Share News

వైసీపీ కుట్రలో సమిధలు!

ABN , Publish Date - Apr 07 , 2024 | 11:53 PM

‘మీకు ఉద్యోగాలు ఇచ్చింది మేమే.. ఎన్నికల్లో ఉపయోగపడతారు అనుకుంటే ఈసీ అడ్డుకట్ట వేసింది..

వైసీపీ కుట్రలో సమిధలు!

రాజీనామా చేయాలని వలంటీర్లపై వైసీపీ ఒత్తిడి

ససేమిరా అంటున్న మెజార్టీ వలంటీర్లు

జిల్లాలో 288 మందికిపైగా రాజీనామా

విధుల నుంచి 26 మంది తొలగింపు

ఎన్నికల విధులకు దూరం పెట్టిన ఈసీ

కార్యకర్తలుగా వాడుకోవాలని అధికార పార్టీ వ్యూహం

కర్నూలు, ఏప్రిల్‌ 7 (ఆంధ్రజ్యోతి): ‘మీకు ఉద్యోగాలు ఇచ్చింది మేమే.. ఎన్నికల్లో ఉపయోగపడతారు అనుకుంటే ఈసీ అడ్డుకట్ట వేసింది.. రాజీనామా చేసి ప్రచారంలో పాల్గొనండి...’ అధికార వైసీపీ నాయకులు వలంటీర్లపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. ఉన్నత చదువులు చదివినా గత్యంతరం లేక వలంటీర్లుగా పని చేస్తున్నాం.. వైసీపీ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి రాజకీయ రంగు వేసుకుంటే మా భవిషత్తు ప్రశ్నార్థకం కాదా..? అంటూ మరోవైపు పలువురు వలంటీర్లు ఆందోళన చెందుతున్నారు. యువత భవిషత్తుతో మాకేంటి? .. మాకు ఓట్లే ముఖ్యం.. రాజీనామా చేసి ప్రచారం చేయాల్సిందే అంటూ అధికార పార్టీ నేతలు వలంటీర్లపై ఒత్తిడి తెస్తున్నారు. పత్తికొండ నియోజకవర్గంలోనే166 మందికిపైగా రాజీనామా చేశారంటే వారిపై ఒత్తిడి ఏ స్థాయిలో ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. జిల్లాలో సుమారు 288 మందికి పైగా రాజీనామా చేశారు. మొత్తం మీద ఓట్లాటలో వలంటీర్లను సమిధలు చేస్తారా..? అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. రాజీనామా చేసిన వలంటీర్లను పోలింగ్‌ రోజు రాజకీయ పార్టీ ఏజెంట్లుగా కూర్చోకుండా అడ్డుకట్ట వేయాలని టీడీపీ డిమాండ్‌ చేస్తోంది.

26 మందిపై వేటు

సార్వత్రిక ఎన్నికల షెడ్యూలు విడుదల చేసిన రోజు నుంచే కోడ్‌ అమల్లోకి వచ్చింది. ఆ రోజు నుంచి ప్రభుత్వ ఖజానా నుంచి వేతనం, గౌరవ వేతనంతో పని చేసే ఉద్యోగులు, కాంట్రాక్ట్‌ సిబ్బంది, వలంటీర్లు ఎవరు కూడా రాజకీయ పార్టీల ప్రచారంలో నూ, రాజకీయ నాయకుల పర్యటనలోనూ పాల్గొనరాదు. కోడ్‌ను దిక్కరించి పలువురు వలంటీర్లు యథేచ్ఛగా వైసీపీ నాయకుల ర్యాలీలు, ఊరేగింపులు, కరపత్రాలు విడుదల వంటి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఫొటోలతో సహా సీ-విజిల్‌ యాప్‌కు ఫిర్యాదులు వెళ్లాయి. విచారణ చేయించిన జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ డాక్టర్‌ జి.సృజన 26 మందిని విధుల నుంచి తప్పించారు. వారిలో అత్యధికంగా ఎమ్మిగనూరు, పాణ్యం నియోజకవర్గం వలంటీర్లే ఉన్నారు. దీంతో వైసీపీ నాయకులు రాజీనామాల కుట్రకు సై అంటున్నారు.

