టిడ్కో ఇళ్లు ఎప్పుడిస్తారు?
ABN , Publish Date - Dec 25 , 2024 | 12:28 AM
పట్టణ పేదలకు సొంతింటి కల నిజం చేయాలని గత టీడీపీ ప్రభుత్వం ఏపీ టిడ్కో ఇళ్ల నిర్మాణాలకు శ్రీకారం చుట్టింది.
గత టీడీపీ ప్రభుత్వంలోనే గృహ ప్రవేశాలకు సన్నాహాలు
వైసీపీ హయాంలో నిర్లక్ష్యం
ముళ్ల కంపలు పెరిగి శిథిలావస్థకు చేరుతున్న నిర్మాణాలు
మళ్లీ చంద్రబాబు ప్రభుత్వం రాకతో లబ్ధిదారుల్లో ఆశలు
కూటమి ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలైనా పంపిణీకి నోచుకోని వైనం
పట్టణ పేదలకు సొంతింటి కల నిజం చేయాలని గత టీడీపీ ప్రభుత్వం ఏపీ టిడ్కో ఇళ్ల నిర్మాణాలకు శ్రీకారం చుట్టింది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 52,318 ఇళ్లు మంజూరు చేసింది. దాదాపుగా 23,645 టిడ్కో ఇళ్ల నిర్మాణాలు 90 శాతానికి పైగా పూర్తయ్యాయి. 2019 మేలో జగన్ సారథ్యంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక టిడ్కో ఇళ్ల వ్యవహారం వెనక్కిపోయింది. రూ. వందల కోట్లు ఖర్చు చేసి నిర్మించిన ఇళ్లు నిరుపయోగంగా మారాయి. ముళ్లకంప పెరిగింది. ఇనుప కడ్డీలు తుప్పు పట్టాయి. ఇళ్లలో దొంగలు పడి విద్యుత్ వైర్లు దోచుకెళ్లారు. మళ్లీ టీడీపీ కూటమి ప్రభుత్వం రావడంతో లబ్ధిదారుల్లో ఆశలు చిగురించాయి. ఈ ప్రభుత్వం వచ్చి ఆరు నెలలైనా పట్టించుకోకపోవడంతో .. టిడ్కో ఇళ్లు ఎప్పుడిస్తారని లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారు. గతంలో ఇళ్లలో చేరిన పేదలు తాగునీరు, రోడ్లు, రవాణా.. వంటి సౌకర్యాలు లేక అవస్థలు పడుతున్నారు. కొందరు ఖాళీ చేసి వెళ్లిపోయారు. ఏపీ టిడ్కో ఇళ్ల దుస్థితిపై ఆంధ్రజ్యోతి క్షేత్రస్థాయి పరిశీలన కథనం.
కర్నూలు, డిసెంబరు 24 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి కర్నూలు జిల్లాలో కర్నూలు, నంద్యాల, ఆదోని, ఎమ్మిగనూరు, డోన్, ఆళ్లగడ్డ, ఆత్మకూరు పట్టణాల్లో పేదలకు నీడ కల్పించాలనే సంకల్పంతో గత టీడీపీ ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన-ఎన్టీఆర్ ఇళ్లు పథకం కింద నాలుగు విడతల్లో 52,318 ఏపీ టిడ్కో ఇళ్లు మంజూరు చేసింది. దీనికి రూ.3,130 కోట్లు కేటాయించింది. ఇటుకలు, పిల్లర్లు లేకుండా షేర్‌వాల్ టెక్నాలజీతో జీ+3 అపార్ట్‌మెంట్స్ నిర్మాణాలు చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ టౌన్ ఇన్ర్ఫాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏపీ టిడ్కో) ఇంజనీర్ల పర్యవేక్షణలో.. మహారాష్ట్రకు చెందిన షాపూర్జీ, పల్లన్‌జీ సంస్థకు ఈ ఇళ్ల నిర్మాణాలు పనులు మొదలు పెట్టారు. 31,280 ఇళ్లకు అగ్రిమెంట్ చేసుకోగా.. క్షేత్రస్థాయిలో 30,672 ఇళ్ల నిర్మాణాల పనులు మొదలయ్యాయి. 2019 జనవరి నాటికే 23,645 ఇళ్లు పూర్తి చేశారు. లబ్ధిదారులను కూడా ఎంపిక చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన లబ్ధిదారుల వాటా నగదు కూడా నాలుగు విడతల్లో చెల్లించారు. నిబంధనలు ప్రకారం మెజార్టీ ఇళ్ల నిర్మాణం పూర్తి చేయడంతో గృహ ప్రవేశాలకు సన్నాహాలు చేశారు. అయితే.. తాగునీరు, రోడ్లు, విద్యుత్.. వంటి మౌలిక వసతుల కల్పనతో జాప్యం కావడం, ఇంతలోనే ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో గృహ ప్రవేశాలు జరగలేదు.
