Share News

వలంటీర్లూ.. జాగ్రత్త..!

ABN , Publish Date - Mar 22 , 2024 | 12:20 AM

ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే ఎంతటి వారినైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదు.

వలంటీర్లూ.. జాగ్రత్త..!

ఎన్నికల ప్రచారం చేస్తే క్రిమినల్‌ కేసులు

కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు కూడా వర్తింపు

ఇప్పటికే పలువురిపై చర్యలు

ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే ఎంతటి వారినైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. వలంటీర్లు ఎన్నికల విధుల్లో పాల్గొంటే తీవ్ర చర్యలు ఉంటాయి. రాజకీయ పార్టీలకు అనుకూలంగా నేరుగా ప్రచారం చేస్తే క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తాం.

- రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేశ్‌కుమార్‌

కర్నూలు, మార్చి 21 (ఆంధ్రజ్యోతి): వలంటీర్లు వైసీపీ కార్యకర్తలే అని పాలక పార్టీ పెద్దలు పదేపదే చెబుతున్నారు. వారిని కట్టడి చేయాలని టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి నాయకులు ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేశ్‌కుమార్‌ మీనా చర్యలు చేపట్టారు. జిల్లాలో పలువురు వలంటీర్లపై సస్పెన్షన్‌ వేటు వేశారు. వలంటీర్లు, కాంట్రాక్ట్‌ ఉద్యోగులు రాజకీయ పార్టీలకు, అభ్యర్థులకు ఓటు వేయాలని నేరుగా ప్రచారం చేస్తే క్రిమినల్‌ కేసులు పెట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. బుధవారం కల్లూరు మండలం పుసులూరులో ఇద్దరు వలంటీర్లపై కొరడా ఝళిపించారు.

కర్నూలు జిల్లాలో 25 మండలాలు సహా కర్నూలు నగరపాలక సంస్థ, ఆదోని, ఎమ్మిగనూరు, గూడూరు మున్సిపాలిటీలు ఉన్నాయి. గ్రామీణ మండలాలలో 6,942 మంది వలంటీర్లు ఉన్నారు. కర్నూలు కార్పొరేషన్‌లోని 137 సచివాలయాల పరిధిలో 2,171, ఆదోని మున్సిపాలిటీలో 643, ఎమ్మిగనూరు మున్సిపాలిటీలో 430, గూడూరు నరగ పంచాయతీ పరిధిలో 97 మంది వలంటీర్లు పని చేస్తున్నారు. 2019 మేలో కొలువుదీరిన సీఎం జగన్‌ సారథ్యంలోని వైసీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఇంటికి చేరవేయాలనే లక్ష్యంగా వీరిని నియమించింది. ప్రతి వలంటీరు వద్ద 50 ఇళ్లకు చెందిన పూర్తి సమాచారం ఉంది. దీంతో ఎన్నికల్లో వలంటీర్లను ఉపయోగించుకోవాలని అధికార వైసీపీ ముఖ్య నాయకులు ఎత్తులు వేశారు. అందుకు అనుగుణంగానే వలంటీర్లు వైసీపీ కార్యకర్తలు అంటూ సీఎం జగన్‌ సహా వైసీపీ ముఖ్య నాయకులు వ్యూహాత్మకంగా ప్రచారం చేస్తూ వచ్చారు. సన్మానాలు, అవార్డుల పేరిటి అధికారికంగానే ప్రలోభాలు పెట్టారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అంతేకాదు.. ఎన్నికల షెడ్యూల్‌ రాకముందే వలంటీర్లకు వైసీపీ అభ్యర్థులు వివిధ గిఫ్టులు ఇచ్చి తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలు చేశారు.

కేసులు నమోదైతే ఇబ్బందులే..

