Share News

వైసీపీ విధేయుల్లో వణుకు

ABN , Publish Date - Jun 08 , 2024 | 12:14 AM

సార్వత్రిక ఎన్నికల్లో తిరుగులేని ఆధిక్యతను కనబరిచిన తెలుగుదేశం పార్టీ మరో నాలుగు రోజుల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది.

వైసీపీ విధేయుల్లో వణుకు

వైసీపీ ఏజెంట్లుగా అధికారులు, సీసీలు

పైసలివ్వనిదే.. కదలని ఫైల్స్‌

చిన్న పనికి ఒక రేటు.. పెద్ద పనికి వాటా

సామాన్య ప్రజలకు దొరకని అధికారుల అనుమతి

గంటల తరబడి అధికారుల కోసం ప్రజల నిరీక్షణ

ప్రభుత్వం మారడంతో వేటు పడే అవకాశం

కర్నూలు(కలెక్టరేట్‌), జూన్‌ 7: సార్వత్రిక ఎన్నికల్లో తిరుగులేని ఆధిక్యతను కనబరిచిన తెలుగుదేశం పార్టీ మరో నాలుగు రోజుల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. టీడీపీ అధికారంలోకి రాకముందే కొందరు ఉద్యోగుల్లో కలవరం మొదలైంది. ఐదేళ్లలో వైసీపీ హయాంలో కొందరు ఉద్యోగులు ఆ పార్టీ నాయకులకు వీరవిధేయులుగా కొనసాగారు. ఇప్పుడు వారి వెన్నులో వణుకు మొదలైంది. విచక్షణ కోల్పోయి అధికార దర్పాన్ని ప్రదర్శించిన వారు ఇప్పుడు టీడీపీ నేతలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. అయినప్పటికీ జిల్లాలో కొందరు వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించిన జిల్లా అధికారులు, సీసీలపై వేటు పడటం ఖాయమైంది. ఈ నేపథ్యంలో వారు జాగ్రత్తగా సర్దుకుంటున్నట్లు తెలుస్తోంది. జిల్లాలోని గ్రామ సచివాలయ అధికారి నుంచి ఉన్నతాధికారి వరకు దాదాపు వంద మంది వైసీపీ ఏజెంట్లుగా పని చేస్తున్నారు. వీరు అడ్డూ అదుపు లేకుండా ఇష్టానుసారంగా వ్యవహరించారు. పైసలిస్తేనే ఫైళ్లు వీళ్లు పనులు చేస్తారనే ఆరోపణలు ఉన్నాయి. సస్పెండ్‌ అయిన ప్రతి ఉద్యోగి మరల ఉద్యోగంలో వెళ్లాలన్నా సీసీల అనుమతి పొందాల్సిందే అనే విమర్శలున్నాయి. చిన్న పనికి ఒక రేటు, పని పెద్దదైతే వాటా ఇవ్వాల్సిందే అని హుకుం జారీ చేస్తున్నారు. వైసీపీ హయాంలో ప్రభుత్వ కార్యాలయాలకు ప్రజలకు ఎక్కడికి వెళ్లినా ఎమ్మెల్యే లెటరు ఉండాలని, లేదా ఎమ్మెల్యేతో ఫోన్‌ చేయించండని బహిరంగంగానే వీరు అనేవారనే విమర్శలు ఉన్నాయి. సమస్యల పరిష్కారం కోసం జిల్లా ఉన్నత స్థాయి అధికారికి వినతి పత్రం ఇవ్వాలన్నా, రుసుం చెల్లించుకునే పరిస్థితి ఉండేది. కార్యాలయంలో సీసీలు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నా జిల్లా ఉన్నతాధికారులు చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెలువెత్తుతున్నాయి.

టీడీపీ నాయకులతో అధికారుల రాయబారాలు

వైసీపీ ప్రభుత్వంలో ఎన్నడూ లేని విధంగా కొంత మంది అధికారులు వీచక్షణోల్పోయి ప్రభుత్వానికి వీర విధేయులుగా పని చేశారు. మరికొందరు వైసీపీనే శాశ్వతంగా అధికారంలో ఉంటుందన్న భ్రమలో పడి ప్రతిపక్ష పార్టీలను టార్గెట్‌ చేసి వేధించారు. మరికొందరు అధికారులైతే వైసీపీ నాయకుల కంటే అత్యుత్సాహంతో పని చేశారు. జూన్‌ 4న వెలువడిన ఫలితాలతో రాష్ట్రంలో వైసీపీ తుడిచి పెట్టుకుపోయిందని చెప్పవచ్చు. దశాబ్దాలుగా కాంగ్రెస్‌ పార్టీకి, ఆ తర్వాత వైసీపీకి కంచుకోటగా ఉన్న నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు భారీ విజయం సాధించారు. ఈ తరుణంలో వైసీపీ వీర విధేయులైన అధికారులు మూడు, నాలుగు రోజులుగా నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ప్రస్తుతం వారు పని చేస్తున్న ప్రాంతాల్లో ఉండటం కంటే వేరే చోటుకు వెల్లిపోవడం మేలని భావిస్తున్నారు. మరి కొంత మంది అధికారులు ఇప్పటికే తట్టాబుట్టా సర్దుకునే పనిలో ఉన్నారు. మరికొందరైతే తెలుగుదేశం పార్టీ నాయకులకు టచ్‌లోకి వచ్చి రాయబారాలు నడుపుతున్నారు. ఐదేళ్లలో కొంత మంది అధికారుల పనితీరు సామాన్యులకు పెట్టిన ఇబ్బందులు ప్రతిపక్ష నాయకులను వేధించిన తీరు గుర్తు పెట్టుకున్న కార్యకర్తలు మాత్రం తమకు ఇబ్బంది పెట్టిన వారికి నాయకులు సహకరిస్తే సహించేది లేదని ఖరాకండిగా చెబుతున్నారు.

వైసీపీ ఏజెంట్లను బదిలీ చేయాలి

వైసీపీ ప్రభుత్వంలో తమను ఇబ్బంది పెట్టిన అధికారులను బదిలీ చేయాలని టీడీపీ కార్యకర్తలు కోరుతున్నారు. ఈ ఐదేళ్లలో ఇబ్బందులు పెట్టిన పోలీసులు, రెవెన్యూ, ఇతర శాఖల అధికారులకు సహకరించి తీసుకొచ్చినా, ఇక్కడున్న వారిని కొనసాగించినా వ్యతిరేకిస్తామని కార్యకర్తలు బహిరంగంగా పేర్కొంటున్నారు. ముఖ్యంగా పోలీసు, రెవెన్యూ, సెబ్‌, మున్సిపల్‌ శాఖల్లోని అధికారులపై తీవ్రమైన ఆరోపణలు బలంగా ఉన్నాయి. ఇలాంటి వీర విధేయులైన అధికారులకు ఈ నెల 4వ తేదీ నుంచి వణుకు మొదలైందని చెప్పవచ్చు.

Updated Date - Jun 08 , 2024 | 12:14 AM