Share News

పేదలపై దాష్టీకం

ABN , Publish Date - Apr 14 , 2024 | 12:00 AM

పేదలపై పోలీసులు, అధికారుల దాష్టికం ప్రదర్శించారు. 40 సంవత్సరాలుగా కాపురం ఉంటున్న గుడిసెలను అర్ధాంతరంగా తొలగించారు.

పేదలపై దాష్టీకం

ఖండేరిలో బలవంతంగా గుడిసెల తొలగింపు

రోడ్డున పడిన కుటుంబాలు

కర్నూలు(న్యూసిటీ), ఏప్రిల్‌ 13: పేదలపై పోలీసులు, అధికారుల దాష్టికం ప్రదర్శించారు. 40 సంవత్సరాలుగా కాపురం ఉంటున్న గుడిసెలను అర్ధాంతరంగా తొలగించారు. దీంతో వారంతా రోడ్డున పడ్డారు. నగరంలోని 1వ వార్డు ఖండేరి రాఘవేంద్ర స్వామి ఆలయం ఎదురుగా ఉన్న ఐటీఐ కళాశాల వెనుక భాగాన పార్కు స్థలం ఉంది. అందులో సుమారు 40 ఏళ్లుగా ఐదు సెంట్ల స్థలంలో పేదలు గుడిసెలు, ఇళ్లు నిర్మించుకుని జీవనం సాగిస్తున్నారు. శనివారం ఉదయం సుమారు 100 మంది పోలీసులు, 50 మంది నగర పాలక సంస్థ అధికారులు, సిబ్బంది వచ్చి ఎక్స్‌కవేటర్ల సహాయంతో ఇళ్లను తొలగించారు. అక్కడ ఉన్న చర్చిని సైతం కూకటివేళ్లతో పెకిలించారు. దీంతో స్థానికులు చిన్న పిల్లలను బయటికి తీసుకుని రోడ్డుపైకి వచ్చారు. తమ ఇళ్లను కూల్చివేయరాదని పోలీసులు, అధికారులతో వాగ్వివాదానికి దిగారు. బాధితుల గోడును ఏ మాత్రం పట్టించుకోని రెండో పట్టణ సీఐ బాధితుల నివాసాలను తొలగించేందుకు చర్యలు తీసుకున్నారు.

అప్పుడేమో పట్టించుకోకుండా..

ఇక్కడ సుమారు 150 నుంచి 200 ఓట్లు ఉన్నాయి. ఈ క్రమంలో పార్కు స్థలంలో ఇళ్లు నిర్మించుకున్న కూడా ఎవరూ పట్టించుకోలేదు. గత సంవత్సరం స్థానికులు కోర్టుతోపాటు నగర పాలక సంస్థ కార్యాలయంలో కూడా ఫిర్యాదు చేశారు. అయితే విషయాన్ని పరిశీలించిన కోర్టు కమిషనర్‌ తుది నిర్ణయం తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే బాధితుల తరపున న్యాయవాదులు కోర్టులో స్టే కూడా తీసుకువచ్చారు.

కమిషనర్‌ ఆదేశాల మేరకే చేశాం

నగర పాలక సంస్థ కమిషనర్‌ ఆదేశాల మేరకు గుడిసెలు, ఇళ్లను తొలగించాం. గతంలోనే బాధిత కుటుంబాలకు నోటీసులు జారీ చేశాం. టిడ్కో ఇళ్లకు దరఖాస్తు చేసుకోవాలి. ఇతర ప్రాంతాల్లో ఇళ్లు చూసుకోవాలని హెచ్చరించాం. అయినప్పటికీ ఎవరూ పట్టించుకోలేదు. పరిస్థితి విషమించడంతో తొలగించాల్సిన పరిస్థితి నెలకొంది.

-మంజుల, టౌన్‌ప్లానింగ్‌ సూపర్‌వైజర్‌, పట్టణ ప్రణాళిక విభాగం

Updated Date - Apr 14 , 2024 | 12:00 AM