Share News

మద్దిశెట్టికి దొరకని అవకాశం

ABN , Publish Date - Jan 11 , 2024 | 11:13 PM

అధికార వైసీపీ మూడో జాబితాలో ముందునుంచి అనుకున్నట్లే దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టిని తొలగించి బూచేపల్లి శివప్రసాదరెడ్డికి వైసీపీ అధిష్ఠానం అవకాశం ఇచ్చింది. మరోచోట అవకాశం ఇవ్వాలని మద్దిశెట్టి కోరినా ఈ జాబితాలో ఆయనకు స్థానం దక్కలేదు. మార్కాపురంపై మళ్లీ ప్రతిష్టంభన నెలకొనగా ఒంగోలు లోక్‌సభ, అసెంబ్లీ అభ్యర్థులపైనా నిర్ణయం తీసుకోకపోవటం చర్చనీయాంశమైంది.

మద్దిశెట్టికి దొరకని అవకాశం

మార్కాపురంపై మళ్లీ ప్రతిష్టంభన

ఒంగోలుపై ముందుకు పడని అడుగు

అనుకున్నట్లే బూచేపల్లికి ఛాన్స్‌

(ఆంధ్రజ్యోతి, ఒంగోలు)

అధికార వైసీపీ మూడో జాబితాలో ముందునుంచి అనుకున్నట్లే దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టిని తొలగించి బూచేపల్లి శివప్రసాదరెడ్డికి వైసీపీ అధిష్ఠానం అవకాశం ఇచ్చింది. మరోచోట అవకాశం ఇవ్వాలని మద్దిశెట్టి కోరినా ఈ జాబితాలో ఆయనకు స్థానం దక్కలేదు. మార్కాపురంపై మళ్లీ ప్రతిష్టంభన నెలకొనగా ఒంగోలు లోక్‌సభ, అసెంబ్లీ అభ్యర్థులపైనా నిర్ణయం తీసుకోకపోవటం చర్చనీయాంశమైంది. వైసీపీ మూడో జాబితాను గురువారంరాత్రి విడుదల చేసింది. దర్శి ఇన్‌చార్జిని మాత్రమే మార్పుచేసి మిగిలినచోట్ల ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించలేదు. ఇటీవల సీఎం మాట్లాడినప్పుడు మద్దిశెట్టి తనకు దర్శి కానప్పుడు ఒంగోలు లోక్‌సభ నుంచి పోటీకి అవకాశం ఇవ్వాలని కోరారు. ఆ సందర్భంగా ఒంగోలు అసెంబ్లీ వ్యవహారం కూడా వారి మధ్య చర్చకు వచ్చింది. ఎక్కడా అవకాశం ఇవ్వకపోతే తన స్పందన ఏమిటో అప్పుడు తెలియజేస్తానని మద్దిశెట్టి ప్రకటించి ఉన్నారు. మార్కాపురానికి జంకెను అభ్యర్థిగా దించాలని భావించిన సీఎం జగన్‌ నాలుగురోజుల క్రితం ఎమ్మెల్యే నాగార్జునరెడ్డిని పిలిచి మాట్లాడారు. గురువారం విడుదలైన జాబితాలో మార్కాపురం విషయాన్ని తేల్చలేదు. తనకు చెప్పి కూడా జాబితాలో అవకాశం ఇవ్వకపోవటంపై జంకె అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. కందుకూరు నుంచి యాదవ సామాజికవర్గం అభ్యర్థిని రంగంలోకి తెచ్చి ఎమ్మెల్యే మహీధరరెడ్డిని పక్కన పెట్టాలని చూస్తున్న సీఎం.. నెల్లూరు లోక్‌సభ అభ్యర్థి ఎంపికతో ఉన్న సంబంధంతో దానిపైనా తుదినిర్ణయం తీసుకోలేదని సమాచారం. దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్‌కు మూడో జాబితా లో చోటు కల్పించకపోవడంపై ఆయన అనుచరులు కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆయనకు ఎక్కడా అవకాశం ఇవ్వకపోతే తమదారి తాము చూసుకుంటామని స్పష్టం చేస్తున్నారు. దీంతో రానున్న కొద్దిరోజుల్లో వైసీపీ నుంచి ఇతర పార్టీల్లోకి జిల్లాలో భారీగా వలసలు కొనసాగే అవకాశం కనిపిస్తోంది.

Updated Date - Jan 11 , 2024 | 11:13 PM