Share News

దేన్నయినా అడ్డుకుంటాం

ABN , Publish Date - Feb 13 , 2024 | 12:13 AM

రైతులకు ఇచ్చే రుణాలు సక్రమంగా వారికి చేరడం లేదు. రాజకీయ నాయకులు, సహకార సంఘాల సీఈవోలు రుణాల సాకుతో రైతుల నుంచి వసూళ్లకు అలవాటుపడ్డారు.

దేన్నయినా అడ్డుకుంటాం

కమీషన్లు రావని కంప్యూటరీకరణను సాగనివ్వని వైసీపీ నాయకులు

సహకార సంఘాల కంప్యూటరీకరణకు దీర్ఘకాలిక గ్రహణం

కేంద్రం నిధులిచ్చినా ముందుకు సాగని పనులు

సమావేశాలు, శిక్షణలకే పరిమితం

కర్నూలు(అగ్రికల్చర్‌), ఫిబ్రవరి 12: రైతులకు ఇచ్చే రుణాలు సక్రమంగా వారికి చేరడం లేదు. రాజకీయ నాయకులు, సహకార సంఘాల సీఈవోలు రుణాల సాకుతో రైతుల నుంచి వసూళ్లకు అలవాటుపడ్డారు. ఇందుకు చెక్‌ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలను కంప్యూటరీకరించాలని భావించింది. తద్వారా జిల్లా సహకార కేంద్ర బ్యాంకుతోపాటు బ్యాంకు బ్రాంచ్‌లు, ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలను అనుసంధానం చేయాలని అనుకుంది. దీని వల్ల తమ ప్రయోజనం దెబ్బతింటుందని ఐదేళ్లయినా వైసీపీ నాయకులు కంప్యూటరీకరణను ముందుకు పోనివ్వడం లేదనే విమర్శలు ఉన్నాయి.

రైతులకు స్వల్పకాలిక, దీర్ఘకాలిక రుణాల పంపిణీ చుట్టూ అనేక వివాదాలు, విమర్శలు ఉన్నాయి. రుణాలు మంజూరైనందుకు రైతుల నుంచి రాజకీయ నాయకులు, సహకార సంఘాల సీఈవోలు కమిషన్లు గుంజుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీనికి చెక్‌ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల్లో కంప్యూటరీకరణపూర్తి చేసి జిల్లా సహకార కేంద్ర బ్యాంకు, దాని బ్రాంచీలను, ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలను అనుసంధానం చేయాలని అనుకుంది దీనికి రూ.2,500 కోట్లను మంజూరు చేసింది.

రాష్ట్రంలో రైతులకు ఎంతో ఉపయోగపడే కంప్యూటరీకరణ ప్రక్రియ ఐదేళ్లు పూర్తి కావస్తున్నా నత్తనడకన సాగుతోంది. కంప్యూటరీకరణ అనుసంధానానికి సహకార సంఘాల సీఈవోలు, ఇతర సిబ్బందితోపాటు సహకార బ్యాంకు అధికారులతో జిల్లా సహకార శాఖ అధికార యంత్రాంగం శిక్షణా సమావేశాలకే పరిమితమవుతున్నట్లు రైతుల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయి. మరోవైపు ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల్లో కంప్యూటరీకరణ, బ్యాంకు సంఘాల మధ్య అనుసంధాన ప్రక్రియ పూర్తయితే.. అక్రమాలకు ఎటువంటి అవకాశం ఉండదని, తమ ప్రమేయం పూర్తిగా తగ్గిపోనుందని అధికార పార్టీ నాయకులు కొందరు ఆందోళన చెందుతున్నారు. అందువల్లనే ఈ కార్యక్రమం వేగంగా ముందుకు సాగడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సహకార సంఘాల్లో ఈ ప్రక్రియ పూర్తి కాకపోవడానికి వేరే అడ్డంకులు పెద్దగా లేకపోయినప్పటికీ నాయకులు సంఘాల్లోని సీఈవోలు శ్రద్ధ చూపకపోవడమే కారణమని రైతులు చెబుతున్నారు. అందువల్లనే ఏటా రూ. వందల కోట్ల రుణాల మంజూరుకు సంబంధించి రైతులు చెల్లించిన రుణ బకాయిలు సక్రమంగా బ్యాంకులకు జమ కాకపోవడానికి మధ్యలోనే స్వాహా అయ్యేలా యథేచ్ఛగా అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి.

