Share News

అక్కడే ఎందుకు..?

ABN , Publish Date - Feb 29 , 2024 | 12:56 AM

కర్నూలు మెడికల్‌ కళాశాల (కేఎంసీ) ఆట స్థలంలో బహుళ ప్రయోజనాల కేంద్రం (మల్టీ యుటిలిటీ సెంటర్‌) నిర్మాణం కోసం పూర్వ విద్యార్థుల సంఘం (ఓల్డ్‌ స్టూండెంట్స్‌ అసోసియేషన్‌) ముందుకు వచ్చింది.

అక్కడే ఎందుకు..?

మల్టీ యుటిలిటీ నాలెడ్జ్‌ సెంటర్‌ నిర్మాణం

వైద్య కళాశాల

ఆట స్థలంలో 60 సెంట్ల కేటాయింపు

రూ.60 కోట్లకు పైగా విలువైన స్థలం కాజేసే కుట్రేనా?

ప్రధాన రోడ్డు పక్కనే ఇవ్వడంపై అభ్యంతరాలు

కర్నూలు, ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి)/కర్నూలు హాస్పిటల్‌: కర్నూలు మెడికల్‌ కళాశాల (కేఎంసీ) ఆట స్థలంలో బహుళ ప్రయోజనాల కేంద్రం (మల్టీ యుటిలిటీ సెంటర్‌) నిర్మాణం కోసం పూర్వ విద్యార్థుల సంఘం (ఓల్డ్‌ స్టూండెంట్స్‌ అసోసియేషన్‌) ముందుకు వచ్చింది. ఈ సెంటర్‌ నిర్మాణంపై ఎవరికి ఎలాంటి అభ్యంతరాలు లేవు.. అయితే వాణిజ్య అవసరాలకు అనుకూలమైన రూ.కోట్ల విలువ చేసే ప్రధాన రోడ్డు పక్కన గల 60 సెంట్ల స్థలం కేటాయించడంపైనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మల్టీ యుటిలిటీ సెంటర్‌ కేంద్రం ముసుగులో విలువైన స్థలం కబ్జా చేసే కుట్రలో భాగంగానే ఎన్నికల ముందు ఈ సెంటర్‌ను తెరపైకి తెచ్చారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. విద్యార్థుల ప్రయోజనార్థమే ఈ కేంద్రం నిర్మించేటట్లయితే శ్రీకృష్ణదేవరాయ సర్కిల్‌ పక్కనే ఎందుకు కేటాయించారు..? గతంలో కేటాయించిన న్యూ లెక్చరర్స్‌ గ్యాలరీ ముందు, కొత్తగా నిర్మించి స్టేట్‌ క్యాన్సర్‌ యూనిట్‌ సమీపంలో ఖాళీ స్థలంలో నిర్మించవచ్చు కదా.. అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఆంధ్ర రాష్ట్రం ఆవిర్భావం తరువాత వెనుకబడిన రాయలసీమ జిల్లాల్లో మెడికల్‌ కాలేజీ నిర్మించాలనే ప్రతిపాదన వచ్చింది. కర్నూలు నగరంలో కర్నూలు వైద్య కళాశాల (కేఎంసీ) నిర్మాణానికి 1955 నవంబరు 29న జీవో నంబరు 1835 జారీ చేశారు. నాడు రాష్ట్రంలోనే మూడో కాలేజీ ఇది. 50 మంది విద్యా విద్యార్థులతో క్లాసులు ప్రారంభించారు. వంద ఎకరాలకు పైగా విస్తీర్ణంలో 36 వైద్య యూనిట్లు ఏర్పాటు చేశారు. ఏటా 250 అండర్‌ గ్రాడ్యుయేట్స్‌ ప్రవేశం కల్పిస్తున్నారు. ప్రస్తుతం ఈ కాలేజీలో 1,000 ఎంబీబీఎస్‌, 250 మంది హౌస్‌ సర్జన్స్‌, 400 మంది పోస్టుగ్రాడ్యుయేట్స్‌ (పీజీ) కలిపి 1,650 మంది విద్యార్థులు వైద్య విద్యను అభ్యసిస్తున్నారు. ఇక్కడ చదువుకున్న వైద్యులు రాష్ట్రం, దేశంలోనే కాదు.. ప్రపంచంలోని వివిధ దేశాల్లో ప్రముఖ స్థిరపడ్డారు. కేఎంసీ ఓల్డ్‌ స్టూడెండ్స్‌ అసోషియేషన్‌ - అలుమ్ని, నార్త్‌ అమెరికా కేఎంసీ ఓల్డ్‌ స్టూడెంట్స్‌ అసోషియేషన్‌గా ఏర్పడి.. కళాశాల అభివృద్ధి, విద్యార్థుల సంక్షేమం కోసం వంటి వివిధ సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే కేఎంసీ గ్రాడ్యుయేట్స్‌ ట్రస్ట్‌గా ఏర్పడి మల్టీ యుటిలిటీ నాలెడ్జ్‌ సెంటర్‌ నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నారు. దీనిని వైద్యులు, వైద్య విద్యార్థులు స్వాగతిస్తున్నారు. అయితే.. ఈ సెంటర్‌ నిర్మాణం కోసం కేటాయించిన స్థలం విషయంలోనే తీవ్ర అభ్యంతరాలు ఉన్నాయి. రూ.కోట్ల విలువ చేసే కాలేజీ ప్లేగ్రౌండ్‌ కబ్జా చేయాలనే కుట్ర దాగి ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

