Share News

టీడీపీ వస్తే ఏటా రెండు పంటలకు నీరు: బుడ్డా

ABN , Publish Date - Apr 30 , 2024 | 12:34 AM

తెలుగుగంగ కింద మూడు సంవత్సరాలు రబీకి శిల్పా నీరు ఇవ్వలేదని, టీడీపీ అధికారంలోకి వస్తే ఏటా రెండు పంటలకు నీరు అందిస్తామని శ్రీశైలం టీడీపీ అభ్యర్థి బుడ్డా రాజశేఖర్‌రెడ్డి అన్నారు.

టీడీపీ వస్తే ఏటా రెండు పంటలకు నీరు: బుడ్డా
నారాయణపురంలో ప్రసంగిస్తున్న బుడ్డా రాజశేఖరరెడ్డి

బండిఆత్మకూరు, ఏప్రిల్‌ 29: తెలుగుగంగ కింద మూడు సంవత్సరాలు రబీకి శిల్పా నీరు ఇవ్వలేదని, టీడీపీ అధికారంలోకి వస్తే ఏటా రెండు పంటలకు నీరు అందిస్తామని శ్రీశైలం టీడీపీ అభ్యర్థి బుడ్డా రాజశేఖర్‌రెడ్డి అన్నారు. మండలంలోని నారాయణపురం, చిన్న దేవళాపురం, పెద్దదేవళాపురం, భోజనం గ్రామాల్లో సోమవారం బుడ్డా రోడ్‌ షో నిర్వహించారు. ఆయా గ్రామాల్లో భారీగా హాజరైన జనాన్ని ఉద్దేశించి బుడ్డా ప్రసంగిస్తూ ఒక్క ఛాన్స్‌ ఇచ్చి ప్రజలంతా వైసీపీ అరాచక పాలన చవిచూసారని, మరోసారి, జగన్‌, శిల్పా మాయమాటలు నమ్మవద్దని సూచించారు. వైసీపీ పాలనలో అభివృద్ది ఏమాత్రం జరగలేదని, ఓంకారం రోడ్డును గుంతలమయం చేశారని మండిపడ్డారు. టీడీపీ అధికారంలోకి వస్తే పింఛన్‌ రూ.4 వేలు, రైతులకు ఏటా రూ.20వేలు, నిరుద్యోగ భృతి ప్రతి నెల రూ.3వేలు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, మూడు గ్యాస్‌ సిలిండర్లు ఉచితమని, అలాగే 18 ఏళ్లు నిండిన మహిళలకు నెలకు రూ.1500, తల్లికి వందనం కింద రూ.15వేలు అందిస్తామని చెప్పారు. పొదుపు మహిళలకు, మైనారీటలకు, బీసీ, ఎస్సీ, ఎస్టీలకు టీడీపీ హయాంలోనే మేలు జరిగిందని అన్నారు. వైసీపీ పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం జరిగిందని అన్నారు. టీడీపీ గెలిపించాలని కోరారు. కార్యక్రమాల్లో టీడీపీ నాయకులు శశాంకరెడ్డి, సురేష్‌రెడ్డి, మనోహర్‌చౌదరి, వెంకటేశ్వర్లు, విజయరామిరెడ్డి, శంకర్‌, బుగ్గరాముడు, లింగారెడ్డి, నారాయణ, పాలశంకర్‌, మహేష్‌, సుంకన్న, వెంకటసుబ్బయ్య, ఆంబ్రోస్‌, కృష్ణారెడ్డి, రామలింగం, కృష్ణనాయక్‌, ప్రసాద్‌, మధురెడ్డి, మద్దిలేటి, బాలవెంకటరెడ్డి, నడిపెన్న, మల్లేశ్వరరెడ్డి, సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కడమలకాల్వ నాయకుడు సుబ్బలక్ష్మయ్య, మదన్‌ భూపాల్‌ ఆధ్వర్యంలో వైసీపీ కుటుంబాలు బుడ్డా రాజశేఖర్‌రెడ్డి సమక్షంలో టీడీపీలో చేరాయి. చిన్నదేవళాపురం గ్రామానికి చెందిన వలంటీరు రాణి, సందా కుటీంబీకులు వైసీపీని వీడి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.

ఆత్మకూరు: శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి గెలుపుతోనే నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమని ఆత్మకూరు రిటైర్డు తహసీల్దార్‌ పాణ్యం రామకృష్ణుడు అన్నారు. సోమవారం ఆత్మకూరులో బుడ్డా శైలజమ్మ సమక్షంలో ఆయన తన బంధువర్గంతో కలిసి టీడీపీలో చేరారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తాను వైసీపీలోకి రావాలని అనేక మంది తనను ఒత్తిళ్లకు గురిచేసినప్పటికీ బుడ్డా కుటుంబంపై ఉన్న నమ్మకంతోనే టీడీపీలోకి వచ్చానని చెప్పారు. బుడ్డా శైలజమ్మ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో అందరూ కలిసికట్టుగా పనిచేసి బుడ్డా రాజన్నను ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం ఆమెను సత్కరించారు. పాణ్యం ఆంజనేయులు వలంటీర్‌ పదవికి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. నాయకులు బాషా, కిష్టయ్య, సాయిలు, శివారెడ్డి, వెంకట రామసుబ్బయ్య, రామ్మూర్తి, సతీష్‌, శ్రీనివాసులు, గిరి, ఉదయ్‌, నరేష్‌ తదితరులు ఉన్నారు.

టీడీపీ, బీజేపీ పొత్తుపై వైసీపీ నాయకులు చేస్తున్న అసత్య ప్రచారాలను ముస్లింలు నమ్మి మోసపోవద్దని బుడ్డా శైలజ సూచించారు. పట్టణంలోని 56, 58, 67, 71, 73 బూతుల్లో ఆమె పర్యటించి ముస్లిం మహిళలతో ఆత్మీయ సమవేశాలు నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. టీడీపీలోనే ముస్లింలకు సముచిత స్థానాన్ని కల్పించి వారి సంక్షేమ కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ఘనత చంద్రబాబుదేనని అన్నారు. ప్రత్యేకించి దుకాన్‌ మకాన్‌, దుల్హన్‌ పథకం, విదేశీ విద్య, షాదీఖానా నిర్మాణాం, హజ్‌యాత్రకు చేయూత, రంజాన్‌ తోఫా, మైనార్టీ కార్పొరేషన్‌ రుణాల పంపిణీ, ఇమామ్‌, మోజన్‌లకు వేతనాలు, ఇళ్ల పట్టాలు, గృహ నిర్మాణాలు వంటి అనేక సంక్షేమ పథకాలను టీడీపీ హయంలోనే తీసుకొచ్చినట్లు గుర్తుచేశారు. సమావేశంలో ఆయా వార్డుల ముఖ్యనాయకులు పాల్గొన్నారు.

Updated Date - Apr 30 , 2024 | 12:34 AM