జిల్లాలో గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో 10,283 మంది వలంటీర్లు పని చేస్తున్నారు. వీరిలో సగానికి పైగా డిగ్రీ, బీటెక్‌ ఆపై విద్యార్హత కలిగిన వారు ఉన్నారు. మంచి భవిష్యత్తు ఉన్న వలంటీర్లు అధికార వైసీపీ నేతల ఒత్తిళ్లు, ఇతర కారణాలతో రాజకీయ పార్టీలు, అభ్యర్థులకు అనుకూలంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొని సమస్యలు తెచ్చుకోవద్దని న్యాయ నిపుణులు సూచిస్తున్నారు. నాయకులు నిర్వహించే ఎన్నికల ప్రచారంలో పాల్గొంటే సస్పెండ్‌ చేస్తామని, క్రిమినల్‌ కేసులు కూడా నమోదు చేస్తామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేశ్‌కుమార్‌ మీనా చెబుతున్నారు. ఎన్నికల నిబంధనల అతిక్రమణ కేసులు నమోదైతే భవిష్యత్తులో ప్రభుత్వం ఉద్యోగం సాధించినా ఇబ్బందులు పడాల్సి వస్తుందని సీనియర్‌ న్యాయవాదులు హెచ్చరిస్తున్నారు.

జల్లాలో పలువురు వలంటీర్లపై చర్యలు

కల్లూరు మండలం పుసులూరు గ్రామానికి చెందిన క్లస్టర్‌-5 వలంటీరు అల్లాల ఆనంద్‌ (జి.ఆనంద్‌), క్లస్టర్‌-6 వలంటీరు టి.సోమన్నలు ఈ నెల 18న నిబంధనలకు విరుద్ధంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన ఎన్నికల కంప్లైంట్‌ సెల్‌కు ఫిర్యాదు అందడంతో అధికారులు విచారణ చేశారు.వాస్తవమని తేలడంతో వారిని సస్పెండ్‌ చేస్తూ కల్లూరు ఎంపీడీవో జీవీ రమణమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు.

ఎమ్మిగనూరు పట్టణం 29వ వార్డులో వలంటీరు నరసిహులు, 33వ వార్డులో వలంటీరు అసీఫ్‌ వైసీపీ అభ్యర్థి బుట్టా రేణుకతో కలిసి ఆయా వార్డుల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఫిర్యాదులు రావడంతో విచారించిన జిల్లా ఎన్నికల అధికారులు సస్పెన్షన్‌ వేటు వేశారు.

గోనెగండ్ల మండలం హెచ్‌.కైరవాడి సింగిల్‌ విండో సొసైటీ (పీఏసీసీఎస్‌)లో అటెండరుగా పని చేస్తున్న హనుమంతు వైసీపీ నాయకులతో కలిసి సిద్ధం పోస్టర్లు విడుదల చేసే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఫిర్యాదు రావడంతో విచారించిన అధికారులు సస్పెండ్‌ చేశారు.

గోనెగండ్ల మండలం వేముగోడు గ్రామంలో నిర్వహించిన వైసీపీ ప్రచార కార్యక్రమంలో వలంటీర్లు బాలకృష్ణారెడ్డి, బాకర్‌బీ, పి.అపర్ణ, కామాక్షి, పుష్పావతి, లక్ష్మన్న, మద్దిలేటిలు పాల్గొన్నారు. దీంతో వీరిని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టరు జి.సృజన ఆదేశాల మేరకు సస్పెండ్‌ చేశారు. ఓకే గ్రామంలో ఏడుగురు వలంటీర్లను సస్పెండ్‌ చేయడం రాష్ట్రంలోనే ప్రథమమని తెలుస్తోంది.

కర్నూలు నగర పాలక సంస్థ పరిధిలోని సచివాలయం-127లో కొత్తపేట-1 వలంటీరు మనోజ్‌కుమార్‌ రాజకీయ నాయకులు ఏర్పాటు చేసిన భోజనానికి హాజరయ్యారనే ఫిర్యాదు రావండంతో విచారించిన అధికారులు సస్పెండ్‌ చేశారు.

ఆదోని పట్టణంలో ఓ వలంటీరు వైసీపీకి అనుకూలంగా ప్రచారం చేస్తున్నారనే ఫిర్యాదు రావడంతో అధికారులు విచారణకు అదేశించినట్లు తెలిసింది.

Updated Date - Mar 22 , 2024 | 12:20 AM