Share News

సాగుకు సాయం చేస్తారా?

ABN , Publish Date - May 19 , 2024 | 11:42 PM

వ్యవసాయమంటే కష్టాలు కడగండ్లే. సేద్యం చేసి లాభపడిన వాళ్లెవరూ లేరని రైతులు అంటారు.

సాగుకు సాయం చేస్తారా?

విత్తనాలు, ఎరువులు, యంత్రాలకు ఎదురు చూపులు

ఓ వైపు ప్రకృతి వైపరీత్యాలు.. మరోవైపు అధికారుల నిర్లక్ష్యం

ప్రభుత్వ అండ లేదని రైతుల ఆక్రందన

కౌలు రైతులను పట్టించుకునేవారేరీ?

కర్నూలు(అగ్రికల్చర్‌), మే 19: వ్యవసాయమంటే కష్టాలు కడగండ్లే. సేద్యం చేసి లాభపడిన వాళ్లెవరూ లేరని రైతులు అంటారు. రెండేళ్లుగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో అతివృష్ఠి, అనావృష్ఠితో రైతులు తీవ్రంగా నష్టపోయారు. మరో పది రోజుల్లో ఖరీఫ్‌ సీజన్‌ మొదలు కానుంది. ఎప్పటిలాగే అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారా? లేక అండగా ఉంటారా? అని రైతులు ఎదురు చూస్తున్నారు. పంటల సాగుకు అవసరమైన పెట్టుబడిని రైతులకు అందించేందుకు ఏటా కలెక్టర్‌ ఆధ్వర్యంలో రుణ ప్రణాళికలను ఈపాటికే సిద్ధం చేసేవారు. అయితే.. ఈసారి సాధారణ ఎన్నికల నేపథ్యంలో రుణ ప్రణాళికను తయారు చేయడం ఆలస్యమైందని కర్నూలు జిల్లా వ్యవసాయ శాఖ జేడీ వరలక్ష్మి తెలిపారు. త్వరలో కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పంట సాగు కోసం ఎంత రుణం ఇచ్చేది కలెక్టర్ల ఆధ్వర్యంలో నిర్ణయం తీసుకుంటామని అన్నారు.

జిల్లాలో ప్రతి ఏటా వర్షాలు ఎప్పుడు వచ్చేదీ సందేహాస్పదంగా ఉండేది. అయితే గతంలా కాకుండా ఈసారి ఖరీఫ్‌ సాగుకు అనుకూలంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికార వర్గాలు తెలపడంతో రైతులు ఊరట చెందుతున్నారు. తమకు పంట రుణాలను సకాలంలో అందించడంతో పాటు కల్తీ, నాసిరకం విత్తనాల బెడద నుంచి కాపాడాలని వ్యవసాయ యంత్ర పరికరాలు ప్రతి రైతుకు అందేలా చర్యలు తీసుకోవాలని, అదే విధంగా ముఖ్యమైన ఎరువులు యూరియా, డీఏపీ తదితర వాటిని ఆర్‌బీకేల ద్వారా అందించాలని అధికారులను కోరుతున్నారు.

6.20 లక్షల హెక్టార్లలో పంటల సాగుకు సిద్ధం

ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఖరీఫ్‌ సీజన్‌లో రైతులు 6.20 లక్షల హెక్టార్లలో పంటలు సాగు చేసేందుకు సిద్ధం అవుతున్నట్లు వ్యవసాయ శాఖ అంచనా వేస్తోంది. ముఖ్యంగా పత్తి సాగులో కర్నూలు జిల్లా రాష్ట్రంలోనే రెండో స్థానంలో ఉన్నట్లు అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఖరీఫ్‌లో రెండు జిల్లాల్లో కలిపి ప్రధాన పంటల సాగు వివరాల్లోకి వెళితే.. పత్తి 2.30 లక్షల హెక్టార్లు, వరి 79,018 హెక్టార్లు, కందులు 48,229 హెక్టార్లు, వేరుశనగ 1.42లక్షల హెక్టార్లు, మొక్కజొన్న 30,154 హెక్టార్లు, జొన్న 14,062 హెక్టార్లు, కొర్ర 13,613 హెక్టార్లు, ఆముదం 54,406 హెక్టార్లు, మిరప 15,567 హెక్టార్లు, ఉల్లి 20,746 హెక్టార్లు, టమోటా 3,500 హెక్టార్లు అన్ని పంటలు కలిపి 6.20 లక్షల హెక్టార్లలో ఈ పంటలు సాగు చేసే అవకాశం ఉంది.

ఈ సారైనా వరుణుడు కరుణించేనా..?

ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఖరీఫ్‌లో రైతులు సాగు చేసే పంటలపై అతివృష్ఠి, అనావృష్ఠి దాడి చేస్తున్నాయి. రెండు జిల్లాల్లో కలిపి 670 ఎంఎం వర్షం ఖరీఫ్‌లో నమోదు కావాల్సి ఉండగా.. 2022లో సాధారణ వర్షపాతానికి మించి 800 ఎంఎంకు పైగా వర్షాలు పడ్డాయి. దీంతో రైతులు సాగు చేసిన పంటలన్నీ నీట మునిగి రైతులు కోలుకోలేని దెబ్బ తిన్నారు. 2023లో తీవ్ర అనావృష్ఠి ఫలితాలు రైతుల్ని దెబ్బతీశాయి. 670 ఎంఎం వర్షానికి గాను కేవలం 300 ఎంఎం వర్షం మాత్రమే నమోదైంది. దీంతో పంటలన్నీ మట్టిపాలయ్యాయి. ఈసారి వాతావరణ శాఖ అధికారులు చల్లని కబురు అందించారు. మే నెలాఖరుకే ఎల్వినో ప్రభావం తగ్గిపోయి లానినో ప్రభావం వల్ల వర్షాలు కురుస్తాయని, సాధారణ వర్షాలకు ఢోకా ఉండదని ప్రకటించడంతో రైతులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం వారం రోజులుగా రెండు జిల్లాల్లో వర్షాలు పడుతుండటంతో రైతులు పంట సాగు కోసం పొలాలను సిద్ధ్దం చేసుకుంటున్నారు. ముందస్తుగా విత్తనాలు వేయడం వల్ల అధిక దిగుబడి వచ్చేందుకు అవకాశం ఉంటుందని, తెగుళ్లు కూడా తక్కువగా ఉంటాయని వారు చెబుతున్నారు.

కల్తీ విత్తనాల నుంచి విముక్తి కలిగేనా..?

ఉమ్మడి కర్నూలు జిల్లాలో నాణ్యమైన విత్తనాలు రైతులకు అందడమే గగనంగా మారిపోయింది. రైతుల అవసరాలను తమ ప్రయోజనాల కోసమే అన్నట్లుగా వ్యాపారులు జేబులు నింపుకోవడం సాధారణమై పోయింది. ముఖ్యంగా పత్తి 2 లక్షల హెక్టార్లకు పైగా సాగులో ఉన్నా కూడా అవసరమైన బీటీ-2 విత్తనాలు అందించడానికి జిల్లా వ్యవసాయ శాఖ శ్రద్ధ తీసుకోవడం లేదనే ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. 2022, 2023 ఖరీఫ్‌ సీజన్‌లలో రైతుల్ని నాణ్యమైన పత్తి విత్తనాల పేరుతో దళారులు, వ్యాపారులు కొంత మంది అధికారుల అండదండలతో నాసిరకం, కల్తీ విత్తనాలను రైతులకు అంటగట్టారు. 2022 సంవత్సరంలో జాదూరకం కంపెనీకి చెందిన నాసిరకం విత్తనాలను పొలాల్లో విత్తడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ రైతులకు దాదాపు రూ.20 కోట్లు చెల్లించాలని జిల్లా వ్యవసాయ శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినా ఇంత వరకు ఆ రైతులకు నష్టపరిహారం అందించలేదు.

సాయం అరకొరే

ఉమ్మడి కర్నూలు జిల్లాలో దాదాపు ఏడున్నర లక్షల మంది రైతులు వ్యవసాయంపైనే ఆధారపడ్డారు. 6.20 లక్షల హెక్టార్లలో పంటలు సాగు చేస్తున్నారు. ఈ రైతులకు ఖరీఫ్‌ సీజన్‌లో గత సంవత్సరం 8వేల కోట్ల పంట రుణాలను అందించారు. ఈ సంవత్సరం ఎన్నికల కారణం చూపి రుణ ప్రణాళికను ఇంకా ఖరారు చేయలేదని వ్యవసాయ శాఖ అధికార వర్గాలు తెలిపాయి. ఈ సంవత్సరమైనా తమకు వ్యవసాయ పనులు చేసుకోవడానికి పూర్తి సబ్సిడీతో యంత్ర పరికరాలు అందించాలని రైతులు కోరుతున్నారు. ప్రభుత్వం ఇస్తున్న పెట్టుబడి సాయం ఏ మూలకు సరిపోవడం లేదని, కనీసం రూ.30వేల దాకా ఇవ్వాలని రైతులు అభిప్రాయపడుతున్నారు.

రైతులకు సరిపడా ఎరువులు ఎక్కడ..?

ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఖరీఫ్‌ సీజన్‌లో పంటల సాగు కోసం రైతులు దాదాపు 5లక్షల మెట్రిక్‌ టన్నుల ఎరువులను వినియోగిస్తారు. ప్రధానంగా డీఏపీ, యూరియా, కాంప్లెక్స్‌ ఎరువులతో పాటు పొటాష్‌ తదితర ఎరువులను రైతులు ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఏటా రైతులు రైతుభరోసా కేంద్రాల ద్వారా తమకు అవసరమైన ఎరువులను తీసుకునేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసినా 90 శాతం ఆర్‌బీకేల ద్వారా అవసరమైన ఎరువులు రైతులకు అందించే పరిస్థితి కనిపించడం లేదు. ప్రభుత్వం మార్క్‌ఫెడ్‌ ద్వారా ఎరువులను, ఆర్‌బీకేల ద్వారా రైతులకు చేరవేస్తున్నట్లు కాగితాల్లో మాత్రమే చెబుతోంది. రైతులంతా ప్రైవేటు డీలర్లనే అధిక ధర చెల్లించి డీఏపీ, యూరియా తదితర ఎరువులను కొనుగోలు చేస్తున్నారు. ఒక్కో బస్తాపై రైతులు రూ.50 నుంచి రూ.100 వరకు అదనంగా చెల్లించి కొంటున్నారు. ఇదే అదునుగా కొంత మంది దళారులు వ్యాపారులు నాసిరకం ఎరువులను రైతులకు అంటగడుతున్నారు.

ఉమ్మడి జిల్లాలో రాబోయే ఖరీఫ్‌లో సాగు చేయనున్న పంటల విస్తీర్ణం వ్యవసాయ శాఖ అంచనా (హెక్టార్లలో)

పంట పేరు విస్తీర్ణం

పత్తి 2.30 లక్షల

హెక్టార్లు

వరి 79,018

జొన్న 14,062

మొక్కజొన్న 30,154

కొర్ర 13,613

కంది 48,228

వేరుశనగ 1,42,000

ఆముదం 54,406

మిరప 15,567

ఉల్లి 30,746

టమోట 3వేలు

ఇతర పంటలు 45వేలు

మొత్తం 6.20 లక్షల

హెక్టార్లు

ప్రభుత్వం సాయం చేయాలి

ఓ వైపు ప్రకృతి వైపరీత్యాలు.. మరో వైపు అధికారుల నిర్లక్ష్యం కారణంగా వ్యవసాయం మాకు ఏ మాత్రం గిట్టుబాటు కావడం లేదు. ఒకప్పుడు పండుగలా కొనసాగిన సాగు ప్రస్తుతం ఆందోళన కలిగించేలా తయారైంది. ప్రభుత్వం మరింత సాయం చేస్తే తప్ప మేము కోలుకోం.

- రైతు భాస్కర్‌ రెడ్డి, నక్కలవాగు పల్లె

రైతులకు అండగా ఉంటాం

రాబోయే ఖరీఫ్‌ సీజన్‌లో రైతులు పంటలు సాగు చేసుకునేందుకు అన్ని రకాలుగా అండగా ఉంటాం. కల్తీ, నాసిరకం విత్తనాలను రైతులకు అంటగట్టే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రత్యేక తనిఖీ బృందాలను ఏర్పాటు చేశాము. అదే విధంగా రైతులకు దాదాపు 15వేల క్వింటాళ్ల వేరుశనగ, కంది, తదితర విత్తనాలను 40 శాతం సబ్సిడీపై అందించేందుకు చర్యలు చేపట్టాము. ఇందులో భాగంగా శుక్రవారం నుంచే ఆయా గ్రామాల్లోని రైతుభరోసా కేంద్రాల్లో రాయితీ విత్తనాల కోసం తమ పేర్లను పొలాల వివరాలను నమోదు చేయించాలని కోరుతున్నాము. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం అండగా ఉంటుంది. త్వరలోనే రుణ ప్రణాళికను ఖరారు చేసి రైతులకు సకాలంలో పంట రుణాలను అందిస్తాం.

- వరలక్ష్మి, జేడీ

వ్యవసాయాన్ని జూదంగా మార్చేశారు

రైతులు పంటలను సాగు చేసుకునేందుకు అవసరమైన సహాయ సహకారాలు అందించడంలో ప్రబుత్వం ఏ మాత్రం శ్రద్ధ తీసుకోవడం లేదు. మరోవైపు దళారులు, వ్యాపారులు అధికారులు రాజకీయ నాయకుల అండదండలతో రైతులను నిండా ముంచుతున్నారు. నాసిరకం విత్తనాలను, ఎరువులను రైతులకు అంటగట్టుతున్నారు. చివరికి పంట నష్టానికి గురైన రైతులకు న్యాయంగా అందించాల్సిన పరిహారాన్ని అందించడంలో ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తున్నది.

- జగన్నాథం, రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి

Updated Date - May 19 , 2024 | 11:42 PM