Share News

ఈ అనాసక్తి దేనికి?

ABN , Publish Date - May 21 , 2024 | 12:11 AM

ఓటర్లందరూ ఎన్నికల్లో పాల్గొనాలని ప్రభుత్వం, ఎలక్షన్‌ కమిషన్‌ చాలా ప్రయత్నాలు చేస్తుంటాయి.

ఈ అనాసక్తి దేనికి?

ఇల్లు దాటని పట్టణ ఓటర్లు..!

ఓటింగ్‌కు దూరంగా 4.85 లక్షల ఓటర్లు

ఓటు వేయని వారిలో అత్యధికులు కర్నూలు, ఆదోని ఓటర్లే

సెలవు ఇచ్చినా పోలింగ్‌ కేంద్రానికి రాని వైనం

గతం కంటే పెరిగిన పోలింగ్‌

కర్నూలు, మే 20 (ఆంధ్రజ్యోతి): ఓటర్లందరూ ఎన్నికల్లో పాల్గొనాలని ప్రభుత్వం, ఎలక్షన్‌ కమిషన్‌ చాలా ప్రయత్నాలు చేస్తుంటాయి. ఓటు ప్రజాస్వామ్యానికి వెన్నెముక అని, ఓటుతో తలరాతలు మార్చుకోవచ్చని, ఓటు వేయడం పౌరుల బాధ్యత అని ప్రచారం చేస్తుంటారు. ఈసారి సార్వత్రికల ఎన్నికల్లో అయితే అధికారుల పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు కూడా చేపట్టారు. చివరాఖరికి పోటీలో ఉన్న ప్రధాన పార్టీల అభ్యర్థులు శక్తిమేరకు డబ్బులు కూడా పంచినట్లు సమాచారం. అయినా ఒక్క కర్నూలు జిల్లాలోనే 4.85 లక్షల మంది ఓటర్లు పోలింగ్‌ కేంద్రానికి వెళ్లడానికి ఆసక్తి చూపలేదు. ఓటు చుట్టూ ప్రచారంలో ఉన్న భావనలపట్ల పౌరుల్లో ఉన్న అనుమానాలను ఈ అనాసక్తి ఎత్తి చూపుతోంది. ఎవ్వరికి ఓటు వేసినా ఒకటే అనిగాని, ఎవరు గెలిచినా మన కష్టాలు మనకు తప్పదనిగాని పౌరులు అనుకుంటున్నట్లు భావించవచ్చు. ఓటర్లు తమ జీవితానుభవాల నుంచి ఈ వైఖరికి వచ్చారా? అనేదాన్ని కూడా ఇది సూచిస్తున్నదా? ఆలోచించాల్సి ఉంటుంది. అదీ ప్రధానంగా పట్టణ, నగర ఓటర్లే ఆసక్తి చూపలేదంటే ఎన్నికల ప్రక్రియపట్ల ఇదొక ధోరణిగా గుర్తించాలా? ఏదేమైనా ఈ విడత పోలింగ్‌ బాగా పెరిగినా 23.58 శాతం ఓటర్లు జిల్లాలో పోలింగ్‌లో పాల్గొనలేదు.

ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో గతంకంటే పోలింగ్‌ శాతం పెరిగింది. పోలింగ్‌లోని అనేక ధోరణులు విజయావకశాలను ప్రభావితం చేస్తాయి. అందులో పోలింగ్‌ పెరగడం ఒకటి. దీన్ని పరిగణలోకి తీసుకొని ఫలితాలు ఎలాఉండవచ్చునో విశ్లేషణలు సాగుతున్నాయి. కానీ ఆశ్చర్యకరమైన అంశం ఏమంటే జిల్లాలో 23.58 శాతం ఓటర్లు పోలింగ్‌లో పాల్గొనలేదని తేలింది. వారిలో అత్యధికులు నగర, పట్టణ ఓటర్లే ఉన్నారు. విద్యావంతులు, రాజకీయ పరిణామాలపట్ల ఎంతో కొంత అవగాహన ఉన్న వాళ్లు హోరాహోరిగా సాగిన ఎన్నికల పట్ల ఉదాసీనంగా ఉండిపోయారు. గ్రామీణ ప్రాంతాల్లో పెరిగిన పోలింగ్‌లాగే పట్టణ ప్రాంతాల్లోని ఈ అనాసక్తత కూడా ఎన్నికలపట్ల ఒకానొక వైఖరికి గుర్తనే విశ్లేషణలు సాగుతున్నాయి. నిజానికి ఈసారి ఎన్నికల షెడ్యూలు జారీ చేసినప్పటి నుంచి పోలింగ్‌ రోజు వరకు ఓటర్లందరూ పోలింగ్‌లో పాల్గొనాలని అధికారులు వివిధ రూపాల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. అయినా.. ఫలితం కనిపించ లేదు. కర్నూలు నగరం, ఆదోని, పాణ్యం నియోజకవర్గంలోని కల్లూరు అర్బన్‌ వార్డుల్లో ఎక్కువ శాతం ఓటర్లు పోలింగ్‌ కేంద్రాలకు వెళ్లలేదని తెలుస్తోంది. నగర/పట్టణ ప్రాంతాల్లో, అందులోనూ విద్యావంతులు ఉండే ప్రాంతాల్లో పోలింగ్‌ తగ్గడానికి గల కారణాలపై రాజకీయ నాయకులు, జిల్లా అధికారులు ఆరా తీస్తున్నారు. మేధావి వర్గంగా భావించేవాళ్లు ఇంత పెద్ద సంఖ్యలో ఆసక్తి చూపకపోవడం మన ప్రజాస్వామ్య ప్రక్రియల మంచి చెడ్డలను అంచనా వేసుకోడానికి దోహదం చేస్తుందనే చర్చ జరుగుతోంది. ప్రశ్నించే గొంతుకులే ఓటు వేయకపోతే ప్రజాస్వామ్య తీర్పు ఎలా ఉంటుందో..? అనే చర్చ కూడా జరుగుతోంది.

నగర/పట్టణ ఓటర్లే అధికం

ఓటేసేందుకు దూరంగా ఉన్న ఓటర్లలో అత్యధికులు నగర, పట్టణ ఓటర్లే ఉన్నారు. కర్నూలు నియోజకవర్గంలో నగరంలో 99,492 మంది ఓటు వేయలేదు. అంటే.. మొత్తం ఓటర్లలో 36.25 శాతం ఓటింగ్‌ దూరంగా ఉన్నారు. ఆదోని నియోజకవర్గంలో 87,994 ఓటర్లు (33.45 శాతం), పాణ్యం నియోజకవర్గంలో 85,771 ఓటర్లు (25.56 శాతం) ఓటర్లు ఓటు వేయలేదు. ఈ మూడు నియోజకవ ర్గాల్లో అర్బన్‌ ఓటర్లే పోలింగ్‌ రోజున ఇల్లు దాటకపోవడం కొసమెరుపు. పత్తికొండ, మంత్రాలయం,. ఆలూరు, ఎమ్మిగ నూరు నియోజకవర్గాల్లో 15-20 శాతంలోపే ఓటర్లు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. 3 లక్షలకు పైగా ఓటర్లు ఓటు వేయలేదని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.

పోలింగ్‌కు దూరంగా 4.85 లక్షల ఓటర్లు:

జిల్లాలో ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో 20,54,563 మంది ఓటర్లు ఉన్నారు. ఈ నెల 13న జరిగిన పోలింగ్‌ లెక్కలు పరిశీలిస్తే 15,70,007 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. 76.42 శాతం పోలింగ్‌ నమోదైంది. 4,84,556 ఓటర్లు అంటే 23.58 శాతం ఓటు వేయలేదని తెలుస్తున్నది. 2009 ఎన్నికల్లో ఆదోని నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన కె.మీనాక్షినాయుడుకు 45,294 ఓట్లు, కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన వై. సాయిప్రసాద్‌రెడ్డికి 45,038 ఓట్లు వచ్చాయి. కేవలం 256 ఓట్ల తేడాతో మీనాక్షినాయుడు విజయం సాధించారు. అంటే.. పోలైన 1,16,604 ఓట్లతో పోలిస్తే కేవలం 0.22 శాతం ఓట్లు తేడానే అభ్యర్థుల భవితవ్యమే మార్చేసింది. కర్నూలు నియోజకవర్గంలో 1952 ఎన్నికల్లో దామోదరం సంజీవయ్య ప్రత్యర్థి శంకరరెడ్డిపై కేవలం 0.82 శాతం ఓట్ల తేడాతో గెలిచారు. 2004 ఎన్నికల్లో సీపీఎం అభ్యర్థి ఎంఏ గఫూర్‌ ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి టీజీ వెంకటేశ్‌పై 1.69 శాతం, 2014 ఎన్నికల్లో ఎస్వీ మోహన్‌రెడ్డి 2.41 శాతం ఓట్ల తేడాతో గెలిచారు. ఎమ్మిగనూరు నియోజకవర్గంలో 2009 ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి చెన్నకేశవరెడ్డి ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి బీవీ మోహన్‌రెడ్డిపై కేవలం 1.81 శాతం ఓట్ల తేడాతోనే విజయం సాధించారు. 1952 నుంచి 2019 వరకు జిల్లాలో జరిగిన ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే.. చాలా నియోజకవర్గల్లో ఒక శాతం కంటే తక్కువ ఓట్ల తేడాతో గెలిచి అసెంబ్లీకి వెళ్లిన ఎమ్మెల్యేలు ఉన్నారు. 1-5 శాతం లోపు ఓట్ల తేడాతో విజయం సాధించిన ఎమ్మెల్యే అనేక మంది ఉన్నారు. ఏకంగా 23.58 శాతం ఓటర్లు గడప దాటి పోలింగ్‌ కేంద్రాలకు వెళ్లలేదంటే ఆ ప్రభావం ఎవరిపై ఉంటుందనే చర్చ జరుగుతోంది. వీరిలో కనీసం 10-15 శాతం ఓటర్లు పోలింగ్‌ కేంద్రాలకు వచ్చి ఓటు వేసి ఉంటే జూన్‌ 4 నాటి ఫలితాల్లో భారీగా మార్పు ఉండేదని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.

