Share News

అట్టహాసంగా నామినేషన్‌

ABN , Publish Date - Apr 25 , 2024 | 01:31 AM

గిద్దలూరు నియోజ కవర్గానికి టీడీపీ కూటమి అభ్యర్థిగా ముత్తుముల అశోక్‌ రెడ్డి బుధవారం అట్టహాసంగా నామినేషన్‌ దాఖలు చేశారు.

అట్టహాసంగా నామినేషన్‌

గిద్దలూరు టౌన్‌, ఏప్రిల్‌ 24 : గిద్దలూరు నియోజ కవర్గానికి టీడీపీ కూటమి అభ్యర్థిగా ముత్తుముల అశోక్‌ రెడ్డి బుధవారం అట్టహాసంగా నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలతో గిద్దలూరు పట్టణం పసుపుమయంగా మారింది. టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు కూటమి అభ్యర్థి అశోక్‌రెడ్డికి మద్దతు తెలిపాయి. పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్‌ నుంచి ప్రారంభమైన ర్యాలీ అటవీశాఖ కార్యాలయం వరకు చేరడానికి సుమారు రెండు గంటలు సమయం పట్టింది. ప్రత్యేకంగా పూలతో తయారు చేసిన వాహనంలో టీడీపీ అభ్యర్థి ముత్తుముల అశోక్‌రెడ్డి, ఒంగోలు పార్లమెంటు అభ్యర్థి మాగుంట శ్రీనివాసులరెడ్డి ఆయన కుమారుడు మాగుంట రాఘవరావు, గిద్దలూరు జనసేన ఇన్‌చార్జ్‌ బెల్లంకొండ సాయిబాబా, జడ్పీటీసీ సభ్యుడు బుడత మధుసూదన్‌యాదవ్‌తోపాటు ఆయా పార్టీల ముఖ్య నాయకులు మహాప్రదర్శనగా నామినేషన్‌కు తరలి వెళ్లారు. ర్యాలీ ఆర్టీసీ బస్టాండ్‌ నుంచి రాచర్లగేటు, పాములపల్లి గేటు వరకు భారీగా నిర్వహించారు. మార్గ మధ్యలో పార్టీశ్రేణులు నృత్యాలతో హోరెత్తించారు. నియోజకవర్గంతో పాటు మండలాల నుంచి కూడా టీడీపీ శ్రేణులు భారీగా హాజరయ్యాయి. దారి పొడవునా అన్ని గ్రామాల నుండి వచ్చిన శ్రేణులు ముత్తుముల అశోక్‌రెడ్డికి నీరాజనాలు పలికారు. మండుటెండలను సైతం లెక్కచేయకుండా కూటమి కార్యకర్తలు ఉత్సాహంతో ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాచర్ల గేటు వద్ద కార్యకర్తలను ఉద్దేశించి అశోక్‌రెడ్డి మాట్లాడారు. ‘గిద్దలూరు గడ్డపై టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిదే గెలుపు’ అన్నారు. గడిచిన ఐదేళ్లలో రాష్ట్రానికి వైసీపీ చేసిందేమి లేదన్నారు. తాను స్థానికుడినని, నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటానన్నారు. తనపై పోటీ చేసే వ్యక్తి పక్క నియోజకవర్గం నుండి వలస వచ్చాడన్నారు. మాగుంట రాఘవరావు మాట్లాడు తూ కొన్ని సంవత్సరాలుగా ఈ నియోజకవర్గంతో తమ కుటుంబానికి సత్సంబంధాలు ఉన్నాయన్నారు. నియోజక వర్గ అభివృద్ధికి మాగుంట శ్రీనివాసులరెడ్డి సహకరించా రన్నారు. మే 13న జరిగే ఎన్నికలలో ఎమ్మెల్యే ముత్తుము ల అశోక్‌రెడ్డికి, పార్లమెంట్‌ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసులరెడ్డిలకు సైకిల్‌ గుర్తుపై ఓటు వేసి అధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. అనంతరం అభిమా నుల మధ్య ఊరేగింపుగా ఎన్నికల అధికారి కార్యాలయా నికి చేరుకున్నారు. టీడీపీ కూటమి అభ్యర్థి ముత్తుముల అశోక్‌రెడ్డి, మాగుంట రాఘవరావు, జనసేన ఇన్‌చార్జ్‌ బెల్లంకొండ సాయిబాబా, మాజీ సర్పంచ్‌ దప్పిలి విజయ భాస్కర్‌రెడ్డి, అశోక్‌రెడ్డి సోదరుడు ముత్తుముల కృష్ణకిషోర్‌రెడ్డిలతో కలిసి నామినేషన్‌ పత్రాలను రిటర్నింగ్‌ అధికారిణి డి.నాగజ్యోతికి సమర్పించారు. నామినేషన్ల కార్యక్రమానికి నియోజకవర్గంలోని ఆరు మండలాల టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు భారీగా హాజరయ్యారు.

ఆర్యవైశ్యుల సంఘీభావ ర్యాలీ

నామినేషన్‌ సందర్భంగా అశోక్‌రెడ్డి అభయాంజనేయ స్వామి దేవాలయంలోనూ ప్రత్యేకపూజలు చేశారు. టీడీపీ నాయకులు అశోక్‌రెడ్డి ఘనవిజయం సాధించాలని కోరుతూ 101 కొబ్బరికాయలు కొట్టారు. ఇక స్థానిక ఆర్యవైశ్య నాయకులు నటుకుల శ్రీనివాసులు, ఆరవీటి సత్యనారాయణ, వాడకట్టు శివప్రసాద్‌, ఆరవీటి సుబ్రహ్మణ్యం టీవీఎస్‌, దమ్మాల జనార్థన్‌, వాడకట్టు రామాంజనేయులు, సి.వి.ఎన్‌.ప్రసాద్‌ ఆధ్వర్యంలో ముత్తుముల అశోక్‌రెడ్డి నామినేషన్‌ సందర్భంగా పట్టణంలోని అమ్మవారిశాల నుండి ర్యాలీ నిర్వహించి అశోక్‌రెడ్డికి మద్దతు పలికారు. అమ్మవారిశాలలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆర్యవైశ్య నాయకులు అశోక్‌రెడ్డి ఇంటి వద్దకు వెళ్ళి మద్దతు పలికారు. అశోక్‌రెడ్డి విజయానికి తామంతా కృషి చేస్తామని తెలిపారు.

Updated Date - Apr 25 , 2024 | 01:31 AM