దూకుడు పెంచిన ఎస్పీ
ABN , Publish Date - Aug 08 , 2024 | 11:58 PM
నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎస్పీ ఏఆర్ దామోదర్ పాలనాపర విధానాల్లో దూకుడు పెంచారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన వారిపై వేటు వేసేందుకు వెనుకాడటం లేదు. అదేసమయంలో రౌడీయిజం చేసేవారికి తన పోలీసు మార్కు ట్రీట్‌మెంట్ ఇస్తున్నారు. కేసుల నమోదు విషయంలో జాప్యం చేసిన వారిపైనా చర్యలు చేపట్టారు. త్రిపురాతకం సీఐ, కురిచేడు ఎస్సైలను మొన్న వీఆర్‌కు పిలిపించారు. నిన్న విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన తర్లుపాడు ఎస్‌ఐని వీఆర్‌కు పిలిపించి ఏఆర్‌కు అటాచ్ చేశారు. అదేసమయంలో సిబ్బంది సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. అలాగే ఒంగోలు నగరంలో రౌడీయిజం చేస్తున్న వారిపైనా దృష్టిపెట్టారు.
నిన్న తర్లుపాడు ఎస్సై వీఆర్‌కు
మొన్న త్రిపురాంతకం సీఐ, కురిచేడు ఎస్‌ఐ కూడా..
ఆకతాయిలు, మృగాళ్లకు ముకుతాడు
సిబ్బంది సంక్షేమానికి పెద్దపీట
సిట్ దర్యాప్తు కోసం ఎదురుచూపులు
కొన్ని చిక్కుముడి వీడని పాత కేసులు
నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎస్పీ ఏఆర్ దామోదర్ పాలనాపర విధానాల్లో దూకుడు పెంచారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన వారిపై వేటు వేసేందుకు వెనుకాడటం లేదు. అదేసమయంలో రౌడీయిజం చేసేవారికి తన పోలీసు మార్కు ట్రీట్‌మెంట్ ఇస్తున్నారు. కేసుల నమోదు విషయంలో జాప్యం చేసిన వారిపైనా చర్యలు చేపట్టారు. త్రిపురాతకం సీఐ, కురిచేడు ఎస్సైలను మొన్న వీఆర్‌కు పిలిపించారు. నిన్న విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన తర్లుపాడు ఎస్‌ఐని వీఆర్‌కు పిలిపించి ఏఆర్‌కు అటాచ్ చేశారు. అదేసమయంలో సిబ్బంది సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. అలాగే ఒంగోలు నగరంలో రౌడీయిజం చేస్తున్న వారిపైనా దృష్టిపెట్టారు.
ఒంగోలు(క్రైం), ఆగస్టు 8 : పాలనాపరంగా ఎస్పీ దామోదర్ దూకుడు పెంచారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై వేటు వేసేందుకు వెనుకడుగు వేయడం లేదు. బుధవారం సెట్ కాన్ఫరెన్స్‌లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన తర్లుపాడు ఎస్‌ఐని ఆగమేఘాల మీద వీఆర్‌కు పిలిచి ఏఆర్‌కు అటాచ్‌మెంట్ ఇచ్చారు. అదేవిధంగా కేసులు నమోదు విషయంలో జాప్యం చేసినందుకు కురిచేడు ఎస్‌ఐ, పర్యవేక్షణలోపం ఉందని త్రిపురాంతకం సీఐలను వీఆర్‌కు పిలిచారు. కురిచేడు పొలాలలో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్లను దొంగిలించిన వారి గురించి మీడియాలో వచ్చినప్పటికీ పోలీసు అధికారుల నుంచి స్పందన లేదని, అక్కడ పనిచేస్తున్న స్పెషల్ బ్రాంచ్ హెడ్ కానిస్టేబుల్ సరైన సమాచారం సేకరించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు వచ్చి చెప్పినా పట్టించుకోలేదని తెలిసింది. ఆ నేపథ్యంలోనే ఎస్సై, సీఐలపై చర్యలు తీసుకున్నారు. ఇలా అధికారుల నిర్లక్ష్యంపై అత్యంత వేగంగా ఎస్పీ చర్యలు తీసుకోవడంతో శాఖ ఉలికిపాటుకు గురవుతోంది.
సిబ్బంది సంక్షేమానికి పెద్దపీట
ఎస్పీ బాధ్యతలు తీసుకున్న వెంటనే పోలీసు సిబ్బంది సంక్షేమంపై దృష్టిసారించారు. శాఖలో పనిచేస్తున్న వారి పిల్లల చదువుల గురించి ఆరా తీశారు. నిత్యం విధి నిర్వహణలో పని ఒత్తిడితో ఉండే సిబ్బందికి ఉచిత వైద్యశిబిరం ఏర్పాటు చేసి ఆరోగ్య పరీక్షలు చేయించాలని సూచనలు ఇచ్చారు. ఒంగోలులో వైద్య శిబిరం ఏర్పాటు చేయించారు.
