Ap Govt : త్వరలోనే కొత్త వక్ఫ్‌బోర్డు
ABN , Publish Date - Dec 02 , 2024 | 05:24 AM
వారం, పది రోజుల్లో నూతన వక్ఫ్ బోర్డు ఏర్పాటు చేయనున్నట్లు కూటమి ప్రభుత్వం తెలిపింది. ముందుగా అర్హులైన సభ్యులతో కొత్త బోర్డును ఏర్పాటు చేస్తామని, అనంతరం సమర్థుడైన వ్యక్తిని చైర్మన్‌గా సభ్యులు ఎన్నుకొంటారని పేర్కొంటూ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది.
వక్ఫ్ ఆస్తులను రక్షించలేకపోయిన పాత బోర్డు
అందుకే రద్దుచేశాం: రాష్ట్ర ప్రభుత్వం
అమరావతి, డిసెంబరు 1(ఆంధ్రజ్యోతి): వారం, పది రోజుల్లో నూతన వక్ఫ్ బోర్డు ఏర్పాటు చేయనున్నట్లు కూటమి ప్రభుత్వం తెలిపింది. ముందుగా అర్హులైన సభ్యులతో కొత్త బోర్డును ఏర్పాటు చేస్తామని, అనంతరం సమర్థుడైన వ్యక్తిని చైర్మన్‌గా సభ్యులు ఎన్నుకొంటారని పేర్కొంటూ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది. ‘‘గత ప్రభుత్వంలో నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటైన వక్ఫ్ బోర్డు, వక్ఫ్ ఆస్తులు పరిరక్షించడంలో పూర్తి నిర్లక్ష్యం ప్రదర్శించింది. పాలనా కార్యకలాపాలను కూడా విస్మరించింది. పైగా న్యాయ వివాదాల్లో చిక్కుకుంది. దీనిపై దాఖలైన పెండిగ్ వ్యాజ్యాలలో హైకోర్టు సూచనల మేరకు చర్యలు తీసుకున్నాం. వక్ఫ్‌బోర్డును రద్దు చేశాం. గత ప్రభుత్వం తెచ్చిన జీవో నం.47కు ఉపసంహరించాం’’ అని ఆ ప్రకటనలో తెలిపింది.
జీవో నం.47 ఉపసంహరణకు కారణాలివే...
గత వైసీపీ ప్రభుత్వం అడ్డగోలుగా విడుదల చేసిన జీవోల్లో జీవో నం.47 ఒకటి. ఈ జీవోకు వ్యతిరేకంగా కోర్టుల్లో 13 రిట్ పిటిషన్లు దాఖలయ్యాయి. ముస్లిం మైనారిటీల్లో ప్రధాన సమూహాలైన సున్నీలు, షియాలకు వక్ఫ్‌బోర్డులో ప్రాతినిధ్యం లేకుండాపోయింది. మాజీ ఎంపీలను బోర్డులో చేర్చుకోలేదు. జూనియర్ న్యాయవాదులను ఎంపిక చేయడం సీనియర్ న్యాయవాదులతో వివాదాలకు దారి తీసింది. వివిధ కోర్టుల్లో కేసుల కారణంగా వక్ఫ్ బోర్డు చైర్మన్ ఎన్నిక జరగలేదు. మార్చి 2003 నుంచి బోర్డు కార్యకలాపాలు స్తంభించాయి. వక్ఫ్‌బోర్డు దీర్ఘకాలికంగా పని చేయకపోవడం, దాని చట్టబద్దతను ప్రశ్నిస్తూ రిట్ పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం జీవో నం.47ను రద్దుచేసింది.
దుష్ప్రచారం తగదు: ఫారూఖ్ షిబ్లీ
కూటమి ప్రభుత్వం వక్ఫ్‌బోర్డు వ్యవస్థనే పూర్తిగా రద్దు చేసినట్టు కొన్ని సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారం అవాస్తవమని మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అఽధ్యక్షుడు ఫారూఖ్ షిబ్లీ తెలిపారు. సీఎం చంద్రబాబు, మైనారిటీ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్... మైనారిటీల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ వారికి అండగా ఉంటున్నారని పేర్కొన్నారు.