Share News

బిగుస్తున్న ఉచ్చు

ABN , Publish Date - Nov 28 , 2024 | 02:01 AM

జిల్లా నీటి యాజమాన్య సంస్థ (డ్వామా) పూర్వ పీడీ శీనారెడ్డి అక్రమాలను నిగ్గుతేల్చేందుకు సర్వం సిద్ధమైంది. ఆయన అవినీతి వ్యవహారాలపై విచారణ ప్రారంభం కానుంది. గత వైసీపీ ప్రభుత్వంలో డ్వామా పీడీగా పనిచేసిన శీనారెడ్డి ఆ సమయంలో పెద్దఎత్తున అవినీతి, అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి.

బిగుస్తున్న ఉచ్చు
ఒంగోలులోని డ్వామా కార్యాలయం

శీనారెడ్డి అక్రమాలపై విచారణకు అంతా సిద్ధం

డిప్యూటీ కలెక్టర్‌ లోకేశ్వరరావు నేతృత్వంలో త్రిసభ్య కమిటీ నియామకం

డ్వామా పీడీగా పనిచేసిన కాలంలో

భారీగా అవినీతికి పాల్పడినట్లు ఫిర్యాదుల వెల్లువ

ఎట్టకేలకు స్పందించిన ప్రభుత్వం

విచారణ చేయాలని కలెక్టర్‌కు ఆదేశాలు

ఇప్పటికే కొనసాగుతున్న విజిలెన్స్‌ ఎంక్వయిరీ

లోకాయుక్తలోనూ నమోదైన కేసు

తాజాగా అన్సారియాకు మరికొన్ని ఫిర్యాదులు

జిల్లా నీటి యాజమాన్య సంస్థ (డ్వామా) పూర్వ పీడీ శీనారెడ్డి అక్రమాలను నిగ్గుతేల్చేందుకు సర్వం సిద్ధమైంది. ఆయన అవినీతి వ్యవహారాలపై విచారణ ప్రారంభం కానుంది. గత వైసీపీ ప్రభుత్వంలో డ్వామా పీడీగా పనిచేసిన శీనారెడ్డి ఆ సమయంలో పెద్దఎత్తున అవినీతి, అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇదేవిషయమై ప్రభుత్వానికి కూడా భారీ సంఖ్యలో ఫిర్యాదులు వెళ్లాయి. సమగ్ర విచారణ చేయాలని కలెక్టర్‌ అన్సారియాకు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందాయి. దీంతో డిప్యూటీ కలెక్టర్‌ లోకేశ్వరరావు నేతృత్వంలో ముగ్గురు సీనియర్‌ అధికారులతో త్రిసభ్య కమిటీని ఆమె నియమించారు.

ఒంగోలు, నవంబర్‌ 27 (ఆంధ్రజ్యోతి) : వైసీపీ ఐదేళ్ల పాలనలో వివిధ సంస్థలు, ప్రభుత్వ శాఖల్లో అధికారులు, అధికార పార్టీ నేతలు కలిసి సాగించిన అవినీతి, అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. ఇటీవల వైద్యశాఖ, డీసీసీబీలలో విచారణ జరగ్గా.. ప్రస్తుతం డ్వామా వంతు వచ్చింది. సహకార శాఖకు చెందిన, జిల్లావాసి అయిన శీనారెడ్డి 2019-24 మధ్యకాలంలో దాదాపు నాలుగున్నరేళ్లపాటు డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్‌గా పనిచేశారు. అప్పట్లో వైసీపీ పెద్దలతో సన్నిహిత సంబంధాలు నెరుపుతూ ఒకస్థాయి అధికార పార్టీ నేతలు, చివరకు కొందరు ఎమ్మెల్యేలను సైతం లెక్కపెట్టనంత స్థాయిలో శీనారెడ్డి వ్యవహరించారన్న విమర్శలు ఉన్నాయి. డ్వామాలో అంతా తానై ఇష్టారీతిన వ్యవహరించి భారీగా అవినీతికి పాల్పడటమే కాక ఒక వర్గం ఉద్యోగులు, సిబ్బందిని వేధింపులకు గురిచేశారన్న ఆరోపణలు పెద్దఎత్తున వచ్చాయి. పనిలో పనిగా తనకు గిట్టని శాఖ సిబ్బందిని సస్పెన్షన్లు, డిస్మిస్‌ చేసి అనంతరం వారి నుంచి లబ్ధిపొంది తిరిగి పోస్టింగులు ఇచ్చేవారని సమాచారం. ఇక తన హోదాకు మించి ఆఫీసు వాహనాల వాడకం, రోస్టర్‌ పాటించకుండా నియామకాలు ఇతర అనేక అంశాలలో పెద్దఎత్తున అరాచకాలు చేశారని తెలిసింది. కాగా ప్రభుత్వం మారిన తరువాత ఈ అంశాలపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఒంగోలుకు చెందిన డీసీసీబీ మాజీ చైర్మన్‌ ఈదర మోహన్‌ పలు అంశాలపై ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా డ్వామాలో శీనారెడ్డి కాలంలో జరిగిన అక్రమాలపై విచారణ చేపట్టాలని జిల్లాకు చెందిన మంత్రి డాక్టర్‌ స్వామి సంబంధిత శాఖ మంత్రి అయిన డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ను గతంలోనే కోరారు.