రూ.60 కోట్లకు పైగా విలువైన స్థలం

వైద్య విద్యార్థు కోసం మల్టీ యుటిలిటీ నాలెడ్జ్‌ సంటర్‌ నిర్మాణం స్థలం కావాలని కేసీఎం గ్రాడ్యుయేట్స్‌ ట్రస్ట్‌ కోశాధికారి మహేశ్‌కుమార్‌ మర్దా డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ (డీఎంఈ) లేఖ రాశారు. ప్రభుత్వంలోని పెద్దలు ద్వారా చక్రం తిప్పారు. దీంతో ఆగమేఘాలపైన ఫైల్‌ ముందుకు కదిలింది. మెడికల్‌ కాలేజీ ఆట స్థలం (ప్లేగ్రౌండ్‌)లో 60 సెంట్లు కేటాయించారు. ఈ స్థలం నగరం వాణిజ్యపరంగా అభివృద్ధి చెందుతున్న శ్రీకృష్ణదేవరాయల సర్కిల్‌ ప్రధాన రోడ్డుకు ఆనుకొని ఉంది. ఇక్కడ బహిరంగ మార్కెట్‌ రేటు ప్రకారం సెంటు రూ.కోటికి పైగానే పలుకుతోంది. అంటే.. ఆ స్థలం రూ.60 కోట్ల పైమాటే. ఎంతో విలువైన.. భవిష్యత్తు అవసరాలకు ఉపయోగపడే స్థలాన్ని నాలెడ్జ్‌ సెంటర్‌ పేరిట ప్రైవేటు ట్రస్ట్‌కు కేటాయించడం అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. వైద్య విద్యార్థులకు నాలెడ్జ్‌ సెంటర్‌ నిర్మించాలనుకోవడం మంచి నిర్ణయమే. అయితే.. రూ.కోట్ల విలువ చేసే ఆట స్థలం కేటాయించడం ఎంతవరకు సబబు అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ సెంటరు పేరిట ప్రధాన రోడ్డు వైపు షాపింగ్‌ కాంప్లెక్స్‌ (వాణిజ్య దుకాణాలు) నిర్మించాలనే యోచన ఉన్నట్టు తెలుస్తోంది. ఇందుకు అధికార వైసీపీ కీలక నాయకులు, ఓ ప్రజాప్రతినిధి ద్వారా చక్రం తిప్పి ప్రభుత్వం పెద్దలపై ఒత్తిడి తెచ్చినట్టు సమాచారం. రూ.60 కోట్లకుపైగా విలువైన స్థలం తీసుకోవడం వెనుక స్వార్థ ప్రయోజనాలే ఎక్కువగా ఉన్నాయనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. నిజంగా సేవా చేయాలనే చిత్తశుద్ధి ఉంటే.. గతంలో ప్రతిపాదించిన మేరకు న్యూ లెక్చరర్‌ గ్యాలరీ ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో లేదంటే స్టేట్‌ క్యాన్సర్‌ యూనిట్‌ వెనకాల ఉన్న ఖాళీ స్థలంలో.. పీజీ హౌస్‌ సర్జన్‌ క్వార్టర్స్‌ ఆవరణలో ఉన్న ఖాళీ స్థలంలో.. లేదంటే ఇప్పుడు కేటాయించిన ప్లేగ్రౌండ్‌ పడమర వైపు నిర్మించవచ్చు. కానీ అలాంటి నిర్ణయం తీసుకోకపోవడానికి కారణం అందులో దాగి ఉన్న స్వార్థ ప్రయోజనమే ముఖ్యంగా కనిపిస్తోంది

