Share News

కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యం

ABN , Publish Date - Mar 29 , 2024 | 12:02 AM

రానున్న ఎన్నికల్లో జిల్లాలోని పార్లమెంట్‌, అన్ని అసెంబ్లీ స్థానాల్లో కూటమి తరఫున పోటీ చేసే అభ్యర్థుల గెలుపే లక్ష్యంతో పనిచేయాలని ఎన్‌డీఏ భాగస్వామ్య పార్టీలు తీర్మానించాయి. రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీలు కూటమిగా బరిలోకి దిగుతున్న విషయం విదితమే.

కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యం
సమావేశమైన మూడుపార్టీల నేతలు జనార్దన్‌, రియాజ్‌, శివారెడ్డి

క్షేత్రస్థాయిలో సమన్వయానికి కమిటీలు

వచ్చే నెలలో పార్లమెంట్‌, అసెంబ్లీ స్థాయి సమావే శాలు

టీడీపీ, జనసేన, బీజేపీ నేతల భేటీలో నిర్ణయం

నేడు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం

ఒంగోలు, మార్చి 28 (ఆంధ్రజ్యోతి) : రానున్న ఎన్నికల్లో జిల్లాలోని పార్లమెంట్‌, అన్ని అసెంబ్లీ స్థానాల్లో కూటమి తరఫున పోటీ చేసే అభ్యర్థుల గెలుపే లక్ష్యంతో పనిచేయాలని ఎన్‌డీఏ భాగస్వామ్య పార్టీలు తీర్మానించాయి. రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీలు కూటమిగా బరిలోకి దిగుతున్న విషయం విదితమే. సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ప్రకటన కొలిక్కివచ్చిన నేపథ్యంలో జిల్లా, నియోజకవర్గ స్థాయిలో మూడు పార్టీలు మరింత సమన్వయంతో ముందుకు సాగాలని నిర్ణయించాయి. ఇందుకోసం వచ్చేనెల 4న పార్లమెంట్‌, 8న అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో ఐక్య సమావేశాలు నిర్వహించాలని తీర్మానించుకున్నాయి. ప్రధానంగా ప్రస్తుత వైసీపీ ప్రభుత్వ అరాచక, అవినీతి పాలనను ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని నేతలు నిర్ణయించారు. మూడు పార్టీల తరఫున ఉమ్మడి కమిటీలు వేసి కార్యాచరణ అమలుకు జిల్లా కమిటీలను ఆదేశించారు. ఈనేపథ్యంలో గురువారం ఒంగోలులో మూడు పార్టీల నేతల తొలివిడత భేటీ అయ్యారు. స్థానిక బీజేపీ ఒంగోలు పార్లమెంట్‌ ఎన్నికల కార్యాలయంలో జరిగిన ఆ సమావేశంలో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌, జనసేన జిల్లా అధ్యక్షుడు రియాజ్‌, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పి.వి.శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర పార్టీల సంయుక్త కమిటీ సూచనలకు అనుగుణంగా జిల్లాలో తీసుకోవాల్సిన చర్యలపై ప్రాథమికంగా చర్చించారు. నియోజకవర్గస్థాయిలో మరింత సమన్వయంతో సాగడం అవసరమని గుర్తించారు. అందుకోసం కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మరోసారి మూడు పార్టీల ముఖ్యనేతలు జిల్లా స్థాయిలో సమావేశమై పూర్తిస్థాయి కార్యచరణ రూపొందించాలని తీర్మానించుకున్నారు.

నేడు టీడీపీ ఆవిర్భావ దినోత్సవం

తెలుగుదేశం పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవాన్ని శుక్రవారం జిల్లావ్యాప్తంగా ఘనంగా నిర్వహించేందుకు ఆపార్టీ శ్రేణులు సిద్ధమయ్యాయి. ఏటా ఈ వేడుకలను సాధారణంగా నిర్వహించి జనవరిలో ఎన్‌టీఆర్‌ వర్ధంతి, మేలో మహానాడు కార్యక్రమాలను భారీగా చేస్తారు. ఈసారి ఎన్నికల ప్రక్రియలో భాగంగా పార్టీ శ్రేణులంతా క్రియాశీలకంగా పనిచేస్తున్నాయి. ఈ సమయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవం రావడంతో పెద్దఎత్తున నిర్వహించాలని అధిష్ఠానం సూచించింది. తదనుగుణంగా జిల్లాలో పార్టీ శ్రేణులు ఎక్కడికక్కడ జెండా ఆవిష్కరణలు, సభలు, సమావేశాలు ఇతర రూపాలలో కార్యక్రమాల నిర్వహణకు సన్నాహాలు చేస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం టీడీపీ చేసిన కార్యక్రమాలను ప్రజలకు వివరించడంతోపాటు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రాష్ట్ర కోసం కూటమి అభ్యర్థులను గెలిపించాల్సిన అవసరాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించారు.

Updated Date - Mar 29 , 2024 | 12:02 AM