జిల్లాలో కర్నూలు పార్లమెంట్‌ నియోజకవర్గం సహా కర్నూలు, కోడుమూరు (ఎస్సీ), ఎమ్మిగనూరు, మంత్రాలయం, ఆదోని, ఆలూరు, పత్తికొండ, పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ నెల 13న పోలింగ్‌ జరిగింది. అభ్యర్థుల భవితవ్యం ఈవీఎం యంత్రాల్లో నిక్షిప్తమై రాయలసీమ యూనివర్సిటీ స్ట్రాంగ్‌ రూంల్లో మూడంచెల భద్రత మధ్య భద్రంగా ఉంది. జూన్‌ 4న ఓట్ల లెక్కింపు ఉంటుంది. అందుకోసం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టరు డాక్టర్‌ జి. సృజన నేతృత్వంలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఓట్ల లెక్కింపు సిబ్బందితో శనివారం సమావేశం అయ్యారు. అదే క్రమంలో జిల్లాలో ఏ నియోజకవర్గంలో ఏ అభ్యర్థి గెలుస్తారు..? ఉమ్మడి జిల్లాలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి..? రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసే పార్టీ ఏదీ..? ఏ ఇద్దరు కలసినా ఇదే చర్చ జరుగుతున్నది. అదే క్రమంలో రాజకీయ నాయకులు పట్టణ వార్డులు, గ్రామాల వారిగా పోలైన ఓట్ల లెక్కలను ముందేసుకొని పోలింగ్‌ సరళి పరిశీలిస్తున్నారు. ఎక్కడ పోలింగ్‌ శాతం తగ్గింది..? అందుకు గల కారణాలు ఏమిటి..? అనే వివరాలను ఆరా తీస్తున్నారు. అయితే.. గతం కంటే పోలింగ్‌ శాతం పెరిగినా లక్షల మంది ఓటర్లు పోలింగ్‌ కేంద్రాలకు వచ్చి ఓటు వేసేందుకు ఆసక్తి చూపలేదు.

జిల్లాలో మొత్తం ఓట్లు, పోలైన ఓట్లు,

పోలింగ్‌కు దూరంగా ఉన్న ఓటర్ల వివరాల

నియోజకవర్గం మొత్తం పోలైన ఓటుకు శాతం

ఓట్లు ఓట్లు దూరంగా

కర్నూలు 2,74,465 1,74,973 99,492 36.25

పాణ్యం 3,31,706 2,46,935 85,771 25.56

పత్తికొండ 2,23,603 1,90,009 33,594 15.01

కోడుమూరు(ఎస్సీ) 2,46,632 1,95,181 55,451 20.86

ఎమ్మిగనూరు 2,47,752 2,03,086 44,666 18.03

మంత్రాలయం 2,08,350 1,75,667 32,683 15.69

ఆదోని 2,63,058 1,75,064 87,994 33.45

ఆలూరు 2,58,997 2,09,092 49,905 19.27

మొత్తం 20,54,563 15,70,007 4,84,556 23.58

Updated Date - May 21 , 2024 | 12:11 AM