సోలార్ పనులను అడ్డుకున్న గ్రామస్థులు
ABN , Publish Date - Jul 15 , 2024 | 11:01 PM
మండలంలోని కందికాయపల్లిలో గ్రీన్‌కో ఎనర్జీస్ ప్రైవేట్ లిమిటెడ్ చేపట్టిన సోలార్ పనులను సోమవారం గ్రామస్థులు, రైతులు అడ్డుకున్నారు.
కందికాయపల్లిలో రైతుల ఆందోళన
పాణ్యం, జూలై 15 : మండలంలోని కందికాయపల్లిలో గ్రీన్‌కో ఎనర్జీస్ ప్రైవేట్ లిమిటెడ్ చేపట్టిన సోలార్ పనులను సోమవారం గ్రామస్థులు, రైతులు అడ్డుకున్నారు. సోలార్ పరిశ్రమతో కోల్పోయిన తమ భూములకు నష్టపరిహారం ఇవ్వాలని, గ్రామానికి అందించాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించాలని సంస్థ నిర్వాహకులను కోరారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ మూడేళ్లుగా గ్రామంలో సోలార్ పనులు చేస్తున్నారుగాని సౌకర్యాలు అందించడం లేదని అన్నారు. సోలార్ పరిశ్రమ నిర్మాణంతో దాదాపు 600 ఎకరాల సాగు భూములు కోల్పోయామన్నారు. పరిహారం ఇవ్వకుండా పనులు చేస్తున్నారన్నారు. గ్రామంలోని వందలాది పశువులు, గొర్రెలు, మేకలకు సోలార్ నిర్మాణంతో పశుగ్రాసం, తాగునీటి కొరత ఏర్పడిందన్నారు. సోలార్ పరిశ్రమ ద్వారా గ్రామ యువకులకు ఉపాధి లేదన్నారు. అసైన్డ్ కాని సాగు భూములకు నష్ట పరిహారం ఇవ్వాలని కోరారు. పట్టాలు లేని సాగు భూములకు ఎకరాకు రూ.9 లక్షలు ఇవ్వాలని అన్నారు. గ్రామంలో మౌళిక సదుపాయాలు కల్పించాలన్నారు. గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటు, సోలర్ వీధి దీపాలు, మినరల్ వాటర్‌ప్లాంటు, ఆసుపత్రి, అంబులెన్స్ సౌకర్యం, పశువుల ఆసుపత్రి, రాత్రి పూట గస్తీకి సెక్యూరిటీ ఏర్పాటు, గ్రామ రస్తాలు, తాగునీటి కొళాయిల ఏర్పాటు, దోభీ ఘాట్లు, పశువులకు నీటి తొట్లు, పశుగ్రాసం, దేవాలయాలలో పూజారుల ఏర్పాటు, యువకులకు ఉపాధి, క్రీడా మైదానం వంటివి ఏర్పాటు చేయాలన్నారు. ఈ పనులను కల్పించని పక్షంలో పనులను అడ్డుకుంటామని సంస్థ నిర్వాహకులకు డిమాండ్లతో కూడిన వినతి పత్రం అందజేశారు.