Share News

Pawan Kalyan : అదనపు నిధులివ్వండి

ABN , Publish Date - Nov 28 , 2024 | 05:48 AM

దేశంలోని ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు ఇవ్వాలనే బలమైన సంకల్పంతో కేంద్రంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం రూపొందించిన జల్‌జీవన్‌ మిషన్‌ లక్ష్యాలను నాటి సీఎం జగన్‌ గాలికొదిలేశారని ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ విమర్శించారు.

Pawan Kalyan : అదనపు నిధులివ్వండి

ప్రధానికి డిప్యూటీ సీఎం పవన్‌ వినతి.. జల్‌జీవన్‌ మిషన్‌ను జగన్‌ గాలికొదిలారు

కేంద్రం 23 వేల కోట్లు కేటాయిస్తే అందులో 2 వేల కోట్లే ఖర్చు చేశారు

చేసిన పనులు కూడా నాసిరకం.. ఎవరికీ ప్రయోజనం లేదు

మేం సమర్థంగా అమలుచేస్తాం.. పార్లమెంటు ప్రాంగణంలో మోదీతో భేటీ

ఎర్రచందనం ఎగుమతుల ప్రక్రియ మార్చాలి.. సింగిల్‌ విండోలోకి తేవాలి

కేంద్ర అటవీ మంత్రి భూపేంద్ర యాదవ్‌ను కోరిన పవన్‌

న్యూఢిల్లీ, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): దేశంలోని ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు ఇవ్వాలనే బలమైన సంకల్పంతో కేంద్రంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం రూపొందించిన జల్‌జీవన్‌ మిషన్‌ లక్ష్యాలను నాటి సీఎం జగన్‌ గాలికొదిలేశారని ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ విమర్శించారు. బుధవారం ఢిల్లీలో పార్లమెంటు ప్రాంగణంలో ప్రధాని మోదీతో ఆయన సమావేశమయ్యారు. ఈ మిషన్‌ కింద కేంద్రం రాష్ట్రానికి రూ.23 వేల కోట్లు కేటాయిస్తే అందులో రూ.2 వేల కోట్లను మాత్రమే వైసీపీ సర్కారు ఖర్చు చేసిందని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. పూర్తయిన పనుల వల్ల కూడా ఎవరికీ, ఎలాంటి ప్రయోజనమూ కలుగలేదని, పనులన్నీ నాసిరకంగా చేశారని తెలిపారు. కూటమి ప్రభుత్వం కేంద్ర ఆశయాలకు అనుగుణంగా మిషన్‌ను ప్రణాళికాబద్థంగా ముందుకు తీసుకెళ్తుందన్నారు. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ 24 గంటల పాటు స్వచ్ఛమైన తాగునీరు అందించడమే లక్ష్య్యంగా పూర్తి ప్రణాళికను రూపొందించామని.. దీని అమలుకు అవసరమైన అదనపు నిధులను అందించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.


సింగిల్‌ విండో విధానం బెటర్‌..

ఎర్రచందనం అమ్మకాలు, ఎగుమతుల ప్రక్రియను సింగల్‌ విండో విధానానికి మార్చాలని, అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించే ఈ-వేలంలో మెరుగైన ఫలితాలు వస్తాయని డిప్యూటీ సీఎం అన్నారు. ప్రధానితో భేటీ తర్వాత కేంద్ర అటవీ మంత్రి భూపేంద్ర యాదవ్‌ను కలిశారు. ఎర్రచందనం రక్షణ, స్మగ్లింగ్‌ను నిరోధించడం, అమ్మకం విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై చర్చించారు. ‘ఏపీ బయట పట్టుబడిన ఎర్రచందనం సైతం సింగిల్‌ వేలంలో కస్టోడియన్‌గా ఉండే మా రాష్ట్రానికే దక్కేలా చూడాలి. కేంద్రం పర్యవేక్షణలో ఏపీ ప్రభుత్వం కస్టోడియన్‌గా కొనసాగుతుంది’ అని వివరించారు. ఈ-వేలం ద్వారా రెవెన్యూ పెరుగుతుందన్నారు.

ఎన్‌డీఏ ఎంపీలకు పవన్‌ కల్యాణ్‌ విందు

ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ బుధవారం రాత్రి ఢిల్లీలోని తాజ్‌ ప్యాలె్‌సలో ఎన్‌డీఏ ఎంపీలకు విందు ఇచ్చారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన పలువురు ఎంపీలతో పాటు కేంద్ర మంత్రులు రామ్మోహన్‌నాయు డు, పెమ్మసాని చంద్రశేఖర్‌, గిరిరాజ్‌సింగ్‌, మాజీ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ తదితరులు హాజరయ్యారు. ఈ విందు మర్యాదపూర్వకమేనని, రాజకీయాలేమీ చర్చించలేదని టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తెలిపారు.

బంగ్లాలో హిందువులపై దాడులు బాధాకరం: పవన్‌

బంగ్లాదేశ్‌ లో హిందువులపై జరుగుతున్న హింసాకాండ చాలా బాధాకరమని ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ‘బంగ్లాదేశ్‌ ఏర్పడిందే భారత సైన్యం త్యాగాలతో. భారత్‌లో మైనారిటీలకు లభించే భద్రత బంగ్లాదేశ్‌లో హిం దువులకు లభించడం లేదు’ అన్నారు. అదానీ సోలార్‌ ప్రాజెక్టు విషయంలో ఏం చేయాలన్న విషయాన్ని సీఎం చంద్రబాబు పరిశీలిస్తున్నారన్నారు.

Updated Date - Nov 28 , 2024 | 05:50 AM