Share News

విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు

ABN , Publish Date - Jul 10 , 2024 | 10:58 PM

విధి నిర్వహణలో ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని మార్టూరు సబ్‌ డివిజన్‌ విద్యుత్‌ శాఖ డీఈఈ ఎం.సురేంద్రబాబు హెచ్చరించారు. బుధవారం ఆంధ్రజ్యోతిలో సబ్‌ స్టేషనా.. మద్యం దుకాణమా అనే కథనంపై విద్యుత్‌ శాఖ అధికారులు స్పందించారు. డీఈఈ సురేంద్రబాబు కొప్పెరపాడు సబ్‌ స్టేషన్‌ను తనిఖీ చేసి సోమవారం రాత్రి మద్యం పార్టీ జరిగిన విషయమై సిబ్బందిని విచారించారు.

విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
విచారణ చేపడుతున్న విద్యుత్‌ విజిలెన్స్‌ అధికార్లు

డీఈఈ ఆగ్రహం

కొప్పెరపాడు సబ్‌ స్టేషన్‌లో మందు పార్టీ ఘటనపై షిప్ట్‌ ఆపరేటర్‌ తొలగింపు

విచారించిన విద్యుత్‌ విజిలెన్స్‌ అధికారులు

ఆంధ్రజ్యోతి వార్తకు స్పందన

బల్లికురవ, జూలై 10 : విధి నిర్వహణలో ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని మార్టూరు సబ్‌ డివిజన్‌ విద్యుత్‌ శాఖ డీఈఈ ఎం.సురేంద్రబాబు హెచ్చరించారు. బుధవారం ఆంధ్రజ్యోతిలో సబ్‌ స్టేషనా.. మద్యం దుకాణమా అనే కథనంపై విద్యుత్‌ శాఖ అధికారులు స్పందించారు. డీఈఈ సురేంద్రబాబు కొప్పెరపాడు సబ్‌ స్టేషన్‌ను తనిఖీ చేసి సోమవారం రాత్రి మద్యం పార్టీ జరిగిన విషయమై సిబ్బందిని విచారించారు. అసమయంలో ఎవరు ఉన్నారు ఉన్నదీ ఆరా తీశారు. వైదన గ్రామస్థులు విద్యుత్‌ సరఫరా లేకపోవడంతో రాత్రి సమయంలోఎ అక్కడకి రాగా సిబ్బంది కొందరు పుట్టిన రోజు పండగ వేడుకలు జరుపుకున్నట్లు అరోపణలు వచ్చాయి. దీనిపై డీఈఈ సిబ్బందిని ప్రశ్నించారు. ఎవరైనా డ్యూటీ సమయంలో మద్యం సేవించి విధులకు హాజరైతే వెంటనే వారిపై కేసులు నమోదు చేసి విధుల నుంచి తప్పిస్తామని అయన వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరైనా విద్యుత్‌ సమస్యపై ఫోను చేస్తే వారికి సరైన సమాధానం చెప్పాలన్నారు. ఈ విచారణలో ఏఈ శ్రీనివాసరావు పాల్గొన్నారు.

షిప్ట్‌ ఆపరేటర్‌ ఖాజావలి విధుల నుంచి తొలగింపు

మండలంలోని కొప్పెరపాడు సబ్‌ స్టేషన్‌లో మద్యం పార్టీ జరిగిన సమయంలో సోమవారం రాత్రి విధులలలో ఉన్న షిప్ట్‌ ఆపరేటర్‌ ఖాజావలిని విధుల నుంచి తొలగిస్తున్నట్లు మార్టూరు విద్యుత్‌ సబ్‌ డీవిజన్‌ డీఈఈ సురేంద్రబాబు తెలిపారు. ఆంద్రజ్యోతి పత్రికలో వచ్చిన కథనం మేరకు విచారణ జరిపామని చెప్పారు. ముందస్తుగా డ్యూటీలో ఉన్న వారిని బాధ్యులను చేస్తూ షిప్ట్‌ ఆపరేటర్‌ను తొలగిస్తున్నట్లు అయన తెలిపారు.

పార్టీపై విచారణ

కొప్పెరపాడు సబ్‌ స్టేషన్‌లో మద్యం పార్టీ జరిగిన ఘటనపై బుధవారం ఒంగోలు ఏపీ ట్రాన్స్‌కో విజిలెన్స్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆదేశాల మేరకు హెడెకానిస్టేబుల్‌ మల్లికార్జునరావు విచారణ జరిపారు. అసమయంలో విధులలో ఉన్న సిబ్బందిని విచారించారు. అలానే వైదన గ్రామానికి చెందిన తిరుమలశెట్టి శ్రీనివాసరావు అనే యువకుడు రాత్రి సమయంలో రాగా అక్కడ మద్యం పార్టీ జరుగుతుందని అధికారులకు ఫిర్యాదు చేశారు. ఆ యువకుడిని కూడా పిలిపించి విచారణ జరిపారు. రాత పూర్వక ఫిర్యాదు తీసుకున్నారు. నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామని విజిలెన్స్‌ అధికారులు తెలిపారు. మద్యం పార్టీ జరిగిన సమయంలో పలు గ్రామాలకు చెందిన విద్యుత్‌ సిబ్బంది కూడా ఉన్నారని దానిపై కూడా పూర్తి స్థాయిలో విచారణ జరిపి వారిపై కూడా చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.

Updated Date - Jul 10 , 2024 | 10:58 PM