Share News

మట్టి దొంగలపై చర్యలు మృగ్యం

ABN , Publish Date - Jul 28 , 2024 | 11:12 PM

వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన మట్టి దోపిడీపై చర్యలు తీసుకునే విషయంలో అధికారులు మీనవేషాలు లెక్కిస్తున్నారు. విచారణ పేరుతో కాలయాపన చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దీనిపై ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. దర్శి ప్రాంతంలో కోట్లాది రూపాయల విలువచేసే మట్టి అక్రమంగా తరలించి అమ్ముకున్నప్పటికీ అధికారులు పట్టించుకోలేదు.

మట్టి దొంగలపై చర్యలు మృగ్యం
వైసీపీ హయాంలో బొట్లపాలెం పశువుల మేత భూమిలో మట్టి తోడగా పడిన గోతులు

ప్రభుత్వ భూముల్లో యథేచ్ఛగా తవ్వకాలు

కొండలనూ కొల్లగొట్టిన వైసీపీ నాయకులు

విచారణ పేరుతో కాలయాపన చేస్తున్న అధికారులు

చర్యలు లేకపోవడంపై ప్రజల విస్మయం

దర్శి, జూలై 28 : వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన మట్టి దోపిడీపై చర్యలు తీసుకునే విషయంలో అధికారులు మీనవేషాలు లెక్కిస్తున్నారు. విచారణ పేరుతో కాలయాపన చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దీనిపై ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. దర్శి ప్రాంతంలో కోట్లాది రూపాయల విలువచేసే మట్టి అక్రమంగా తరలించి అమ్ముకున్నప్పటికీ అధికారులు పట్టించుకోలేదు. కొన్నిగ్రామాల ప్రజలు ఫిర్యాదు చేయడంతో ఏడాది క్రితం విచారణ చేపట్టారు. ఇప్పటివరకూ అది పూర్తి కాలేదు. మండలంలోని బొట్లపాలెం రెవెన్యూలోని పశువుల మేత పోరంబోకు భూమిలో సుమారు 30 ఎకరాల్లో అక్రమార్కులు మట్టిని కొల్లగొట్టారు. వందలాది టిప్పర్లలో యథేచ్ఛగా తరలించారు. సుమారు 50 అడుగుల లోతు గోతులు తవ్వారు. వైసీపీ నాయకులు అక్కడ అక్రమంగా తవ్విన మట్టిని జగనన్న కాలనీలకు సరఫరా చేసి సొమ్ము చేసుకున్నారు. మరికొంత మట్టిని అక్రమంగా వేసిన లేఅవుట్లకు తోలి కాసులు పండించుకున్నారు. అలాగే దర్శి కొండ మట్టిని యథేచ్ఛగా తవ్వారు. తానంచింతల, చందలూరు కొండల మట్టినీ కొల్లగొట్టారు. దర్శిలో వేసిన అక్రమ వెంచర్లను పరిశీలిస్తే ఎక్కడ చూసినా ఆ కొండల మట్టే కనిపిస్తోంది. అధికారుల నిర్లక్ష్యంతో మట్టి దోపిడీ జరిగిందనే ఫిర్యాదులు వెళ్లడంతో అందులో ఎవరిపాత్ర ఉందనే విషయంపై నిర్ధారణ తేలాల్సి ఉంది. ఇప్పటికే బొట్లపాలెం పశువుల మేత పోరంబోకు భూమిలో మట్టి అక్రమ తవ్వకాలపై విచారణ జరుగుతోంది. కొండలమట్టిని కొల్లగొట్టిన అక్రమార్కులను, వారికి సహకరించిన అధికారులను గుర్తించి చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.

Updated Date - Jul 28 , 2024 | 11:12 PM