వైసీపీ ఐదేళ్ల నిర్లక్ష్యం.. పేదలకు శాపం
2019 మేలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడడంతో ఏపీ టిడ్కో ఇళ్ల పంపిణీ వ్యవహారం ఆగిపోయింది. ఉమ్మడి జిల్లాలో మంజూరైన 52,318 ఇళ్లలో టెండర్లు జరిగి పనులు మొదలు పెట్టని 21,038 ఇళ్లను రద్దు చేశారు. మిలిగిన 31,289 ఇళ్లలో 23,645 ఇళ్లు టీడీపీ ప్రభుత్వ కాలంలో 90 శాతానికి పైగా పూర్తయ్యాయి. కొన్ని ఇళ్లు గృహ ప్రవేశాలకు సిద్ధం చేశారు. 2,500 ఇళ్లకు రివర్స్ టెండరింగ్ పద్ధతిలో టెండర్లు పూర్తి చేసినా పనులు మొదలు పెట్టలేదు. అయితే.. కొన్నాళ్లుకు టిడ్కో ఇళ్ల పంపిణీ పేరిట నాటి వైసీపీ ప్రభుత్వం హడావుడి చేసింది. 23,645 ఇళ్లకు గాను 7,007 ఇళ్ల లబ్ధిదారులకు తాళాలు అప్పగించారు. కనీస సౌకర్యాలు లేకపోవడంతో నేటికి 150-200 ఇళ్లలో కూడా లబ్ధిదారులు నివసించడం లేదు. నందికొట్కూరు, ఆత్మకూరు పట్టణాల్లో ఫేజ్-4లో మంజూరు చేసిన 3,800 టిడ్కో ఇళ్లు వైసీపీ హయాంలో రద్దు చేశారు. రూ.వేల కోట్లు ఖర్చు చేసిన ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన ఇళ్లు నిరుపయోగంగా మారాయి. శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. కర్నూలు నగరంలో టిడ్కో ఇళ్లలో దొంగలు పడి పలు అపార్ట్‌మెంట్లలో విద్యుత్ వైరు దోచుకెళ్లారు. ఆ ఇళ్లలో నేటికి విద్యుత్ వైరింగ్ చేయలేదు.
నగరం, పట్టణాలకు దూరంగా టిడ్కో ఇళ్లు నిర్మించారు. తాగునీరు, రహదారులు, పట్టణాల్లో పనులకు వెళ్లాలంటే రవాణా, పిల్లలకు పాఠశాలలు, ఆస్పత్రులు వంటి కనీస వసతులు మృగ్యమయ్యాయి. దీంతో ఇళ్లు ఇచ్చినా నివసించేందుకు పేదలు భయందోళన వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు నగరానికి దాదాపు 8-10 కి.మీల దూరంలో కర్నూలు-నంద్యాల జాతీయ రహదారి బైపాస్ రోడ్డు పక్కనే జగన్నాథగట్టుపై 10 వేల ఇళ్లు నిర్మాణం చేపడితే.. 8,829 ఇళ్లు పూర్తి చేశామని, 2,064 మంది లబ్ధిదారులకు ఇళ్లను అప్పగించామని ఇంజనీర్లు తెలిపారు. అయితే.. కనీస వసతులు లేకపోవడంతో 65 కుటుంబాలు కూడా నివసించడం లేదు. వారు కూడా ఖాళీ చేసి వెళ్లిపోయేందుకు సిద్ధం అవుతున్నారు. ఎమ్మిగనూరు పట్టణం శివన్న నగరంలో 1.920 ఇళ్లు లబ్ధిదారులకు అప్పగిస్తే 25 కుటుంబాలకు మించి నివసించడం లేదు. ఆదోనిలో 1,632 ఇళ్లు అప్పగిస్తే వాటిలో ఒక్క కుటుంబం కూడా ఉండటం లేదు. నంద్యాలలో 2,096, ఆళ్లగడ్డలో 1,392 ఇళ్లు లబ్ధిదారులకు అప్పగిస్తే కనీస వసతులు లేక ఆ ఇళ్లలో ఉండేందుకు లబ్ధిదారులు ఆసక్తి చూపడం లేదు. తాగునీటి పైపులైన్లు, ఓహెచ్‌ఆర్ ట్యాంకుల నిర్మాణాలు అసంపూర్తిగా ఉన్నాయి. మౌలిక వసతులకు కర్నూలు జిల్లాలో రూ.33.73 కోట్లు, నంద్యాల జిల్లాలో 16.10 కోట్లు అవసరమని అధికారులు పేర్కొంటున్నారు.
