నీళ్లు.. నిధులు..!
ABN , Publish Date - Dec 27 , 2024 | 11:48 PM
ఉమ్మడి కర్నూలు రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులకు పురిటిగడ్డ. కరువు నేలకు సస్యశ్యామలం చేసే కేసీ కాలువ, గాలేరు-నగరి ప్రాజెక్టు, హంద్రీ-నీవా సుజల స్రవంతి ఎత్తిపోతల పథకం.. ప్రాజెక్టు ఏదైనా కందనవోలు ముంగిట నుంచి జల అడుగులు పడాలి.

కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రత్యేక దృష్టి
2024-25 బడ్జెట్‌లో రూ.445.81 కోట్ల కేటాయింపు
హంద్రీనీవా కాలువ విస్తరణకు వేగంగా చర్యలు
ఉమ్మడి కర్నూలు రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులకు పురిటిగడ్డ. కరువు నేలకు సస్యశ్యామలం చేసే కేసీ కాలువ, గాలేరు-నగరి ప్రాజెక్టు, హంద్రీ-నీవా సుజల స్రవంతి ఎత్తిపోతల పథకం.. ప్రాజెక్టు ఏదైనా కందనవోలు ముంగిట నుంచి జల అడుగులు పడాలి. అంతటి ప్రాధాన్యత కలిగిన సీమ ప్రాజెక్టులకు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఐదేళ్లు అంతులేని నిర్లక్ష్యం ప్రదర్శించారు. నిధులు లేక పలు ప్రాజెక్టులు అటకెక్కించారు. కనీసం నిర్వహణకు కూడా నిధులు ఇవ్వని దైన్య పరిస్థితిని కల్పించారు. 2024 ఎన్నికల ఏడాది.. ఫిబ్రవరి 7న ఆనాటి ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌లో నిధులు ఇవ్వకుండా నిరాశే మిగిల్చారు. జూన్ 12న సీఎం చంద్రబాబు సారథ్యంలో టీడీపీ కూటమి ప్రభుత్వం కొలువుదీరాక సాగునీటి ప్రాజెక్టులు నూతన కళను సంతరించుకున్నాయి. తుంగభద్ర డ్యాం గేటు కొట్టుకుపోతే మన రాష్ట్రం కాకపోయినా సీఎం చంద్రబాబు ప్రాజెక్టుల గేట్ల నిపుణుపుడు కన్నయ్యను పంపి కందనవోలు పచ్చిమ రైతుల కన్నీళ్లు తుడిచారు. నవంబరు 11న టీడీపీ కూటమి ప్రభుత్వం ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టిన 2024-25 బడ్జెట్‌లో జిల్లా ప్రాజెక్టులకు రూ.445.81 కోట్లు కేటాయించారు. సాగు నీటి సంఘాల ఎన్నికలు పూర్తి చేశారు. కాలువల మరమ్మతులకు చర్యలు చేపట్టారు. శ్రీశైలం డ్యాం ఆధునికీకరణకు శ్రీకారం చుట్టారు. 2024లో కందనవోలు సాగునీటి ప్రాజెక్టుల స్థితిగతులపై పరిశీలిస్తే..
