Share News

కానిస్టేబుల్‌ రత్నబాబుపై వేటు

ABN , Publish Date - Apr 25 , 2024 | 01:15 AM

ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి వైసీపీ ర్యాలీలో పాల్గొన్న కానిస్టేబుల్‌ డి.ఎన్‌.బి. రత్నబాబు అలియాస్‌ గోపిపై వేటు పడింది. ఆయన్ను సస్పెండ్‌ చేస్తూ ఎస్పీ గరుడ సుమిత్‌ సునీల్‌ ఉత్తర్వులు ఇచ్చారు.

కానిస్టేబుల్‌ రత్నబాబుపై వేటు
ర్యాలీ సమయంలో ప్రణీత్‌రెడ్డితో ఉన్న కానిస్టేబుల్‌ రత్నబాబు

సస్పెండ్‌ చేసినట్లు ఎస్పీ సుమిత్‌ వెల్లడి

వైసీపీ ర్యాలీలో పాల్గొనడమే కారణం

ఒంగోలు (క్రైం), ఏప్రిల్‌ 24 : ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి వైసీపీ ర్యాలీలో పాల్గొన్న కానిస్టేబుల్‌ డి.ఎన్‌.బి. రత్నబాబు అలియాస్‌ గోపిపై వేటు పడింది. ఆయన్ను సస్పెండ్‌ చేస్తూ ఎస్పీ గరుడ సుమిత్‌ సునీల్‌ ఉత్తర్వులు ఇచ్చారు. అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారి జస్వంతరావు ఒంగోలు టూటౌన్‌ పోలీసు స్టేషన్‌లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు రత్నబాబుపై కేసు కూడా నమోదు చేసినట్లు ఎస్పీ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఒంగోలు తాలుకా పోలీసు స్టేషన్‌లో పనిచేస్తున్న రత్నబాబు ఎఫ్‌సీఐ గోదాం వద్ద చెక్‌పోస్టులో విధులు నిర్వర్తించాల్సి ఉంది. కానీ ఆయన కోడ్‌ను ఉల్లంఘించి వైసీపీ ఒంగోలు అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి నామినేషన్‌ సందర్భంగా సోమవారం నగరంలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసు అధికారులు నివేదిక ఇవ్వడంతో ఎస్పీ చర్యలు తీసుకున్నారు. పోలీసు అధికారులు, సిబ్బంది ఎవ్వరూ రాజకీయ పార్టీల ర్యాలీలో పాల్గొనడం కానీ, వారితో సన్నిహితంగా ఉండటం కానీ చేయకూడదన్నారు. అందుకు భిన్నంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు.

Updated Date - Apr 25 , 2024 | 01:15 AM