కుచించుకుపోతున్న ఆట స్థలం

కేఎంసీ ఆట స్థలం (ప్లేగ్రౌండ్‌) ఏడు ఎకరాల్లో ఏర్పాటు చేశారు. వివిధ అవసరాలకు ఆట స్థలం కేటాయిస్తూ రావడంతో ప్రస్తుతం 4.30 - 5 ఎకరాలు మాత్రమే మిగిలింది. అందులో కూడా ప్రధాన రోడ్డుకు ఆనుకొని 60 సెంట్లు కేఎంసీ గ్రాడ్యుయేట్స్‌ ట్రస్ట్‌కు కేటాయించారు. వివిధ అవసరాలకు ఆట స్థలం కేటాయించడం ఎంతవరకు సబబు అని క్రీడాకారులు ప్రశ్నిస్తున్నారు.

ఈ సెంటర్‌ వల్ల ఉపయోగాలు

కేఎంసీ గ్రాడ్యుయేట్స్‌ ట్రస్ట్‌ నిర్మించదలిచన మల్టీ యుటిలిటీ నాలెడ్జ్‌ సెంటర్‌లో భాగంగా సెలిట్‌ కోర్టు, టెబుల్‌ టెన్నీస్‌, ఆడిటోరియం, రీడింగ్‌ రూం, డిజిటల్‌ లైబ్రరీ సహా విద్యార్థులు తల్లిదండ్రులు, బంధువులు వస్తే విశ్రాంతి కోసం గదులు నిర్మిస్తారు. ఇందు కోసం రూ.35 కోట్లు అవసరం అవుతాయని అంచనా. ఈ నిధులను కేఎంసీ ఓల్డ్‌ స్టూడెంట్స్‌ అసోషియేషన్‌, నార్త్‌ అమెరికా కేఎంసీ ఓల్డ్‌ స్టూడెంట్స్‌ అసోసియేషన్‌ సమకూర్చనుంది. ప్రస్తుతం కేఎంసీ పూర్వ విద్యార్థుల అసోసియేషన్‌ (అలుమ్ని) వద్ద ఉన్నది రూ.1.50 కోట్లే అని తెలుస్తోంది. మిగిలిన డబ్బులు వివిధ దేశాల్లో స్ధిరపడిన కేఎంసీ ఓల్డ్‌ స్టూడెంట్స్‌ అయిన ఎన్‌ఆర్‌ఐలు సమకూరుస్తారని ఆ సంఘం నాయకులు అంటున్నారు.

డీఎంఈ కేటాయించారు

కేఎంసీ ప్లేగ్రౌండ్‌లో మల్టీ యుటిలిటీ నాలెడ్జ్‌ సెంటర్‌ నిర్మాణం కోసం కేఎంసీ గ్రాడ్యుయేట్స్‌ ట్రస్ట్‌కు 60 సెంట్లు కేటాయించిన మాట నిజమే. ఈ ట్రస్ట్‌ ప్రభుత్వానికి విన్నవిస్తే పరిశీలించి డీఎంఈ ఈ స్థలాన్ని కేటాయించారు. ఇదే విషయాన్ని ఏపీఎంఎస్‌ఐడీసీ ఈఈ శివకుమార్‌ దృష్టికి తీసుకెళ్లగా ఈ నాలెడ్జ్‌ సెంటర్‌ ట్రస్ట్‌ నిర్మాణం చేపడితే నాణ్యతా ప్రమాణాలు పర్యవేక్షించమని మాత్రమే మాకు చెప్పారు. అంతకు మించి మాకు ఎలాంటి సమాచారం లేదు.

- డాక్టర్‌ పి.సుధాకర్‌, ప్రిన్సిపాల్‌, కర్నూలు వైద్య కళాశాల, కర్నూలు

Updated Date - Feb 29 , 2024 | 12:56 AM