Share News

డ్రోన్‌లతో పిచికారి ఎప్పుడు?

ABN , Publish Date - Feb 15 , 2024 | 12:32 AM

వ్యవసాయంలో సాంకేతికతను పెంచితే సాగు ఖర్చు తగ్గుతుంది.

డ్రోన్‌లతో పిచికారి ఎప్పుడు?

వ్యవసాయంలో సాంకేతికత ఒట్టి మాటే

మూడేళ్లుగా ముందుకు సాగని పనులు

కర్నూలు(అగ్రికల్చర్‌), ఫిబ్రవరి 14: వ్యవసాయంలో సాంకేతికతను పెంచితే సాగు ఖర్చు తగ్గుతుంది. ఆ దిశగా వైసీపీ ప్రభుత్వం చేస్తున్న వాగ్దానాలకు లోటు లేదు. మూడేళ్ల కిందట సాగు ఖర్చు తగ్గించడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి కిసాన్‌ డ్రోన్ల పథకాన్ని అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు వ్యవసాయ శాఖ సమాయత్తమైంది. అయితే.. ఈ మూడేళ్లలో ఈ పథకం ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. మెకనైజ్‌డ్‌ అగ్రికల్చర్‌ పథకం కింద ఉమ్మడి జిల్లాలో 30 మండలాల్లోని రైతులకు దాదాపు రూ.9 కోట్ల ఖర్చుతో 90 డ్రోన్లను పంపిణీ చేస్తామని వ్యవసాయ శాఖ అధికారులు మూడేళ్లుగా విపరీతంగా ప్రచారం చేస్తున్నారు. ఇదంతా నిజమే అని రైతులు నమ్మారు. కేవలం అవగాహన సమావేశాలతోనే వ్యవహారం ఆగిపోయింది. యూనిట్‌ కాస్ట్‌ ఎక్కువ కావడం, బ్యాంకు రుణాలకు వడ్డీలో సబ్సిడీ లేకపోవడం, డ్రోన్లను ఆపరేట్‌ చేసేందుకు శిక్షణ తీసుకోవాల్సి రావడం, వీటన్నింటికి మించి డ్రోన్లను వినియోగించేందుకు రక్షణ శాఖ నుంచి లైసెన్సు తీసుకోవాలనే నిబంధన ఉండటంతో రైతులు కిసాన్‌ డ్రోన్లపై ఆసక్తి చూపడం లేదు.

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తమ మొదటి ప్రాధాన్యత రైతులకు ప్రయోజనం చేకూర్చడమే ఽఅని ఆర్భాటంగా ప్రకటించారు. పంటల సాగులో రైతులు ఇబ్బంది పడకుండా నాణ్యమైన అధిక దిగుబడులు సాధించేందుకు కిసాన్‌ డ్రోన్ల పథకం తీసుకొచ్చారు. మూడేళ్లుగా ఈ పథకం అమలులో ప్రభుత్వం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదని రైతులు అంటున్నారు. దీంతో రైతులు ఈ కిసాన్‌ డ్రోన్ల పథకంపై ఆశ వదులుకున్నారు. మెకనైజ్‌డ్‌ అగ్రికల్చర్‌ పథకం కింద ఉమ్మడి జిల్లాలోని దాదాపు 30 మండలాల రైతులకు రూ.9 కోట్లతో 90 డ్రోన్లను పంపిణీ చేసేందుకు వ్యవసాయ శాఖ అధికారులు గత మూడేళ్లుగా సభలు, సమావేశాలు, అవగాహన కార్యక్రమాలు చేపడుతూనే ఉన్నారు. అయితే ఇప్పటి దాకా ఈ పథకం పనులు ఏ మాత్రం ముందుకు వెళ్లడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.

మొక్కుబడిగా శిక్షణ

కర్నూలు జిల్లాలో కిసాన్‌ డ్రోన్ల పథకానికి మండలానికి మూడు డ్రోన్ల పంపిణీ చొప్పున రైతు సంఘాలకు పంపిణీ చేయాలని వ్యవసాయ శాఖ యంత్రాంగం నిర్ణయించింది. 184 రైతు సంఘాలను ఏర్పాటు చేశారు. మొదటి దశ కింద 20 సంఘాలను ఎంపిక చేశారు. ఈ 20 సంఘాలకు సంబంధించి కేవలం 9 మంది యువ రైతులకు డ్రోన్లను నడిపేందుకు అవసరమైన శిక్షణ గుంటూరులోని లాంఫామ్‌ వ్యవసాయ క్షేత్రంలో ఇచ్చారు. అదే విధంగా నంద్యాల జిల్లాలో 75 గ్రూపులను ఏర్పాటు చేశారు. మొదటి విడత 20 గ్రూపులను ఎంపిక చేసి కేవలం 12 మంది యువ రైతులకు డ్రోన్లను నడపడంలో శిక్షణ ఇచ్చారు. కర్నూలు, నంద్యాల జిల్లాలో 21 మందికి శిక్షణ ఇచ్చారే గానీ.. ఇప్పటి దాకా ఎంపిక చేసిన గ్రూపులకు డ్రోన్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కిసాన్‌ డ్రోన్‌ పథకం ద్వారా రైతులకు రైతులకు పంట పొలాల్లో తెగుళ్లు, పురుగుల నివారణను సత్వరమే చేపట్టేందు కోసం డ్రోన్ల వినియోగాన్ని అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే పథకాన్ని సకాలంలో రైతులకు అందుబాటులోకి తెచ్చేందుకు ఎటువంటి సన్నాహాలు చేపట్టలేదు.