కర్నూలు, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి కర్నూలు, నంద్యాల జిల్లాల్లో తుంగభద్ర దిగువ కాలువ (ఎల్లెల్సీ), గాజులదిన్నె ప్రాజెక్టు, కర్నూలు-కడప (కేసీ) కాలువ, తెలుగుగంగ ప్రాజెక్టు, శ్రీశైలం కుడిగట్టు కాలువ (ఎస్పార్బీసీ) ప్రధాన సాగు, ఆలూరు బ్రాంచ్ కాలువ, శివ భాష్యం ప్రాజెక్టు, హంద్రీనీవా కాలువ.. వంటి సాగునీటి ప్రాజెక్టులు ఉన్నాయి. ఆయా నీటి వనరుల కింద 6.56 లక్షల ఎకరాలకు సాగు నీరందాల్సి ఉంది. వైపీసీ ప్రభుత్వం వచ్చాక రాయలసీమ దుర్భిక్ష నివారణ ప్రాజెక్టు పేరిట ఉన్న ప్రాజెక్టులను పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. కర్నూలు జిల్లాలో పశ్చిమ పల్లెసీమలకు సాగు, తాగు నీరందించే లక్ష్యంగా చేపట్టి వేదవతి, ఆర్డీఎస్ కుడి కాలువ ప్రాజెక్టులు అటకెక్కించారు. నాడు జగన్ ప్రభుత్వం వల్ల కందనవోలు ప్రాజెక్టులు అంతులేని నిర్లక్ష్యానికి గురయ్యాయి. జూన్ 12న సీఎం చంద్రబాబు సారథ్యంలో కూటమి ప్రభుత్వం రావడంతో సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ, కొత్త ప్రాజెక్టుల నిర్మాణాలపై రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఆ దిశగా ప్రభుత్వం వేగంతమైన చర్యలకు ఉపక్రమించింది. ఆగస్టులో తుంగభద్ర డ్యాం 19వ నంబరు గేటు కొట్టుకుపోవడంతో కర్నూలు జిల్లాలో ఎల్లెల్సీ ఆయకట్టు ప్రశ్నార్థకంగా మారింది. సీఎం చంద్రబాబు తక్షణమే క్రస్ట్‌గేట్ల నిపుణుడు కన్నయ్యనాయుడును టీబీపీ డ్యాంకు పంపించి యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేయించారు. 30 టీఎంసీలు కడలిపాలు కాకుండా రక్షించారు. కరువుపల్లె రైతుల సాగు ఆశలు పదిలం చేశారు.
వైసీపీ హయాంలో నిర్లక్ష్యం
ఎన్నికల ఏడాది.. అందులోనూ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఉమ్మడి జిల్లా వాసే. బడ్జెట్‌లో నిధులకు ఢోకా ఉండదని ఆశపడడంలో తప్పులేదు. ఈ ఏడాది ఆరంభం ఆరు నెలలు వైసీపీ అధికారమే ఉంది. ఫిబ్రవరి 7న నాటి ఆర్థిక మంత్రి బుగ్గన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశ పెట్టారు. ఉమ్మడి జిల్లా ప్రాజెక్టులకు నిధులు కేటాయింపులు ఎండమావులే అయ్యాయి. హంద్రీనీవా కాలువ నుంచి 68 చెరువుల నింపే ప్రాజెక్టు గత టీడీపీ ప్రభుత్వం చేపడితే.. ఆ ప్రాజెక్టు తానే తెచ్చినట్లుగా బడ్జెట్ ప్రసంగంలో చెప్పారే తప్పా నిధుల ఊసే లేదు. రూ.వేల కోట్లు బకాయి పెట్టారు. గురురాఘవేంద్ర ఎత్తిపోతల పథకం వంటి ఎత్తిపోతల పథకాల నిర్వహణకు నిధులు ఇవ్వలేదు.
