Share News

నేడే తీర్పు

ABN , Publish Date - Jun 03 , 2024 | 11:35 PM

ఓటరు తీర్పు వెలువడే కీలక సమయం ఆసన్నమైంది. 21 రోజుల నిరీక్షణకు మంగళవారం తెరపడనుంది.

నేడే తీర్పు

కొన్ని గంటల్లో మొదలుకానున్న ఓట్ల లెక్కింపు

నేటితో తేలనున్న అభ్యర్థుల భవితవ్యం

రాయలసీమ వర్సిటీలో కౌంటింగ్‌ కేంద్రాలు

గెలుపుపై టీడీపీ, వైసీపీ ధీమా

పకడ్బందీ ఏర్పాట్లు చేసిన జిల్లా యంత్రాంగం

లోక్‌సభ స్థానం బరిలో 19 మంది అభ్యర్థులు

ఎనిమిది అసెంబ్లీ స్థానాల నుంచి పోటీలో 102 మంది

లెక్కించాల్సిన ఈవీఎం, పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు 15,93,095

కర్నూలు, జూన్‌ 3 (ఆంధ్రజ్యోతి): ఓటరు తీర్పు వెలువడే కీలక సమయం ఆసన్నమైంది. 21 రోజుల నిరీక్షణకు మంగళవారం తెరపడనుంది. విజేతలెవరో.. పరాజితులు ఎవరో కొన్ని గంటల్లో తేలిపోనుంది. 2014 ఎన్నికల్లో టీడీపీకి పట్టం కట్టిన ఓటర్లు.. 2019 ఎన్నికల్లో జగన్‌కు అవకాశం ఇచ్చారు. ఈ ఐదేళ్లలో సంక్షేమం పేరిట ప్రగతికి పాతర వేశారు. విధ్వంస పాలన సాగించారు. సాగునీటి ప్రాజెక్టులు పడకేశాయి. నిత్యావసర ధరలు చుక్కలు తాకాయి. రాష్ట్రాన్ని జగన్‌ అప్పుల ఊబిలో నెట్టేశాడు. రాజధాని లేని రాష్ట్రంగా మార్చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల్లో తీవ్రమైన వ్యతిరేకత ఊడలు పాకింది. ‘జన పాలన’ లక్ష్యంగా టీడీపీ సారథ్యంలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమిగా బరిలో దిగారు. రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబు నాయకత్వం కావాలి. కేంద్ర, రాష్ట్రంలో డబుల్‌ ఇంజన్‌ ప్రభుత్వం రావాలి అంటూ కూటమి నాయకులు, అభ్యర్థులు ప్రజల మధ్యకు వెళ్లారు. మరో చాన్స్‌ ఇవ్వండని జగన్‌ జనాన్ని కోరారు. మళ్లీ జగన్‌కు అవకాశం ఇస్తారా..? టీడీపీ సారథ్యంలోని కూటమికి పట్టం కడతారా..? అనేది మంగళవారం తేలనుంది. మెజార్టీ ఎగ్జిట్‌ పోల్‌ సర్వే సంస్థలు కూటమికే జై కొట్టాయి. గెలుపుపై ఇరుపార్టీల నాయకులు ఎవరి ధీమా వారు వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో అత్యధిక స్థానాలు సాధించి కందనవోలు కోటపై జెండా ఎగుర వేస్తామని అంటున్నారు. రాయలసీమ యూనివర్సిటీలో మంగళవారం ఓట్ల లెక్కింపు కోసం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ డాక్టర్‌ జి. సృజన పర్యవేక్షణలో పకడ్బందీ ఏర్పాట్లు చేశారు.

జిల్లాలో కర్నూలు లోక్‌సభ స్థానాల పరిధిలో 19 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 8 అసెంబ్లీ స్థానాల్లో 102 మంది పోటీ చేశారు. 121 మంది అభ్యర్థులు అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఏప్రిల్‌ 16వ తేదీన ఎన్నికల షెడ్యూల్‌ వచ్చింది. గెలవాలనే లక్ష్యంగా రాజకీయ, సామాజిక సమీకరణలు పరిగణలోకి తీసుకొని ప్రధాన పార్టీలు బలమైన అభ్యర్థులను బరిలో దింపాయి. ప్రచారంలో వ్యూహ ప్రతి వ్యూహాలు అమలు చేశారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు, హిందూపురం ఎమ్మెల్యే, సినీహీరో నందమూరి బాలకృష్ణ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌లు కూటమి అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేస్తే.. వైసీపీ అభ్యర్థుల తరుపున ఆ పార్టీ అధ్యక్షుడు, సీఎం జగన్‌, కాంగ్రెస్‌ సారథ్యంలోని ఇండియా కూటమి అభ్యర్థులకు మద్దతుగా ఏపీ పీసీసీ చీఫ్‌ వైఎస్‌ షర్మిల ప్రచారం నిర్వహించారు.