జిల్లాలో 25 మండలాలు సహా కర్నూలు కార్పొరేషన్‌, ఆదోని, ఎమ్మిగనూరు, గూడూరు మున్సిపాలిటీల్లో 1,090 గ్రామ, వార్డు సచివాలయాలు ఉన్నాయి. వాటి పరిధిలో 10,150 మంది ఉన్నారు. వైసీపీ నాయకులు తమ రాజకీయ కుట్రలో భాగంగా వలంటీర్లను సమిధలుగా వాడుకుంటున్నారు. వారి వేలితో వారి కంట్లోనే పొడుస్తున్నారు. 2019 ఎన్నికల ముందు ప్రతిపక్ష నేతగా జగన్‌ ఓటు వేసి గెలిపించండి.. మన ప్రభుత్వం రాగానే జనవరి ఒకటో తేదీన జాబ్‌ క్యాలెండరు విడుదల చేసి లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం అంటూ నిరుద్యోగులకు ఆశలు కల్పించారు. జగన్‌ మాటలు నమ్మిన నిరుద్యోగ యువత నిండా మోసపోయింది. వలంటరీ వ్యవస్థను తీసుకొచ్చి 50 ఇళ్లకు ఒకరిని నియమించారు. బీటెక్‌, పీజీ, వంటి ఉన్నత చదువులు చదివిన యువతను వలంటీర్ల పేరుతో పక్కదారి పట్టించారు. జాబ్‌ క్యాలెండరు రాకపోదా..? మా భవిష్యత్తు బాగుపడదా..? అంటూ నిరీక్షిస్తూ వలంటీర్లుగానే ఐదేళ్ల కాలం గడిపేయాల్సి వచ్చింది. మళ్లీ ఎన్నికలు రావడంతో వలంటీర్లు వైసీపీ కార్యకర్తలే అంటూ వారికి రాజకీయ రంగు పూశారు. ఎన్నికల విధులకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) దూరం పెట్టడంతో ఎలాగైనా వారిని ఉపయోగించు కోవాలని రాజకీయ స్వార్థంతో రాజీనామాల కుట్రకు, ఎన్నికల సమయంలో వాళ్లను మానసికంగా ఇబ్బందులకు గురి చేసే కుతంత్రాలకు తెరతీశారు.

అత్యధికంగా పత్తికొండలో..:

జిల్లాలో వైసీపీ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి ఇప్పటి వరకు 288 మందికిపైగా వలంటీర్లు రాజీనామాలు చేశారు. అత్యధికంగా పత్తికొండ నియోజకవర్గం నుంచి ఒక్కటే 166 మంది మూకుమ్మడిగా రాజీనామాలు చేయడం కొసమెరుపు. వలంటీరుగా ఉద్యోగం మేమే ఇప్పించాం.. ఇప్పుడు రాజీనామా చేసి ఎన్నికల ప్రచారంలో వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే శ్రీదేవికి అనుకూలంగా ప్రచారం చేయాలని ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. తాము చెప్పినట్లు రాజీనామాలు చేయకపోతే ఎన్నికల తరువాత వచ్చేది తమ ప్రభుత్వమే.. అప్పుడు మిమ్మల్ని తొలగించి వేరే వాళ్లకు అవకాశమిస్తాం..? అంటూ వైసీపీ నాయకులు భయపెడుతున్నారు. దీంతో చేసేది లేక ఇష్టం లేకపోయినా రాజీనామలు చేయకతప్పడం లేదని వెల్దుర్తికి చెందిన ఓ వలంటీర్‌ ఆవేదన వ్యక్తం చేశాడు. వెల్దుర్తి మండలంలో 96 మంది, మద్దికెరలో 70 మంది, పత్తికొండలో 16 మంది, కృష్ణగిరిలో ఆరుగురు కలిపి మొత్తం 188 మంది వలంటీర్లు రాజీనామాలు చేశారు. ఈ మూకుమ్మడి రాజీనామాల వెనుక వైసీపీ కుట్ర దాగిఉందని ప్రతిపక్ష పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. అదే క్రమంలో మంత్రాలయం నియోజకవర్గంలో కూడా వలంటీర్లపై రాజీనామా ఒత్తిళ్లు పెరిగాయి. ఆ నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా వాల్మీకి సామాజికవర్గానికి చెందిన మాధవరం రాఘవేంద్రరెడ్డిని ఆ పార్టీ బరిలో దింపింది. మెజార్టీ వలంటీర్లు అదే సామాజికవర్గానికి చెందిన వారు ఉండడంతో వారితో బలంవంతంగా రాజీనామాలు చేయించి వైసీపీకి అనుకూలంగా ప్రచారం చేయించుకునే కుతంత్రానికి తెర తీస్తున్నారు. ముఖ్యంగా కోసిగి మండలంలో రాజీనామాలు చేయాలంటూ వలంటీర్లపై వైసీపీ ముఖ్య నాయకుడు ఒకరు తీవ్ర ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తుంది. అలాగే.. పాణ్యం నియోజకవర్గంలో కూడా ఇదే తీరుకు ఉంది. అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లతో ఓర్వకల్లు మండలంలో 67 మంది వలంటీర్లు రాజీనామాలు చేయడం కొసమెరుపు.

రాజీనామా చేసిన వారిని దూరం పెట్టాలి

వలంటీర్లతో బలవంతంగా రాజీనామా చేయించి తమకు అనుకూలంగా ప్రచారం చేయించుకునే కుట్రకు వైసీపీ నాయకులు తెర తీశారు. వారు రాజీనామా చేసినప్పటికీ ప్రచారంలో పాల్గొనకుండా, ఏజెంట్లుగా కూర్చోకుండా కట్టడి చేయాలి. ఈ విషయంపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తాం. ఓడిపోతామనే భయంతో వైసీపీ రాజకీయ కుట్రలకు పాల్పడుతోంది.

- బీటీ నాయుడు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు, కర్నూలు

Updated Date - Apr 07 , 2024 | 11:53 PM