Share News

AP News: రైతుకు కలిసొచ్చిన అదృష్టం.. పొలంలో వజ్రం లభ్యం.. అదెంత ధర పలికిందో తెలిస్తే..

ABN , Publish Date - Aug 24 , 2024 | 07:23 AM

వాన కురిస్తే ఎక్కడైనా రైతు కళ్లల్లో చెప్పలేనంత ఆనందం.. కానీ కర్నూలు జిల్లాలో మాత్రం రైతులే కాదు.. అందరి కళ్లలోనూ ఆనందమే. వాన వెలిసిన వెంటనే వజ్రాల వేట మొదలవుతుంది. చిన్నా పెద్దా తేడా లేకుండా వజ్రాల వేటలో పడతారు.

AP News: రైతుకు కలిసొచ్చిన అదృష్టం.. పొలంలో వజ్రం లభ్యం.. అదెంత ధర పలికిందో తెలిస్తే..

కర్నూలు: వాన కురిస్తే ఎక్కడైనా రైతు కళ్లల్లో చెప్పలేనంత ఆనందం.. కానీ కర్నూలు జిల్లాలో మాత్రం రైతులే కాదు.. అందరి కళ్లలోనూ ఆనందమే. వాన వెలిసిన వెంటనే వజ్రాల వేట మొదలవుతుంది. చిన్నా పెద్దా తేడా లేకుండా వజ్రాల వేటలో పడతారు. కొందరికి మాత్రం అదృష్టం ఎదురొచ్చి మరీ స్వాగతం పలుకుతుంది. వజ్రాల వేటకు వెళ్లకుండానే ఓ రైతుకు వజ్రం దొరికింది. సాదాసీదా వజ్రం కాదు.. మంచి మూల్యాన్ని తెచ్చిపెట్టిన వజ్రం దొరికింది. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో విలువైన వజ్రం లభ్యమైంది. పొలం పనులు చేస్తున్న వ్యవసాయ కూలికి వజ్రం దొరికింది. అదే పనిగా వజ్రాల వేటలో ఉన్నవారికి కూడా దొరకని విలువైన వజ్రం దొరికింది. దానిని ఓ వజ్రాల వ్యాపారి 12 లక్షల రూపాయల నగదు.. 5 తులాల బంగారం ఇచ్చి మరీ కొనుగోలు చేశాడు.


వాస్తవానికి సామాన్యులకు వజ్రాల విలువ తెలియదు. భారీగా ఖరీదు చేస్తుందని తెలుసు కానీ ఎంత ఖరీదు చేస్తుందనేది మాత్రం తెలియదు. దీంతో కొందరు వ్యాపారులు వారిని నిలువునా ముంచేస్తున్నారు. ఏజెంట్లను నియమించుకుని పెద్ద దందానే నడిపిస్తున్నారని తెలుస్తోంది. వారి ద్వారా ప్రతి ఏటా కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారని సమాచారం. కూలీలకు దొరికిన వజ్రాలను తక్కువ ధరకు కొనుగోలు చేసి వారు తరువాత ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారని తెలుస్తోంది. జియలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (GSI) కర్నూలు, అనంతపురం జిల్లాల సరిహద్దుల్లో వజ్రాల నిక్షేపాలు ఉన్నాయనే విషయాన్ని ఎప్పుడో గుర్తించింది. అంతేకాకుండా ఇక్కడి భూమి పొరల్లో కింబర్‌లైట్‌ పైప్‌లైన్‌ ఉందని గనులు భూగర్భ శాఖ నిర్ధారించింది. ఈ రెండు జిల్లాలలోని పలు మండలాల్లో జీఎస్ఐ చెప్పినట్టుగా తరచూ ఏదో ఒక ప్రాంతంలో వజ్రాలు లభ్యమవుతూనే ఉన్నాయి.


వాస్తవానికి వర్షం కురిసినప్పుడు అంటే వాతావరణంలో మార్పులు సంభవించినప్పుడు భూమిలో నుంచి విలువైన రాళ్లన్నీ బయటకు వస్తాయి. మధ్యప్రదేశ్‌లోని పన్నాలో డైమండ్ మైనింగ్ ఉంది. దానిలో భూమిలోని రాళ్లను తవ్వి తీసి మరీ వజ్రాల సెర్చింగ్ ప్రక్రియను చేపట్టడం జరుగుతుంది. అయితే కర్నూలు, అనంతపురం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లోని భూగర్భం కూడా వజ్రాలు ఉన్నాయి. అవి భూగర్భంలో 150 మీటర్ల లోతున ఉంటాయి. వాతావరణంలో మార్పులు సంభవించినప్పుడు అవి బయటకు వస్తాయి. ఆ తరువాత వికోశీకరణ కారణంగా ఎండకు ఎండటం వల్లనో లేదంటే వర్షానికి తడవటం వల్లనో పగిలిపోతాయి. ఆ పగిలిన ముక్కలన్నీ వర్షాలకు కొట్టుకుపోతాయి. అవి కాస్తా ఎవరికో ఒకరికి దొరుకుతూ ఉంటాయి.

Updated Date - Aug 24 , 2024 | 07:23 AM