Share News

డ్వామా కార్యాలయం వద్ద ఫ్లెక్సీల కలకలం

ABN , Publish Date - Jun 08 , 2024 | 12:18 AM

జిల్లా నీటి యాజమాన్య సంస్థ (డ్వామా) ప్రాజెక్టు డైరెక్టర్‌ కార్యాలయం వద్ద పూర్వపు పీడీ శీనారెడ్డికి స్వాగతం అంటూ శుక్రవారం వెలసిన ఫ్లెక్సీలు కలకలం రేపాయి. ఎన్నికల సమయంలో ఇక్కడి నుంచి ఆయన బదిలీ కాగా కోడ్‌ ఎత్తివేసిన మరుసటి రోజు రాత్రే పీడీగా బాధ్యతలు స్వీకరణకు వస్తున్న శీనారెడ్డికి స్వాగతం అంటూ వ్యంగ్యంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం చర్చనీయాంశమైంది.

డ్వామా కార్యాలయం వద్ద ఫ్లెక్సీల కలకలం
డ్వామా కార్యాలయం పరిసరాల్లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు

పీడీ శీనారెడ్డికి స్వాగతం అంటూ వెటకారంగా ఏర్పాటు

వైసీపీ ప్రభుత్వంలో నేతల కన్నా ఆయన

ఎక్కువ పెత్తనం చేసినట్లు ఆరోపణలు

ఇటీవల కేంద్రానికి ఫిర్యాదు చేసిన ఈదర

తాజా వ్యవహారంపై చర్చ

ఒంగోలు, జూన్‌ 7 (ఆంధ్రజ్యోతి) : జిల్లా నీటి యాజమాన్య సంస్థ (డ్వామా) ప్రాజెక్టు డైరెక్టర్‌ కార్యాలయం వద్ద పూర్వపు పీడీ శీనారెడ్డికి స్వాగతం అంటూ శుక్రవారం వెలసిన ఫ్లెక్సీలు కలకలం రేపాయి. ఎన్నికల సమయంలో ఇక్కడి నుంచి ఆయన బదిలీ కాగా కోడ్‌ ఎత్తివేసిన మరుసటి రోజు రాత్రే పీడీగా బాధ్యతలు స్వీకరణకు వస్తున్న శీనారెడ్డికి స్వాగతం అంటూ వ్యంగ్యంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం చర్చనీయాంశమైంది. అందులోనూ శీనారెడ్డి (ప్రకాశం జిల్లా సజ్జల రామకృష్ణారెడ్డి) అంటూ పేర్కొనడం విశేషం. వైసీపీ ప్రభుత్వ కాలంలో దాదాపు నాలుగున్నరేళ్లు డ్వామా పీడీగా పనిచేసిన శీనారెడ్డి వైసీపీ ప్రజాప్రతినిధి కన్నా ఎక్కువగా వ్యవహరించారన్న ఆరోపణలు సర్వత్రా ఉన్నాయి. మద్దిపాడు మండలానికి చెందిన శీనారెడ్డి సహకారశాఖ ఉద్యోగి కాగా వైసీపీ అధికారంలోకి వచ్చాక డిప్యుటేషన్‌పై డ్వామా పీడీగా బాధ్యతలు స్వీకరించారు. జిల్లాలో వైసీపీ కీలక నేత అయిన బాలినేని శ్రీనివాసరెడ్డికి అత్యంత సన్నిహితునిగా చెప్పుకొనే శీనారెడ్డి.. డ్వామా అధికారులు, ఉద్యోగులపై కర్ర పెత్తనం చేయడంతోపాటు భారీగా అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. అనతికాలంలో డ్వామాలో పెద్దఎత్తున అవినీతి జరిగిందని పీడీసీసీ బ్యాంకు మాజీ చైర్మన్‌ ఈదర మోహన్‌ ఇటీవల కేంద్ర విజిలెన్స్‌ కమిషన్‌ (సీవీవీ), కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదులు చేశారు. ఈ ఫిర్యాదున సీవీవీ విచారణకు కూడా స్వీకరించింది.

వైసీపీ నేతగా వ్యవహరించినట్లు ఆరోపణలు

వైసీపీ ప్రభుత్వ కాలంలో శీనారెడ్డి అధికారిగానే కాక, ఆ పార్టీ క్రీయాశీలక నేతగా వ్యవహరించరన్న ఆరోపణలు ఇటు అధికారులు, ఉద్యోగులు అటు వైసీపీ నేతల నుంచి కూడా వచ్చాయి. బాలినేని వంటి ముఖ్యనేతలను తప్ప ఇతర ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జిలను కూడా లెక్క చేయకుండా వ్యవహరించారన్న విమర్శలు ఉన్నాయి. కాగా ఎన్నికల సమయంలో జిల్లాలో వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న అధికారులపై టీడీపీ నేత దామచర్ల జనార్దన్‌ ఫిర్యాదు నేపథ్యంలో శీనారెడ్డి ఇక్కడి నుంచి బదిలీ అయ్యారు. అయితే తిరిగి వైసీపీ అధికారంలోకి రావడం ఖాయమని, నేనే మళ్లీ పీడీగా జూన్‌ 6న వస్తానని పలువురు డ్వామా ఉద్యోగులతో తాను రిలీవ్‌ అయి వెళ్లేముందు శీనారెడ్డి అన్నారు. ఆయనకు సన్నిహితులుగా గుర్తింపు ఉన్న కొందరు ఉద్యోగులు పదేపదే ఆ ప్రస్తావన ఇతర ఉద్యోగుల వద్ద చేస్తూ వచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో శుక్రవారం డ్వామా కార్యాలయం వద్ద శీనారెడ్డికి స్వాగతం పేరుతో ప్లెక్సీలు వెలియడం చర్చనీయాంశమైంది. వాటిని ఎవరు ఏర్పాటు చేశారన్నది బహిర్గతం కాలేదు. కానీ కొద్దిసేపటికే అన్ని ప్రాంతాల్లోని డ్వామా ఉద్యోగులకు సమాచారం చేరింది. సోషల్‌ మీడియాలోనూ వైరల్‌ అయ్యింది. వైసీపీ ఘోర పరాజయంపాలై టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో శీనారెడ్డి వ్యవహార శైలిపై ఆసంతృప్తితో ఉన్న వారు ఇలా వ్యగ్యంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ఉండవచ్చన్న చర్చ సాగుతోంది. అదలా ఉంచితే ఒక అధికారి పేరుతో ఇలాంటి ఫ్లెక్సీలు వెలవడడాన్ని బట్టి చూస్తే వైసీపీ ప్రభుత్వ కాలంలో అధికారులు ఎంత బరితెగించి పనిచేశారన్నది స్పష్టమవుతోంది.

Updated Date - Jun 08 , 2024 | 12:19 AM