ఆరు నెలలైనా..
కూటమి ప్రభుత్వం జూన్ 12న కొలువుదీరింది. టిడ్కో ఇళ్ల తాజా పురోగతిపై అదే నెలలో సర్వే చేయడంతో లబ్ధిదారుల్లో ఆశలు చిగురించాయి. అయితే.. ఐదు నెలలు గడిచినా పంపిణీ చేయకపోగా మౌలిక వసతులపై దృష్టి సారించలేదు. కనీసం ముళ్ల పొదలు కూడా తొలగించలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కనీస సౌకర్యాలు కల్పించి ఇళ్లు పంపిణీ చేయాలని లబ్ధిదారులు కోరుతున్నారు.
ఉమ్మడి జిల్లాలో టీడీపీ ఇళ్ల పురోగతి వివరాలు
నగరం/పట్టణం అగ్రిమెంట్ పనులు మొదలు పూర్తైన లబ్ధిదారులకు
అయిన ఇళ్లు పెట్టిన ఇళ్లు ఇళ్లు అప్పగించిన ఇళ్లు
ఫ కర్నూలు జిల్లా:
కర్నూలు నగరం 10,000 10,000 8,829 2,064
ఆదోని 4,704 4,720 3,494 1,632
ఎమ్మిగనూరు 4,272 4,272 4,272 1,920
మొత్తం 18,976 18,992 16,595 5,616
ఫ నంద్యాల జిల్లా:
నంద్యాల పట్టణం 10,000 9,000 5,370 2,096
డోన్ 306 288 288 --
ఆళ్లగడ్డ 2,304 1,392 1,392 1,392
మొత్తం 12,610 11,680 7,050 3,488
బస్సు లేదు.. నీళ్లు రావు
నగరంలో అద్దె కట్టలేక రెండేళ్ల క్రితం ఇక్కడికి వచ్చాం. బస్సు సౌకర్యం లేదు. పనులకు, పిల్లలను బడికి పంపడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. రాత్రివేళ రావాలంటే ఎన్నో అవస్థలు. పిల్లలను బడికి పంపాలంటే నెలకు ఆటో బాడుగ రూ.1,500 వరకు చెల్లించాల్సి వస్తున్నది. ఇక్కడికి వచ్చి వృద్ధులకు పింఛన్లు ఇవ్వడం లేదు. రేషన్ వాహనం రావడం లేదు. రాత్రిళ్లలో గుర్తు తెలియని వ్యక్తులు తిరుగుతున్నారు. పెట్రోలింగ్ పెట్టాలని కోరినా పట్టించుకోవడం లేదు.
- ఈశ్వర్, టిడ్కో కాలనీ, కర్నూలు
వసతులు ఏర్పాటు చేయాలి
అన్ని ఏర్పాట్లు చేశామంటూ గతేడాది వైసీపీ ప్రభుత్వం మాకు ఇంటిని అప్పగించింది. అంతా బాగుందన్న భావనతో ఇక్కడకు వచ్చి నివాసం ఉంటున్నాం. తీరా చూస్తే సదుపాయాలు సరిగా లేవు. తాగునీటికి కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. నీటికోసం రోజూ వంద రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోంది. పేదలమైన తాము తాగేందుకు నెలకు రూ.3 వేలు ఖర్చు చేస్తే మిగిలేన వాటిని కొనేదెలా? ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం పూనుకుని అన్ని వసతులు ఏర్పాటు చేయాలి.
- ప్రసాద్, టిడ్కో లబ్ధిదారుడు, ఎస్సార్బీసీ కాలనీ, నంద్యాల.
రాకపోకలకు ఇబ్బందే
ఇక్కడ వసతులు ఏమీ లేవు. అన్నింటికి టౌనులోనికి పోవాల్సిన పరిస్థితి. ఆటో వాళ్లు ఇక్కడికి రావాలంటే రూ.100కు పైనే అడుగుతున్నారు. ఇక సాయంత్రం ఆరు దాటిందంటే రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ నివాసం ఉండెదెలా? అద్దె భారం తగ్గుతుందని, సొంత ఇల్లు అని ఉండాల్సి వచ్చినా, సరైన సౌకర్యాలు లేక ఇబ్బంది పడుతున్నాం. కూటమి ప్రభుత్వం కాలనీలో నివాసముంటున్న వారికి ఇబ్బంది లేకుండా సదుపాయాలు కల్పించాలి.
- షేక్షావలి, టిడ్కో లబ్ధిదారుడు, ఎస్సార్బీసీ కాలనీ, నంద్యాల