ఎస్పీపై వేటు
ABN , Publish Date - Apr 03 , 2024 | 01:21 AM
ఎస్పీ పరమేశ్వరరెడ్డిపై ఎన్నికల కమిషన్ వేటు వేయడంతో అధికార యంత్రాంగం ఉలికిపాటుకు గురైంది. అదే సమయంలో వైసీపీ శ్రేణులు కంగుతిన్నాయి.

కొరడా ఝులిపించిన ఈసీ
ఉలిక్కిపడ్డ యంత్రాంగం
చెవిరెడ్డి ఎత్తుగడకు బ్రేక్
వైసీపీలో అంతర్మథనం
(ఆంధ్రజ్యోతి, ఒంగోలు)
ఎస్పీ పరమేశ్వరరెడ్డిపై ఎన్నికల కమిషన్ వేటు వేయడంతో అధికార యంత్రాంగం ఉలికిపాటుకు గురైంది. అదే సమయంలో వైసీపీ శ్రేణులు కంగుతిన్నాయి. ప్రధానంగా ఎన్నికల సమయంలో ఉపయోగపడతారని భావించి ఏరికోరి తెచ్చుకున్న ఎస్పీ వెళ్లిపోవడం ఆ పార్టీ నేతలకు మింగుడుపడటం లేదు. మరోవైపు గిరిజన యువకుడు మునయ్య హత్య ఉదంతంపై లోతైన దర్యాప్తు జరిగితే కిందిస్థాయిలో కొందరు పోలీసు అధికారులు బలికావాల్సి వస్తుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఎస్పీపై వేటుపడటం టీడీపీ కూటమి శ్రేణులకు మాత్రం మనోధైర్యాన్ని కల్పించిందని చెప్పవచ్చు.
వైసీపీ నేతలకు సహకరిస్తున్నట్లు ఆరోపణలు
జిల్లా ఎస్పీగా ఫిబ్రవరి 12న పరమేశ్వరరెడ్డి బాధ్యతలు చేపట్టారు. అయితే గతంలోనే రాజకీయంగా కొన్ని వివాదాస్పద అంశాల్లో ఆయన ఇరుక్కున్నారు. తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల సమయంలో నమోదైన కేసుకు సంబంధించి నిందితులను కాపాడారనే విషయమై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదులు వెళ్లాయి. ఒంగోలు లోక్‌సభకు వైసీపీ ఎంపీ అభ్యర్థిగా తిరుపతి జిల్లాకు చెందిన చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి రంగంలోకి రావటం ఖాయమైన తర్వాతే పరమేశ్వరరెడ్డిని జిల్లాకు బదిలీ చేశారు. ఏరికోరి చెవిరెడ్డి ఆయన్ను తిరుపతి నుంచి ఇక్కడకు బదిలీ చేయించుకున్నారన్న ప్రచారం జరిగింది. కొన్ని అంశాలలో వివాదరహితంగా ఆయన వ్యవహరించినప్పటికీ గుట్టుచప్పుడు కాకుండా వైసీపీ నేతలకు సహకరిస్తున్నారన్న విమర్శలు వచ్చాయి. ఆయన పరిధిలోని ఎస్సైల బదిలీల విషయంలో అది తేటతెల్లమైంది. ఆపై కానిస్టేబుళ్ల బదిలీల విషయంలో పూర్తిగా అధికార పార్టీ నేతలు, ప్రధానంగా అభ్యర్థుల సిఫార్సులకు అనుగుణంగా వ్యవహరించారన్న విమర్శలున్నాయి. దర్శి నియోజకవర్గంలో కులం ప్రాతిపదికగా వైసీపీ నేతల సిఫార్సులకు అనుగుణంగా సిబ్బంది బదిలీలు జరిగిపోయాయన్న ప్రచారం జరిగింది.
మునయ్య హత్యే ముంచింది
గిద్దలూరు నియోజకవర్గం మహేశ్వరపురంలో గత నెలలో టీడీపీకి చెందిన గిరిజన యువకుని హత్య జరిగింది. పథకం ప్రకారమే వైసీపీ వారు హత్యచేశారు. అదీ ముందుగా ఫోన్‌లో హెచ్చరించి మరీ చేశారు. ఆ తర్వాత నిందితులను అరెస్టు చేయడంలోనూ పోలీసులు మీనమేషాలు లెక్కించారు. వైసీపీ నాయకులను కాపాడేందుకు విశ్వప్రయత్నం చేశారు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న టీడీపీ నాయకత్వం ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. ఎస్‌ఈసీ ఎస్పీ పరమేశ్వరరెడ్డిని పిలిచి ఆయన వివరణ కూడా తీసుకున్నారు. మునయ్య హత్యకు పథకం వేసిన విషయం తెలిసి కూడా కాపాడలేకపోవడం, హత్య అనంతరం మృతుడి భార్యపై ఒత్తిడిచేసి వైసీపీ నేతల పేర్లు చెప్పకుండా చేయడం, చివరకు గ్రామ, మండలస్థాయిలో ఇద్దరు వైసీపీ నాయకుల కుట్రపై వచ్చిన ఫిర్యాదును చెత్తబుట్టలో వేయడంలాంటి అంశాలను ఈసీ క్షుణ్ణంగా పరిశీలించినట్లు తెలుస్తోంది. తదనుగుణంగా రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకున్న కేసు విషయంలో పోలీసు వైఫల్యాన్ని గుర్తించి ఎస్పీని బదిలీచేసి ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించినట్లు తెలుస్తోంది.
దిగాలుపడ్డ అధికారపార్టీ
ఎస్పీపై వేటుతో యావత్తు యంత్రాంగం ఉలికిపాటుకు గురైంది. ఎస్పీ సహకారంతో టీడీపీ కూటమికి చెందిన పోలింగ్ ఏజెంట్లను కూడా బెదిరించి కట్టడి చేయాలనుకున్న వైసీపీ నేతలు దిగాలుపడ్డారు. ప్రధానంగా టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పినట్లు ఎర్రచందనం స్మగ్లింగ్‌లో ఆరితేరిన చెవిరెడ్డి వ్యూహానికి బ్రేక్ పడిందన్న భావనను టీడీపీ కూటమి నాయకులు బహిరంగంగా వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై తదుపరి మరింత విచారణ జరిగే అవకాశాలు లేకపోలేదు. భవిష్యత్తులో టీడీపీ కూటమికి అధికారం వస్తే కచ్చితంగా మునయ్య హత్య ఘటనపై పునర్విచారణ జరిపి పాత్రధారులు, సూత్రధారులతోపాటు వారికి సహకరించిన పోలీసు అధికారులను బాధ్యులను చేసే అవకాశం కూడా ఉండొచ్చు. దీంతో ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయం జిల్లాలో రాజకీయంగా సంచలనమైంది.