టూరిజం.. నిర్వీర్యం..!
ABN , Publish Date - Jul 31 , 2024 | 11:53 PM
పర్యాటక శాఖ నిధులన్నీ రుషికొండకు తరలించారు. జగన్ కోసం రూ. వందల కోట్లతో అందమైన ప్యాలెస్ నిర్మించారు.
సుంకేసుల, ఉరుకుందలో అసంపూర్తిగా పర్యాటక శాఖ భవనాలు
అసాంఘిక కార్యక్రమాలకు నిలయం
గత ఐదేళ్లలో నిధుల్లేక విలవిల
వైసీపీ హయాంలో పర్యాటక శాఖ అస్తవ్యస్తం
కర్నూలు, జూలై 31 (ఆంధ్రజ్యోతి): పర్యాటక శాఖ నిధులన్నీ రుషికొండకు తరలించారు. జగన్ కోసం రూ. వందల కోట్లతో అందమైన ప్యాలెస్ నిర్మించారు. నిధుల లేమి.. చిత్తశుద్ధి లోపం.. పాలకుల అసమర్థత వెరసి గత వైసీపీ ప్రభుత్వంలో పర్యాటక (టూరిజం) శాఖను నిస్తేజంగా మారింది. పర్యాటకుల విడిది కోసం నిర్మిస్తున్న వివిధ భవనాలు అసంపూర్తిగా నిలిచిపోయాయి. ఐదేళ్లుగా ఒక్కపైసా ఇవ్వకపోగా.. చేసిన పనులకు కూడా బిల్లులు ఇవ్వలేదు. అసంపూర్తి భవనాలు మద్యపాన ప్రియులకు విడిదిగా, అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారాయి. ఈ భవనాలు నిర్మించలేం.. నిర్వహణ చేయలేమంటూ ఆ శాఖ అధికారులు లీజుకు ఇచ్చేశారు. వారైనా పనులు మొదలు పెట్టారా..? అంటే అదీలేదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి సుంకేసుల జలాశయం, ఉరుకుంద, కేతవరం వద్ద అసంపూర్తిగా ఉన్న ఏపీ టూరిజం భవనాలను పూర్తి చేయాలని పలువురు కోరుతున్నారు.
రాష్ట్ర విభజన తరువాత ఉమ్మడి కర్నూలు జిల్లాను టెంపుల్ టూరిజం సర్క్యూట్‌గా అభివృద్ధి చేయాలని ఆనాటి టీడీపీ ప్రభుత్వం సంకల్పించింది. అందులో భాగంగానే టెంపుల్ టూరిజం అభివృద్ధి కోసం ఉత్తర్వులు కూడా జారీ చేశారు. నల్లమల పర్వతశ్రేణి ఉత్తర భాగం సహజమైన వాతావరణం, పాతలగంగమ్మ (కృష్ణమ్మ) చెంత వెలసిన శ్రీశైలం మల్లన్న క్షేత్రం, మహానంది, అహోబిళం, మంత్రాలయం, యాగంటి, చౌడేశ్వరిదేవి క్షేత్రం, కొలనుభారతి, ఉరకుంద.. వంటి ఆధ్యాతిక క్షేత్రాల సహా సప్తనదుల సంగమేశ్వరం, సుంకేసుల జలాశయం, ఓర్వకల్లు రాతివనాలు, కేతవరం గుహల్లో ఆదిమానవులు చిత్రాలు లిపి, బెలంగుహలు.. ఇలా ఎన్నో ఆధ్యాత్మిక, ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకునే పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. పర్యాటకులను ఆకట్టుకోవడానికి విడిది వంటి సౌకర్యాలు కల్పించాలనే లక్ష్యంగా భవన నిర్మాణాలకు గత టీడీపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అందులో భాగంగానే 2017-18 మధ్యలో దాదాపు రూ.3.40 కోట్లతో కేతవరం ఆదిమానవులు గుహలు, సుంకేసులు బ్యారేజీ, ఉరుకుందు ఈరన్న క్షేత్రంలో పర్యటకులు, భక్తుల కోసం విడిది భవనాలు, పిల్లలకు ఆట సామగ్రి ఏర్పాటు వంటి పనులు చేపట్టారు. ఆనాటి పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిల ప్రియ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. అయితే భవన నిర్మాణాలు వివిధ దశల్లో ఉండగానే.. 2019 ఎన్నికల రావడం, ఆ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయి వైసీపీ గెలవడం, సీఎంగా జగన్ బాధ్యతలు చేపట్టడం జరిగింది. ఐదేళ్లు వైసీపీ ప్రభుత్వం ఒక్కపైసా కూడా నిధులు ఇవ్వకపోవడంతో ఎక్కడి నిర్మాణాలు అక్కడే అసంపూర్తిగా ఆగిపోయాయి.
అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా..
