Share News

చలనమేది..?

ABN , Publish Date - Dec 27 , 2024 | 11:41 PM

సాధారణంగా ఏదైనా అవినీతికి సంబంధించిన విషయం బయటపడితే అధికారులు వెంటనే అప్రమత్తమవుతారు.

చలనమేది..?
బేతంచర్లలో తనిఖీలు నిర్వహిస్తున్న అధికారులు(ఫైల్‌)

గోడౌన్‌ యజమానులను కనీసం విచారించని వైనం

వివరాలు సేకరించే పనిలో ఉన్నామంటున్న దాటవేత

నంద్యాల, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): సాధారణంగా ఏదైనా అవినీతికి సంబంధించిన విషయం బయటపడితే అధికారులు వెంటనే అప్రమత్తమవుతారు. అక్కడ ఏం జరిగిందని ఆరా తీసి నిజానిజాలను నిగ్గు తేల్చే పనిలో పడతారు. కానీ జిల్లా యంత్రాంగం, అధికారుల తీరు మాత్రం అందుకు భిన్నంగా ఉంది. ‘బుగ్గన బంధువుల గోడౌన్‌లో బియ్యం మాయం’, ‘పేదల బియ్యానికి రెక్కలు’ పేరిట ‘ఆంధ్రజ్యోతి’ గురువారం కథనాలను ప్రచురించింది. ఈ విషయాల పట్ల జిల్లా యంత్రాంగం నుంచి గానీ, సంబంధిత అధికారుల నుంచి కనీస స్పందన లేదు. అంతేగాకుండా అందుబాటులో లేకుండా పోయిన బుగ్గన బంధువులను కనీసం విచారించిన దాఖలాలు లేవు. మొత్తానికి బియ్యం అక్రమార్కులను అధికారులు కాపాడే ప్రయత్నం చేస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

అవసరం లేని చోట గోడౌన్లు

పీడీఎస్‌ బియ్యం సరఫరా చేసేందుకు బేతంచర్లలో గోడౌన్‌లు అవసరమే లేదు. ఇక్కడి నుంచి సరఫరా చేయకముందు డోన్‌, బేతంచర్ల, ప్యాపిలి, బనగానపల్లె ఎంఎల్‌ఎస్‌ పాయింట్లకు ఇతర ప్రాంతాల నుంచి సరఫరా అయ్యేవి. బుగ్గన ఒత్తిడితో సివిల్‌ సప్లైస్‌ అధికారులు బేతంచర్లలో గోడౌన్‌లు ఏర్పాటు చేసేందుకు పూనుకున్నారు. దీనికోసం బుగ్గన రెండు ప్రైవేటు గోడౌన్‌లు ఏర్పాటు చేయించి ఒకటి రాష్ట్ర వేర్‌ హౌస్‌కు లీజుకు ఇవ్వగా, మరొకటి ఆయన అనుయాయులు ప్రైవేటుగా నడుపుకునేందుకు వీలుగా అధికారులను ఒప్పించినట్లు ఆరోపణలున్నాయి. గత వైసీపీ ప్రభుత్వంలో పంట ఉత్పత్తులను, పంట నిల్వలను దాచుకునేందుకు స్టేట్‌ వేర్‌ హౌస్‌ గోడౌన్లను వాడుకోవాలని, దీనివల్ల ప్రైవేటు గోడౌన్లకు ప్రత్యేకంగా ప్రభుత్వ ఖజానా నుంచి ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదని 2022లో ఉత్తర్వులు జారీ చేసింది. అయితే వైసీపీ ప్రభుత్వం చెప్పిన మాటలను వారి మంత్రులు, నాయ కులు పట్టించుకోకుండా ప్రైవేటు గోడౌన్లను ప్రోత్సహించి స్టేట్‌ వేర్‌హౌస్‌ గోడౌన్లను భ్రష్టు పట్టించారు.

ఖర్చు తడిసి మోపెడు..

