Share News

విచారణకు సహకరించకుంటే.. మోహిత్‌రెడ్డి బెయిల్‌ రద్దుకు పిటిషన్‌ వేశారా?

ABN , Publish Date - Oct 01 , 2024 | 05:06 AM

వైసీపీ నేత చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి దర్యాప్తునకు సహకరించకుంటే ఆయన బెయిల్‌ రద్దు కోసం ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది.

విచారణకు సహకరించకుంటే.. మోహిత్‌రెడ్డి బెయిల్‌ రద్దుకు పిటిషన్‌ వేశారా?

  • వివరాలు సమర్పించాలని పోలీసులకు హైకోర్టు ఆదేశం

  • విచారణ ఎల్లుండికి వాయిదా

అమరావతి, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): వైసీపీ నేత చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి దర్యాప్తునకు సహకరించకుంటే ఆయన బెయిల్‌ రద్దు కోసం ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను గురువారానికి (అక్టోబరు 3వ తేదీకి) వాయిదా వేసింది. న్యాయమూర్తి జస్టిస్‌ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు సోమవారం ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చారు. ఎన్నికల సందర్భంగా ఎస్‌వీయూ క్యాంపస్‌ పోలీసులు నమోదు చేసిన కేసులో తనపై జారీ చేసిన లుకవుట్‌ నోటీసును ఉపసంహరించేలా ఆదేశించాలని కోరుతూ మోహిత్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

ఈ వ్యాజ్యం సోమవారం విచారణకు రాగా.. పిటిషనర్‌ తరఫు న్యాయవాది వెంకటేశ్‌ వాదనలు వినిపించారు. ప్రస్తుత కేసులో మోహిత్‌రెడ్డికి పోలీసులు సీఆర్‌పీసీ సెక్షన్‌ 41ఏ కింద నోటీసులు ఇచ్చారని హైకోర్టు సైతం షరతులతో కూడిన ముందస్తు బెయిల్‌ మంజూరు చేసిందని తెలిపారు. విదేశాలకు వెళ్లకుండా నిషేధం విధిస్తూ ఎలాంటి షరతూ విధించలేదన్నారు. పిటిషనర్‌ రిఫరెన్స్‌ ఉంటేనే ఆయన సోదరుడికి లండన్‌ యూనివర్సిటీలో సీటు లభిస్తుందన్నారు.

అడ్మిషన్‌ పొందేందుకు అక్టోబరు 3 చివరి తేదీగా పేర్కొన్నారు. ఇప్పుడు వెళ్లకుంటే అడ్మిషన్‌ కోల్పోయే అవకాశం ఉందన్నారు. కేసు దర్యాప్తునకు సహకరిస్తున్న నేపథ్యంలో లుకవుట్‌ నోటీసును ఉపసంహరించేలా పోలీసులను ఆదేశించాలని కోరారు. ప్రభుత్వ న్యాయవాది సోమరాజు స్పందిస్తూ.. మోహిత్‌రెడ్డి దర్యాప్తునకు సహకరించడం లేదన్నారు. సోదరుడి అడ్మిషన్‌ పేరుతో విదేశాలకు పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. న్యాయమూర్తి స్పందిస్తూ.. ఆయన దర్యాప్తునకు సహకరించకుంటే బెయిల్‌ రద్దు కోసం సంబంధిత కోర్టులో పిటిషన్‌ ఏమైనా వేశారా అని ప్రశ్నించారు. పూర్తి వివరాలు కోర్టు ముందుంచాలని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేశారు.

Updated Date - Oct 01 , 2024 | 05:06 AM