21 రోజుల నిరీక్షణకు తెర

కర్నూలు పార్లమెంట్‌ పరిధిలోని కర్నూలు, కోడుమూరు (ఎస్సీ), ఎమ్మిగనూరు, ఆదోని, మంత్రాలయం, పత్తికొండ, ఆలూరు నియోజకవర్గాలు సహా నంద్యాల పార్లమెంట్‌ పరిధిలోని పాణ్యం నియోజకవర్గం కలిపి 8 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 20,54,563 మంది ఓటర్లు ఉంటే.. 15,70,007 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. 76.42 శాతం పోలింగ్‌ నమోదైంది. గత ఎన్నికలతో పోలిస్తే 0.55 శాతం పెరిగింది. అత్యధికంగా పత్తికొండ నియోజకవర్గంలో 84.98 శాతం పోలింగ్‌ నమోదు కాగా.. అత్యల్పంగా కర్నూలు నియోజకవర్గంలో 63.75 శాతం నమోదైంది. 2019 ఎన్నికల్లో కర్నూలులో 59.53 శాతమే నమోదైంది. అంటే.. 4.22 శాతం ఓటింగ్‌ పెరగడం టీడీపీకి కలిసి వస్తుందని ఆ పార్టీ నాయకులు అంటున్నారు. ఈవీఎంలో పోలైన 15,70,007 ఓట్లు, పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు 23,088 కలిపి 15,93,095 ఓట్లు లెక్కించాల్సి ఉంది. 1,100 మంది సిబ్బంది విధులు నిర్వహించనున్నారు. ఆ మేరకు జిల్లా ఎన్నికల అధికారులు ఏర్పాట్లు చేశారు.

బెట్టింగ్‌ల జోరు

పోలింగ్‌కు, ఓట్ల లెక్కింపునకు మధ్య 21 రోజులు సమయం ఉండటంతో పోలింగ్‌ తర్వాత బెట్టింగ్‌ జోరు తగ్గింది. కౌంటింగ్‌కు ఒకటి రెండు రోజులు గడువు ఉండగా బెట్టింగ్‌రాయుళ్లు పేట్రేగిపోయారు. టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఎగ్జిట్‌ పోల్స్‌ సర్వే మెజార్టీ సంస్థలు అంచనాలు వేయడం, కొన్ని సంస్థలు మళ్లీ వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుందని అంచనాలు వేయడంతో చివరి రోజు కూడా పెద్ద ఎత్తున బెట్టింగ్‌ జరిగింది. ముఖ్యంగా రాష్ట్రంలో టీడీపీ సారథ్యంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుందని, జిల్లాలో మెజార్టీ నియోజకవర్గాల్లో టీడీపీ గెలవబోతుందని బెట్టింగ్‌రాయుళ్లు పెందేలు కాస్తున్నారు. వైసీపీనే గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని పలువురు పందెం కట్టారు. జిల్లాలో సుమారుగా రూ.50-75 కోట్లకు పైగా బెట్టింగ్‌ జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు.

నియోజకవర్గాల వారీగా లెక్కించాల్సిన ఓట్లు

నియోజకవర్గం ఈవీఎం పోస్టల్‌ మొత్తం

బ్యాలెట్స్‌

కర్నూలు 1,74,973 4,349 1,79,322

పత్తికొండ 1,90,009 2,509 1,92,518

కోడుమూరు(ఎస్సీ) 1,95,181 2,837 1,98,300

ఎమ్మిగనూరు 2,03,086 3,119 2,06,205

మంత్రాలయం 1,75,667 722 1,76,389

ఆదోని 1,75,064 1,931 1,77,598

ఆలూరు 2,09,092 1,729 2,10,821

కర్నూలు పార్లమెంట్‌ 13,23,072 17,196 13,40,268

పాణ్యం 2,46,935 5,892 2,52,827

జిల్లా మొత్తం 15,70,007 23,088 15,93,095

కౌంటింగ్‌ వివరాలు

ఓట్ల లెక్కింపు : జూన్‌ 4

అసెంబ్లీ నియోజకవర్గాలు : 8

మొత్తం ఓట్లు : 20,54,563

లెక్కించాల్సిన ఓట్లు (ఈవీఎం) : 15,70,007

పోస్టల్‌ బ్యాలెట్స్‌ ఓట్లు : 23,088

కౌంటింగ్‌ కేంద్రాలు : 8

కౌంటింగ్‌ టేబుల్స్‌ : 112 (ఒక్కో

నియోజకవర్గానికి 14)

రౌండ్లు : 161 (ఒక్కో

నియోజకవర్గానికి 19 - 26)

పార్లమెంట్‌ స్థానం : కర్నూలు

మొత్తం ఓట్లు : 17,22,857

లెక్క పెట్టాల్సి ఓట్లు (ఈవీఎం) : 13,23.072

పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు : 17,196

కౌంటింగ్‌ సిబ్బంది : 1,100

Updated Date - Jun 03 , 2024 | 11:35 PM