రాష్ట్ర ప్రభుత్వం మిల్లర్ల వద్ద నుంచి బియ్యం సేకరిస్తోంది. ఆ తర్వాత బియ్యాన్ని రైల్వే వ్యాగన్ల ద్వారా ఆయా ప్రాంతాలకు చేరవేస్తుంది. అదేవిధంగా పీడీఎస్‌ బియ్యం ఇతర జిల్లా నుంచి నంద్యాల బఫర్‌ గోడౌన్లకు చేరుతాయి. ఇక్కడ నుంచి బేతంచర్లతో పాటు మిగతా ఎంఎల్‌ఎస్‌ పాయింట్లకు పంపిస్తారు. అయితే బుగ్గన చెప్పినట్లు విన్న సివిల్‌ సప్లైస్‌ అధికారులు బేతంచర్లలో గోడౌన్‌ ఏర్పాటు చేశారు. దీంతో నంద్యాల వరకు మాత్రమే పరిమితమయ్యే రైల్వే వ్యాగన్‌ బేతంచర్ల వరకు వెళ్లాల్సి వస్తోంది. ఇక్కడి నుంచి మళ్లీ ఆయా ఎంఎల్‌ఎస్‌ పాయింట్లకు, అక్కడి నుంచి డీలర్లకు తరలించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో సివిల్‌ సప్లైస్‌ శాఖ మీద భారీ ఖర్చు పడుతోంది. నంద్యాల నుంచి డోన్‌, ప్యాపిలి, కోయిలకుంట్ల, బనగానపల్లె ఎంఎల్‌ఎస్‌ పాయింట్లకు తరలించేందుకు రూ.12,98,946 ఖర్చు అవుతుండగా, బేతంచర్ల నుంచి ఆయా ఎంఎల్‌ఎస్‌ పాయింట్లకు తరలించేందుకు దాదాపు రూ.9.32 లక్షలు ఖర్చు అవుతోంది. అంటే నెలకు దాదాపు రూ.3.66 లక్షలు మిగులుతోంది. చూసే వారికి బేతంచర్లలతో బఫర్‌ గోడౌన్‌లు ఏర్పాటు చేయటం సబబే అనిపిస్తుంది. కానీ ఇక్కడే ఓ మతలబు ఉంది. తణుకు నుంచి పీడీఎస్‌ బియ్యం నంద్యాలకు తరలించడానికి దాదాపు రూ.19.69 లక్షలు ఖర్చు అవుతుండగా, తణుకు నుంచి బేతంచర్లకు తరలించడానికి రూ.21.60 లక్షలు అవుతోంది. అంటే బియ్యం తరలించిన ప్రతిసారి రూ.1.91 లక్షలు అదనంగా ఖర్చు చేయాల్సి వస్తోంది. బేతంచర్లలో ఏర్పాటు చేసిన గోడౌన్లకు నెలకు బాడుగ రూపంలో రూ.10,35,700 ఖర్చు అవుతోంది. అలా కాకుండా నంద్యాలలో ఉన్న గోడౌన్లు వాడుకుంటే ఈ బాడుగ రూపంలో చెల్లించే మొత్తం మిగులుతుంది. అంటే బేతంచర్ల వరకు రైల్వే వ్యాగన్‌ వెళ్లేందుకు అయ్యే ఖర్చు, అక్కడి బఫర్‌ గోడౌన్ల ఖర్చు కూడా మిగులటంతో పాటు, అక్కడ సరుకును దించేందుకు అయ్యే హమాలీ, గూడ్సు నుంచి గోడౌన్లకు చేరేవేసేందుకు అయ్యే ఖర్చు నెలకు దాదాపు రూ.10 లక్షలు సివిల్‌ సప్లైస్‌ శాఖకు ఆదా అవుతుంది. ఈ లెక్కన సంవత్సరానికి రూ.1.20 కోట్లు మిగులుతాయి. బుగ్గన బంధువుల జేబులు నింపడానికి కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు చేస్తున్న సివిల్‌ సప్లైస్‌ అధికారుల తీరును చూసి ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు.

సాధారణంగా ప్రతి నెలా బేతంచర్లకు కోనసీమ నుంచి, నంద్యాలకు పశ్చిమ గోదావరి నుంచి బియ్యం వ్యాగన్‌ వస్తున్నట్లు సమాచారం. అయితే ఈ సారి బేతంచర్ల బఫర గోడౌన్‌లోని మాయమైన బియ్యం విషయం బయటపడకుండా ఉండేందుకు పశ్చిమ గోదావరి నుంచి నంద్యాలకు రావాల్సిన బియ్యం వ్యాగన్‌ను బేతంచర్లకు మళ్లించినట్లు తెలుస్తోంది. ఇక తనిఖీలు చేసే సమయంలో ప్రైవేటు గోడౌన్ల యజమానులు అందుబాటులో లేకుండా పోయినా వారిని పిలిచి వివరాలు సేకరించిన దాఖాలు లేవు. ఇలా ఒక్కొక్క విషయాన్ని కలుపుకుంటే పోతే జిల్లా యంత్రాంగం, సంబంధిత శాఖ అధికారులు, బియ్యం అక్రమార్కుల మధ్య బంధం బలంగానే సాగుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తనిఖీలకు సంబంధించిన వివరాలను సంబంఽధిత శాఖ డీఎం రాజు నాయక్‌ను అడగ్గా పై అధికారులకు తెలియజేస్తున్నామని, ఆ తర్వాత ఏం జరిగిందో వివరిస్తామని చెబుతున్నారు.

ప్రజాధనాన్ని అక్రమార్కుల జేబుల్లో నింపుతున్నారు

నంద్యాల నుంచి మిగిలిన ఎంఎల్‌ఎస్‌ పాయింట్లకు పీడీఎస్‌ బియ్యాన్ని తరలించవచ్చు. ఇందుకోసం బేతంచర్లలో బఫర్‌ గోడౌన్‌ అవసరమే లేదు. నంద్యాల నుంచి ఆయా ఎంఎల్‌ఎస్‌ పాయింట్లకు బియ్యాన్ని చేరవేడానికి అయ్యే ఖర్చు కంటే బేతంచర్ల నుంచి ఎంఎల్‌ఎస్‌ పాయింట్లకు బియ్యాన్ని చేరవేసే ఖర్చు తక్కువగానే ఉంటుంది. కానీ బఫర్‌ గోడౌన్ల బాడుగ, రైల్వే వ్యాగన్‌ రవాణా ఖర్చు, హమాలీ, వాహనాల రవాణా ఖర్చుతో పోల్చుకుంటే ఇది చాలా తక్కువ. ఇదంతా వైసీపీ నాయకుల మెప్పు కోసం అధికారులు చేస్తున్న పని. పీడీఎస్‌ బియ్యంలో అక్రమాలకు పాల్పడిని వారు ఎంతటి వారైనా వదిలే ప్రసక్తే లేదు. వారందరిపై పీడీ యాక్టు నమోదయ్యేలా చర్యలు తీసుకుంటాం.

- మహేశ్‌ నాయుడు, ఏపీ సివిల్‌ సప్లైస్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్‌

Updated Date - Dec 27 , 2024 | 11:41 PM