ప్రకాశం సజ్జల అంటూ

సాధారణ ఎన్నికలకు ముందు శీనారెడ్డిని ఎన్నికల కమిషన్‌ సూచనలతో బదిలీ చేశారు. ఆ సమయంలో ఆయన.. ‘మళ్లీ వైసీపీ ప్రభుత్వమే వస్తుంది.. నేనే మళ్లీ పీడీగా వస్తాను’ అంటూ డ్వామా కార్యాలయంలో డాంబికాలు కూడా పలికారన్న చర్చ సాగింది. అయితే అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు అనంతరం ప్రకాశం జిల్లా సజ్జలకు స్వాగతం అంటూ డ్వామా కార్యాలయం వద్ద కొందరు వెటకారంగా బ్యానర్లు కూడా కట్టారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆపార్టీ నేతలతో శీనారెడ్డి ఏస్థాయిలో అంటకాగారన్నది ఆ ఘటన తేటతెల్లం చేసింది. మరోవైపు డ్వామా పీడీగా శీనారెడ్డి పనిచేసిన కాలంలో కింది నుంచి పైస్థాయి వరకు భారీగా అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలు బలంగా వినిపించాయి. ఉపాధి పనుల్లోపెద్దఎత్తున అవకతవకలు, అక్రమాలు జరిగినా పట్టించుకోలేదు. సోషల్‌ ఆడిట్‌ బృందాలు వాటిని గుర్తించినా సరే మండల స్థాయిలో నిర్వహించే ప్రజావేదికలలో వాటన్నింటినీ రద్దుచేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. పైగా అక్రమాలకు పాల్పడిన వారికి వెన్నుదన్నుగా నిలిచి తాను కూడా భారీగా లబ్ధిపొందారన్న విమర్శలు వెల్లువెత్తాయి.

సీఎంకు ఫిర్యాదు చేసిన దామచర్ల

శీనారెడ్డి అవినీతి, అక్రమాలపై ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ ఏకంగా సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. మరోవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి దృష్టికి కూడా ఈదర మోహన్‌ తీసుకెళ్లడంతో ఆమె కూడా ప్రభుత్వానికి లేఖ రాశారు. ఈ ఫిర్యాదులపై విజిలెన్సు విచారణకు ఆదేశించారు. ప్రస్తుతం అది కొనసాగుతోంది. ఇక పొదిలికి చెందిన మహిళా న్యాయవాది ఒకరు శీనారెడ్డిపై లోకాయుక్తలో ఫిర్యాదు చేయగా ప్రస్తుతం విచారణకు వచ్చింది. అలాగే మరో నలుగురైదుగురు ఇతర వ్యక్తులు, డ్వామాలోని కొందరు ఉద్యోగులు కూడా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. పలువురు జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు కూడా శీనారెడ్డి వ్యవహారాన్ని ప్రభుత్వ పెద్దల దృష్టిలో పెట్టారు.


సమగ్ర విచారణకు ఆదేశం

డ్వామాలో శీనారెడ్డి కాలంలో జరిగిన అవినీతి, అక్రమాలపై సమగ్ర విచారణ చేయాలని నాలుగురోజుల క్రితం కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియాకు రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారుల నుంచి లేఖ వచ్చింది. దీనిపై స్పందించిన ఆమె విచారణ కోసం త్రిసభ్య కమిటీని నియమించారు. ఇటీవల డీఎల్‌డీవో ఉషారాణి, అలాగే పీడీసీసీ బ్యాంకులో అవకతవకలపై సమగ్ర విచారణ నిర్వహించిన డిప్యూటీ కలెక్టర్‌ లోకేశ్వరరావుకు ఆ బాధ్యత అప్పగించారు. ఆయన నేతృత్వంలో మరో ఇద్దరు సీనియర్‌ అధికారులతో కూడిన త్రిసభ్య కమిటీని విచారణ కోసం నియమించారు. ఒకట్రెండు రోజుల్లో ఈ కమిటీ విచారణ చేపట్టనున్నట్లు సమాచారం.

Updated Date - Nov 28 , 2024 | 02:01 AM