ఐదేళ్లయినా పూర్తి కాని కంప్యూటరీకరణ

ఉమ్మడి కర్నూలు జిల్లాలో 99 ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు ఉన్నాయి. జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ఏటా ఖరీఫ్‌, రబీ సీజన్లలో పంట సాగు కోసం రైతులకు పంట రుణాలను అదే విధంగా పొలాల అభివృద్ధికి జీవనోపాధిని మెరుగు పరుచుకునేందు కోసం దాదాపు రూ.100 నుంచి 200 కోట్ల దాకా రుణాలను మంజూరు చేస్తూ వస్తోంది. కర్షకజ్యోతితో పాటు వివిధ కార్యక్రమాలను అమల్లోకి తెచ్చి వాటి ద్వారా రుణాలను రైతులకు అందిస్తున్నారు. అయితే.. ఈ రుణ మంజూరుతో పాటు రుణబకాయిలు రైతులకు సక్రమంగా అందించడంలో రైతుల నుంచి వసూలయ్యే రుణబకాయిలను బ్యాంకులకు అందించడంలో ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల్లోని అధికారులు పాలకపక్షం తమ చేతి వాటం చూపుతున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని పత్తికొండ, ఆదోని, డోన్‌, పాణ్యం, ఆలూరు, బనగానపల్లి, నంద్యాల, ఆత్మకూరు ఆదోని తదితర సహకార బ్యాంకు బ్రాంచీల పరిధిలోని ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల్లో రైతుల రుణ మంజూరుతో పాటు వారు చెల్లించిన రుణ బకాయిలను సక్రమంగా బ్యాంకులకు జమ చేయడంలో ఎన్నెన్నో అక్రమాలు చోటు చేసుకుంటున్నట్లు ఫిర్యాదులు వెలువెత్తుతున్నాయి. వీటిని ఎప్పటికప్పుడు అధికారుల దృష్టికి తీసుకెళ్లే విషయంలో వివిధ స్థాయిల్లో అశ్రద్ధ చూపుతున్నారనే ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ఈ అక్రమాలను అరికట్టేందు కోసమని ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల్లో కంప్యూటరీకరణ పూర్తి చేసి సహకార బ్యాంకులకు సంఘాల మధ్య అనుసంధాన ప్రక్రియ చేపట్టాలనే కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు రూ.2,500 కోట్లు కేటాయించింది. ఇప్పటికే ఉమ్మడి కర్నూలు జిల్లాలోని అన్ని సంఘాలకు కంప్యూటర్లు, ఇతర పరికరాలను సమకూర్చారు. అత్యవసరమైన అనుసంధానం, కంప్యూటీకరణకు మాత్రం సహకార శాఖ బ్యాంకు పాలకవర్గాలు ఏ మాత్రం శ్రద్ధ చూపడం లేదనే ఆరోపణలు వెలువెత్తుతున్నాయి.

మోకాలడ్డుతున్న నేతలు

ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల రుణాల మంజూరులో, బకాయిల వసూలులో అక్రమాలను నివారిం చాలని చేపట్టిన కంప్యూటరీకరణ ముందుకు జరగకుండా ఆయా సంఘాల్లోని పాలకవర్గాలు మోకాలడ్డుతున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు. బ్యాంకులు, సహకార సంఘాల మధ్య అనుసంధానం ప్రక్రియ పూర్తయితే.. రుణాల పంపిణీ, బకాయిల వసూలు సక్రమంగా జరుగుతుంది. . దీని వల్ల తమ నోట్లో మట్టి పడుతుందని సహకార సంఘాల పాలకవర్గాలతో పాటు సీఈవోలు, ఇతర సిబ్బంది కంప్యూట రీకరణను వివిధ స్థాయిల్లో అడ్డుకుంటున్నారు.

కంప్యూటరీకరణ పూర్తి చేస్తాం

ఉమ్మడి కర్నూలు జిల్లాలో 99 ప్రాథమిక వ్యవపాయ పరపతి సంఘాలు ఉన్నాయి. రైతులకు వీటి ద్వారా రుణాల మంజూరుతో పాటు వారు చెల్లించిన రుణబకాయిలు సక్రమంగా బ్యాంకులకు జమ చేసేందుకు కంప్యూటరీకరణ అనుసంధాన ప్రక్రియను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టాయి. ఈ మేరకు నిధులు కూడా కేటాయించారు. ప్రస్తుతం కంప్యూటీకరణ పనులు వివిధ స్థాయిల్లో జరుగుతున్నాయి. ఈ కార్యక్రమం పూర్తయితే.. రైతులకు మేలు జరగడంతోపాటు అక్రమాలకు తావుండదు.

- రామాంజనేయులు, సీఈవో

Updated Date - Feb 13 , 2024 | 12:13 AM