పుచ్చకాయలమడ లిఫ్ట్‌కు రూ.6.50 కోట్లు
పత్తికొండ మండలం పుచ్చకాయలమడ గ్రామంలో అక్టోబరు 1న ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించారు. ప్రజావేదిక సభలో పాల్గొన్నారు. మీ గ్రామానికి ఏమి కావాలో కోరుకోమని రైతులను చంద్రబాబు అడిగారు. ‘మా గ్రామం పక్కనే హంద్రీనీవా కాలువ ప్రవహిస్తుంది.. మా పంట పొలాలకు చుక్కనీరు అందక ఏటేటా పంటలు ఎండిపోయి నష్టపోతున్నాం.. లిఫ్ట్ ఏర్పాటు చేసి సాగునీరు ఇవ్వాలి’ అని రైతులు కోరారు. ఈ మేరకు జలవనరుల శాఖ ఇంజనీర్లు రూ.6.50 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం పంపారు. 800 ఎకరాలకు సాగునీరు లక్ష్యంగా హంద్రీనీవా కాలువ 121 కిలోమీటర్ల వద్ద ఎత్తిపోతల పథకం నిర్మాణానికి ప్రతిపాదనలు పంపారు. త్వరలోనే ఈ ప్రాజెక్టు కార్యారూపం దాలుస్తుందని అంటున్నారు. అలాగే.. రాయలసీమలో 6.50 లక్షల ఎకరాలకు సాగునీటి ఆశయంలో నిర్మించిన హంద్రీనీవా కాలువ విస్తరణకు రూ.1,500 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. త్వరలోనే టెండర్లు పిలిచి పనులు మొదలు పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
టీడీపీ కూటమి వచ్చాక ప్రాజెక్టులకు జీవం
ఈ ఏడాది సగంలో జూన్ 12న సీఎం చంద్రబాబు సారథ్యంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ఉమ్మడి జిల్లా ప్రాజెక్టులకు జలజీవం వచ్చింది. సీమ ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి సారించారు. కూటమి ప్రభుత్వంలో నవంబరు 11న ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ 2024-25 పూర్తి స్థాయి బడ్జెట్ కేటాయించారు. ఉమ్మడి జిల్లా ప్రాజెక్టులు రూ.445.81 కోట్లు కేటాయించారు. కేసీ కెనాల్, కుందూ, నిప్పులవాగు రూ.253.10 కోట్లు కేటాయించడం కొసమెరుపు. వైసీపీ ఐదేళ్ల పాలనలో మరమ్మతులకు నోచుకోని గురురాఘవేంద్ర ఎత్తిపోతల ప్రాజెక్టు సహా తుంగభద్ర ప్రాజెక్టు దిగువ కాలువ (ఎల్లెల్సీ), ఆర్డీఎస్, వేదవతి, గాజులదిన్నె ప్రాజెక్టులకు రూ.115.39 కోట్లు కేటాయించారు. గాజులదిన్నె ప్రాజెక్టు సామర్థ్యం పెంపు పనులకు వైసీపీ హయాంలో బిల్లులు ఇవ్వక పనులు ఆపేస్తే కూటమి ప్రబుత్వం బడ్జెట్‌లో రూ.11.79 కోట్లు కేటాయించి పనులు ప్రారంభానికి బీజం వేసింది. శ్రీశైలం డ్యాం శాశ్వత మరమ్మతులకు ప్రపంచ బ్యాంక్ ఆమోదం తెలిపింది.
వైసీపీ హయాంలో కేంద్ర ప్రభుత్వం నిధులు వినియోగించుకోవడంలో ఘోర వైఫల్యం చెందితే.. టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ ఆరు నెలల్లోనే కేంద్ర ప్రభుత్వం నిధులు సద్వినియోగం చేసుకొని ఆయా ప్రాజెక్టుల మరమ్మతులు, ఆధునికీకరణకు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అందులో భాగంగా మూడు దశల్లో సాగు నీటి సంఘాల ఎన్నికలను పూర్తి చేసింది. ప్రధానమంత్రి కృషి సంచాయ్ యోజన (పీఎంకేఎస్‌వై), ప్రపంచ బ్యాంకు నిధులతో కాలువల మరమ్మతులకు కూటమి ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. పీఎంకేఎస్‌వై రిపేర్స్-రెనోవేషన్-రిస్టోరేషన్ (ఆర్‌ఆర్‌ఆర్) లో భాగంగా మేజర్, మైనర్ ప్రాజెక్టుల కింద కాలువలు, సిస్టమ్ ట్యాంకుల శాశ్వత మరమ్మతులు, ఆధునికీకరణ కోసం ప్రతిపాదనలు తయరు చేయమని ఇప్పటికే ఇంజనీర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఉమ్మడి జిల్లాలో దాదాపుగా రూ.రూ.1,558 కోట్లు అవసరం అవుతాయని అంచనా వేశారు. ఈ ఆరు నెలల్లోనే చంద్రబాబు ప్రభుత్వం నీటి వనరుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టింది.