కర్నూలు నగరానికి 26 కిలోమీటర్ల దూరంలో తుంగభద్ర నదిపై సుంకేసుల బ్యారేజీ (డ్యాం) 1861లో ఆనాటి బ్రిటీష్ పాలన కాలంలో నిర్మించారు. బ్యారేజీకి 30 గేట్లు ఏర్పాటు చేశారు. తుంగభద్రకు వరద వస్తే గేట్లుఎత్తి వరదను దిగువకు విడుదల చేస్తారు. కనువిందు చేసే వరద దృశ్యాలను తిలకించేందుకు కర్నూలు నగరం సహా వివిధ ప్రాంతాల నుంచి ప్రకృతి పర్యాటకులు కుటుంబాలతో సహా వస్తున్నారు. సెలవు రోజుల్లో పర్యాటకుల తాకిడి భారీగా ఉంటుంది. అయితే అక్కడ ఎలాంటి విడిది వసతి లేదు. దీంతో 2017-18లో ఆనాటి టీడీపీ ప్రభుత్వం రూ.1.25 కోట్లతో పర్యాటకుల విడిది కోసం వివిధ సౌకర్యాలతో జలాశయం సమీపంలోనే అందమైన భవన నిర్మాణం చేపట్టింది. 50 శాతానికిపైగా పూర్తి పనులు పూర్తయ్యాయి. వైసీపీ ప్రభుత్వం వచ్చాక బిల్లులు ఇవ్వకపోవడంతో పనులు ఆగిపోయాయి. అసంపూర్తిగా ఉన్న ఆ భవనం మద్యపాన ప్రియులకు కేంద్రంగా మారింది. చీకటి పడితే అసాంఘిక కార్యకలాపాలకు నిలయమైందని స్థానికులు ఆరోపిస్తున్నారు. అసంపూర్తి భవనాన్ని పరిశీలిస్తే ఏ గదిలో చూసినా ఖాళీ మద్యం సీసాలే దర్శనమిస్తున్నాయి. కనీస పర్యవేక్షణ కూడా లేదు. ఓర్వకల్లు మండలం కేతవరం ఆదిమానవుల గుహలు, ఆనాటి చిత్ర లిపికి ప్రసిద్ధి. వీక్షించేందుకు రాష్ట్ర నలమూలల నుంచి చారిత్రక పర్యాటక ప్రేమికులు వస్తుంటారు. వారి కోసం రూ.90 లక్షలతో విడిది భవనంతో పాటు పిల్లలు ఆడుకోవడానికి వివిధ పరికరాలు ఏర్పాటు చేశారు. కౌతాళం మండలం ఉరుకుంద లక్ష్మినరసింహస్వామి (ఈరన్న) క్షేత్రం ఆధ్యాత్మిక క్షేత్రంగా బాసిల్లుతోంది. శ్రావణ మాసంలో లక్షలాది భక్తులు వస్తుంటారు. ఏపీ పర్యాటక శాఖ రూ.75 లక్షలతో విడిది భవనం నిర్మాణం చేపట్టింది. ఈ భవనాలు కూడా అసంపూర్తిగా ఆగిపోయాయి.
లీజుకి ఇచ్చినా..
‘మా శాఖకు నిధులు లేవు.. ఆ భవనాలను సంరక్షించే సిబ్బంది లేరు..’ అంటూ ఏపీ టూరిజం శాఖ అధికారులు వాటిని 15-20 ఏళ్లు లీజుకు ఇచ్చారు. గత ప్రభుత్వంలో లీజు కేటాయింపుల్లో కూడా భారీగా అక్రమాలు జరిగాయనే ఆరోపణలు ఉన్నాయి. సుంకేసుల బ్యారేజీ వద్ద నిర్మించిన పర్యాటక భవనం ఏడాదికి రూ.5 లక్షల చొప్పున పూర్ణచంద్రరావు లీజుకు తీసుకున్నారు. ఉరుకుంద క్షేత్రంలోని భవనం ఏడాదికి రూ.50వేలు, కేతవరం భవనం రూ.లక్ష చొప్పున మల్లికార్జున అనే వ్యక్తికి ఏపీ పర్యాటక శాఖ అధికారులు లీజుకు ఇచ్చారు. ప్రస్తుతం ఎలా ఉందో ఆ దశలోనే భవనం లీజుదారులకు అప్పగిస్తే.. ఆ భవనాన్ని వారు నిర్మాణం పూర్తి చేసి, పర్యాటక శాఖ నిబంధనల ప్రకారం సౌకర్యాలు కల్పించాల్సి ఉంది. పర్యాటకులకు అద్దెకు ఇవ్వాలి. అయితే సుంకేసుల వద్ద భవనం తీసుకున్న లీజుదారుడు పూర్ణచంద్రరావు ఇప్పటికీ ఒప్పందం (అగ్రిమెంట్) చేసుకోలేదు. అసంపూర్తి భవనాలు నిర్మాణాలు చేపట్టలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి లీజును రద్దు చేసి పర్యాటక శాఖ ఆధ్వర్యంలోనే భవనాలు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని పలువురు కోరుతున్నారు.
నిధులు రాకపోవడంతో లీజుకు ఇచ్చాం
సుంకేసుల బ్యారేజీ, ఉరుకుంద, కేతవరం వద్ద ఏపీ టూరిజం శాఖ ఆధ్వర్యంలో పర్యాటకుల వసతి కోసం దాదాపు రూ.2.90 కోట్లతో విడిది భవనాల నిర్మాణం చేపట్టాం. నిధులు రాకపోవడంతో అసంపూర్తిగా నిలిచిపోయాయి. వాటిని లీజుకు ఇచ్చాం. లీజుదారులు నిర్మాణాలు పూర్తి చేసి టూరిజం శాఖ నిబంధనల మేరకు పర్యాటకులకు అద్దెకు ఇవ్వవచ్చు. ఏటేటా లీజు మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. నిధులు, సిబ్బంది కొరత కారణంగానే లీజుకు ఇచ్చాం.
- విజయ, జిల్లా టూరిజం అధికారి, కర్నూలు