రూ. 9 కోట్లతో 90 డ్రోన్ల పంపిణీకి సన్నాహాలు

రాష్ట్ర వ్యాప్తంగా 2వేల డ్రోన్లను పంపిణీ చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం కిసాన్‌ డ్రోన్ల పథకాన్ని అమలు చేయాలని అనుకుంది. ప్రతి జిల్లాలో మండలానికి 3 డ్రోన్ల చొప్పున కిసాన్‌ డ్రోన్‌ హైరింగ్‌ సెంటర్లు (కేడీసీహెచ్‌సీ)ల ద్వారా పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో డ్రోన్‌ ధర రూ.10 లక్షలు ఖర్చు అవుతుందని అధికారులు తెలిపారు. ఐదుగురు రైతులను ఒక గ్రూపుగా ఏర్పాటు చేసి కమ్యూనిటీ హైరింగ్‌ గ్రూపు (సీహెచ్‌సీ) ఏర్పాటు చేస్తారు. ఈ గ్రూపునకు రూ.10 లక్షల విలువ చేసే డ్రోన్‌ను పంపిణీ చేస్తారు. ఇందు కోసం ఐదుగురు ఒక్కొక్కరు రూ.20వేల చొప్పున మొత్తం రూ.లక్ష పెట్టుబడి పెట్టాల్సి ఉంది. వీరికి బ్యాంకు రుణానికి ప్రభుత్వమే పూచిగా ఉండి ఇప్పిస్తుంది. మిగిలిన రూ.4 లక్షలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడిగా అందిస్తాయని అధికారులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం ఈ సబ్సిడీని భరిస్తాయి. రైతులు తీసుకున్న రూ.5లక్షల రుణాన్ని 36 నెలల్లో కంతుల్లో చెల్లించాల్సి ఉంటుంది. ఈ డ్రోన్‌ను సంఘాలు ఇతర రైతులకు అద్దె ప్రాతిపదికన పంపడం జరుగుతుంది. అద్దెలో వచ్చే లాభంతో బ్యాంకు రుణాలు తీర్చవచ్చు.

ఆసక్తి చూపని రైతులు

ఉమ్మడి కర్నూలు జిల్లాలో 70 శాతం మంది రైతులు చిన్న, సన్నకారు రైతులే ఉన్నారు. పదెకరాల కంటే ఎక్కువ పొలం ఉన్న రైతులు కేవలం 20 శాతం మంది మాత్రమే. 4-5 ఎకరాలకు తక్కువ విస్తీర్ణం ఉన్న రైతులు ఈ డ్రోన్ల వినియోగంపై పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. కిసాన్‌ డ్రోన్‌ పథకంపై జిల్లా వ్యవసాయ శాఖ యంత్రాంగం వచ్చే ఖరీఫ్‌ సీజన్‌కు అవగాహన కార్యక్రమాలను వంద శాతం పూర్తి చేసి డ్రోన్ల వినియోగాన్ని ఆచరణలోకి తెస్తున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటన జారీ చేసింది. అయితే.. రైతులు మాత్రం వీటి వినియోగంపై పెద్దగా ఆసక్తి చూపడం లేదు. యూనిట్‌లోని ప్రతి రైతు రూ.20వేల చొప్పున పెట్టుబడి పెట్టాలన్న నిబంధన తేవడం, బ్యాంకు రుణానికి, వడ్డీకి సబ్సిడీ లేకపోవడం, 36 నెలల్లో రుణం తీర్చాలనడం మొదలైన నిబంధనలు ఉండటంతో రైతులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. మరోవైపు డ్రోన్‌ ఆపరేటింగ్‌కు ఇంటర్‌ చదివిన రైతులకే అవకాశం కల్పిస్తామనడంతోపాటు శిక్షణకు ఎక్కువ రోజులు వెచ్చించేందుకు రైతులు ఉత్సాహం చూపడం లేదు. కపోవడం వంటి కారణాలు కూడా ఉన్నాయి.

ఈ సంవత్సరమే డ్రోన్లను వినియోగంలోకి తెస్తాం

రైతులు పంటల సాగులో ఎన్నెన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీటిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం డ్రోన్ల ద్వారా రసాయన మందులను పిచికారి చేస్తే తెగుళ్లను అరికట్టవచ్చని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సంవత్సరం డ్రోన్లను వినియోగంలోకి తెచ్చేందుకు ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి.

- వరలక్ష్మి, జేడీ

Updated Date - Feb 15 , 2024 | 12:32 AM