2025లో ఈ ప్రాజెక్టులపై దృష్టి సారించాలి
ఆలూరు, ఆదోని నియోజకవర్గాల్లో 80 వేల ఎకరాలకు సాగు నీరు, 196 గ్రామాలకు తాగునీరు అందించాలని గత చంద్రబాబు ప్రభుత్వం వేదావతి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు నిర్మాణానికి 2019లో రూ.1,942.38 కోట్లు మంజూరు చేసింది. వైసీపీ ప్రభుత్వం వచ్చాక పనులు అటకెక్కాయి. నూతన సంవత్సరంలో పనులు మొదలు పెట్టాలి.
మంత్రాలయం, ఎమ్మిగనూరు నియోజకవర్గాల్లోనే వలసల నివారణ కోసం గత టీడీపీ ప్రభుత్వం ఆర్డీఎస్ కుడి కాలువ నిర్మాణాలకు శ్రీకారం చుట్టింది. 2019 జనవరిలో రూ.1,985.42 కోట్లు మంజూరు చేసింది. వైపీపీ వచ్చాక పనులు ఆపేశారు. 2025లో ఆర్డీఎస్ పనులకు శ్రీకారం చుట్టాలి.
తుంగభద్ర నదిపై 20 టీఎంసీలు సామర్థ్యంలో గుండ్రేవుల జాశయం నిర్మాణానికి రాష్ట్ర విభజన తరువాత టీడీపీ ప్రభుత్వం రూ.2,890 కోట్లు మంజూరు చేస్తే తరువాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం అంతర్‌రాష్ట్ర సమస్య అంటూ పక్కన పడేసింది. జిల్లా ఎంపీలు, ఎమ్మెల్యేలు చొరవ తీసుకొని కూటమి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వంతో చర్చలు జరిపి పనులు మొదలయ్యేలు చర్యలు చేపట్టాలి.
పత్తికొండ (పందికోన) జలశయం కుడి ఎమడ హంద్రీనీవా కాలువలు పూర్తి చేస్తే 65 వేల ఎకరాలకు సాగునీరు ఇవ్వవచ్చు. అందుకు రూ.200 కోట్లు అవసరమవుతాయి. రాబోయే ఏడాదైనా పనులకు మోక్షం లభించేలా చూడాలి.
ఆత్మకూరు నియోజకవర్గంలో అసంపూర్తిగా ఉన్న సిద్ధాపురం ఎత్తిపోతల పథకం కాలువలు పూర్తి చేసి పూర్తి ఆయకట్టుకు సాగునీరు ఇవాల్సిన అవసరం ఉంది.
అసంపూర్తిగా ఉన్న అవుకు టన్నెల్ పూర్తి చేయాలి. అవుకు రిజర్వాయర్ గేట్లను మరమ్మతులు చేపట్టాలి
కోసిగి మండలం పులికనుమ జలాశయం అదనంగా మరో ఒక టీఎంసీ సామర్థ్యం పెంపు పనులు చేపట్టాలి.
టీడీపీ కూటమి ప్రభుత్వం ఉమ్మడి జిల్లా ప్రాజెక్టులకు కేటాయింపులు రూ.కోట్లలో..
ప్రాజెక్టులు బడ్జెట్
ఎల్లెల్సీ, ఆర్డీఎస్,
వేదావతి ప్రాజెక్టులు 13.00
కేసీ కెనాల్, కుందూ
, నిప్పులవాగు 253.10
ఎస్‌ఆర్‌బీసీ 44.06
గురురాఘవేంద్ర
ప్రాజెక్టు 69.04
68 చెరువులు 20.00
గాజులదిన్నె ప్రాజెక్టు 11.79
శ్రీశైలం జల
విద్యుత్ కేంద్రం 2.23
సిద్ధేశ్వరం ఎత్తిపోతల
పథకం 6.29
శ్రీశైలం ప్రాజెక్టు 26.30
మొత్తం 445.81