పెండింగ్‌లో అనేక కేసులు
పాత కేసులు అనేకం పోలీసు స్టేషన్‌లో పెండింగ్ ఉన్నాయి. అక్రమంగా కేసులు బనాయించి రౌడీషీట్లు తెరిచిన సందర్భాలు ఉన్నాయి. ఒంగోలులో ఎన్నికలకు సంబంధించి రెండు కేసులలో 150 మందిపై రౌడీషీట్లు తెరిచిన చరిత్ర ఉంది. అమాయికులపై రౌడీషీట్లు తెరవడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికీ దర్యాప్తు ముందుకు సాగని హత్య కేసులు ఉన్నాయి. ఒంగోలులో బాతుల కాపరి పక్కలో నిద్రిస్తున్న ఆరేళ్ల చిన్నారి అదృశ్యం ఇప్పటికి కొలిక్కి రాలేదు. కరవాదిలో వృద్ధురాలను హత్య చేసి బంగారం అపహరించిన కేసు అలాగే ఉంది. పేర్నమిట జీవన్ హత్య కేసులో ఎలాంటి పురోగతి లేదు. ఒంగోలులో జరిగిన అనేక దొంగతనాలు ఇంతవరకు రికవరీ కాలేదు. ఇలా పాత కేసులలో ఎలాంటి పురోగతి కనిపిచడం లేదు. ఇలాంటి కేసులలో దర్యాప్తు వేగవతం చేసి బాధితులకు న్యాయం చేయాలని కోరుతున్నారు.
పోకిరీలు, ఆకతాయిలకు ముకుతాడు
ఆకతాయిలు, పోకిరీలపై ప్రధానంగా దృష్టిపెట్టిన ఎస్పీ తనదైన శైలిలో బుద్ధి చెబుతున్నారు. ఒంగోలులో ఇటీవల చోటుచేసుకున్న కొన్ని ఘటనలపై ఆయన స్పందించిన తీరు నగర ప్రజలకు సాంత్వన కలిగించింది. మహిళ పోలీసుస్టేషన్ తనిఖీకి ఎస్పీ వెళ్లిన సమయంలో అక్కడ ఓ బాలిక తల్లి ఆవేదనను వినిపించింది. తమ కుమార్తె పెంపుడు కుక్కను బయటకు తీసుకెళుతుండగా, ఆకతాయి బైక్‌పై వచ్చి అసభ్యంగా ప్రవర్తించాడు.. ఇదేమిటి అని ప్రశ్నించిన తన భర్తపై దాడి చేశారని మొరపెట్టుకుంది. దీంతో స్పందించిన ఎస్పీ ఆకతాయిపై కేసు నమోదు చేయడమే కాకుండా కౌన్సెలింగ్ కూడా ఇప్పించారు. రౌడీషీట్ తెరవాలని ఆదేశించారు. అదేక్రమంలో స్థానిక ఎన్‌జీవో కాలనీలో నూడిల్స్ కోసం వెళుతున్న బాలిక పట్ల ఇరువురు యువకులు అసభ్యంగా ప్రవర్తించడం పట్ల ఎస్పీ తీవ్రంగా స్పందించారు. స్వయంగా ఘటన స్థలానికి వెళ్లి ఆ ప్రాంతవాసులకు భరోసా కల్పించి, ఇరువురు పోకిరీలకు తనదైన శైలిలో కౌన్సెలింగ్ ఇచ్చారు. మహిళలు, చిన్నపిల్లలను వేధింపులకు గురిచేస్తే సహించేది లేదంటూ హెచ్చరించారు.
సిట్ కేసులు దర్యాప్తు జాప్యం
జిల్లాలో గత ప్రభుత్వంలో భూదందాలు విచ్చలవిడిగా జరిగాయి. అప్పటి ఎస్పీ మలికగర్గ్ భూదందాలపై సిట్ ఏర్పాటు చేసి దర్యాప్తు చేయించారు. ఆ కేసులలో పురోగతి కనిపించలేదు. అంతేకాకుండా దందాలకు మూలకారణమైన వారిపై కేసులు నమోదు చేయడం కానీ, ఒకవేళ చేసినా కనీసం విచారించిన పాపాన పోలేదు. కేవలం జిరాక్స్ తీసినవారు, డాక్యుమెంట్‌లు తయారుచేసిన వారు, సాక్షి సంతకం పెట్టిన వారిని అరెస్టు చేశారు. అసలు ఆ భూస్కాంల వలన ఎవరు లబ్ధిపొందారు అనే విషయంలో పోలీసులు ఉదాసీనత ప్రదర్శించారు. వందల ఎకరాలకు నకిలీపత్రాలు సృష్టించిన వారిని తెలిసీ వదిలివేశారు. అప్పట్లో వైసీపీ ప్రభుత్వం అండతో దందాలు చేసి కోట్లు కొల్లగొట్టిన వారి జోలికి వెళ్లలేదు. పైగా సిట్ ఏర్పాటు పోలీసు అధికారులకు సిరులు పంట కురిపించిందనే ఆరోపణలు వచ్చాయి. తెలియక భూములు కొని మోసపోయిన అమాయకులనే పోలీసులు మళ్లీ వేధించారనే విమర్శలు వచ్చాయి. ఇప్పటికైనా భూదందాలకు పాల్పడిన వారిపై దృష్టిసారించి బాధితులకు న్యాయం చేయాలని ప్రజలు కోరుతున్నారు.