ఎద్దును చంపిన పెద్దపులి
ABN , Publish Date - Nov 28 , 2024 | 01:27 AM
అర్ధవీడు మండలం వెలగలపాయ సమీపంలోని నల్లమల అడవిలో మేతకు వెళ్లిన ఎద్దుపై పెద్దపులి దాడి చేసి చంపింది. ఈ మేరకు అటవీశాఖ అధికారులు నిర్ధారించారు. బీట్ ఆఫీసర్ రాజేష్ కథనం ప్రకారం.. వెలగలపాయ గ్రామానికి చెందిన చెల్లె వెంకట్రావు అనే రైతు సోమవారం తన రెండు ఎద్దులను సమీపంలోని అడవిలోకి మేతకు వదిలాడు.

భయాందోళనలో ప్రజలు
కంభం, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి) : అర్ధవీడు మండలం వెలగలపాయ సమీపంలోని నల్లమల అడవిలో మేతకు వెళ్లిన ఎద్దుపై పెద్దపులి దాడి చేసి చంపింది. ఈ మేరకు అటవీశాఖ అధికారులు నిర్ధారించారు. బీట్ ఆఫీసర్ రాజేష్ కథనం ప్రకారం.. వెలగలపాయ గ్రామానికి చెందిన చెల్లె వెంకట్రావు అనే రైతు సోమవారం తన రెండు ఎద్దులను సమీపంలోని అడవిలోకి మేతకు వదిలాడు. సాయంత్రానికి ఒక ఎద్దు మాత్రమే ఇంటికి వచ్చింది. రెండో ఎద్దు కోసం మంగళవారం ఉదయం వెతుకుతూ అడవిలోకి వెళ్లాడు. ఉల్లాకులసెల కొండ ప్రాంతంలో ఎద్దు కళేబరం కనిపించింది. దీంతో రైతు వెంకట్రావు ఫారెస్టు బీటు అధికారులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థ్థలానికి వచ్చిన ఫారెస్టు అధికారులు రాజేష్, అబ్దుల్‌గఫార్, రంగారెడ్డిలు ఎద్దు కళేబరాన్ని పరిశీలించి పెద్దపులి దాడి చేసి చంపి ఉంటుందని భావించారు. నిర్ధారణ కోసం ఆ ప్రాంతంలో సీసీ కెమెరాలను అమర్చి వెళ్లారు. బుధవారం వచ్చి పరిశీలించగా మంగళవారం రాత్రి ఎద్దు కళేబరం వద్దకు పెద్దపులి వచ్చిన దృశ్యాలు కెమెరాలో రికార్డు అయ్యాయి. ఎద్దు విలువ రూ.80వేల వరకు ఉంటుందని రైతు పేర్కొన్నారు. ఫారెస్టు అధికారులు పంచనామా నిర్వహించి రైతుకు నష్టపరిహారం అందేలా చూస్తామని తెలిపారు. ఇదేప్రాంతంలో గతంలో రెండు ఎద్దులపై పెద్దపులి దాడి చేసి చంపిన విషయం విదితమే. దీంతో కాపరులు తమ పశువులను అడవిలోకి మేతకు వదిలేందుకు భయపడుతున్నారు.