్ఫరెన్స్‌లో పార్టీ ఎమ్మెల్యేలకు సూచనలు చేశారు. పాసులలో కొన్నింటిని మిత్రపక్షాలైన జనసేన, బీజేపీ నేతలకు కూడా ఇవ్వాలని సూచించారు.

నేడు ఎమ్మెల్యేల సమావేశం

కూటమి తరపున గెలుపొందిన ఎమ్మెల్యేల ఉమ్మడి సమావేశం మంగళ వారం విజయవాడలో జరగనుంది. అక్కడి ఏ1 కన్వెన్షన్‌లో ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే సమావేశంలో చంద్రబాబును శాసనసభాపక్ష నేతగా ఎన్నుకోనున్నారు. కాగా ఆ సమావేశంలో పాల్గొనేందుకు జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు సోమవారం రాత్రికే విజయవాడ చేరుకున్నారు.

Updated Date - Jun 11 , 2024 | 01:13 AM