Share News

నేడు బక్రీద్‌

ABN , Publish Date - Jun 17 , 2024 | 12:01 AM

త్యాగనిరతిని చాటి చెబుతూ, దైవం పట్ల ఆరాధన భావాన్ని పెంచే ‘బక్రీద్‌’ (ఈద్‌-ఉల్‌-అదా) పండుగను సోమవారం ఉమ్మడి జిల్లాల్లోని ముస్లింలు ఘనంగా నిర్వహించుకోనున్నారు.

నేడు బక్రీద్‌

ఉమ్మడి జిల్లాలోని ఈద్గాలలో ప్రత్యేక ప్రార్థనలు

కర్నూలు (కల్చరల్‌), జూన్‌ 16: త్యాగనిరతిని చాటి చెబుతూ, దైవం పట్ల ఆరాధన భావాన్ని పెంచే ‘బక్రీద్‌’ (ఈద్‌-ఉల్‌-అదా) పండుగను సోమవారం ఉమ్మడి జిల్లాల్లోని ముస్లింలు ఘనంగా నిర్వహించుకోనున్నారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లోని ఈద్గాలను ప్రత్యేక ఈద్‌ ప్రార్థనలకు సిద్ధం చేశారు. భక్తులకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. బక్రీద్‌ వేడుక రోజున ఆరుబయట ఈద్గాల్లో ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. అనంతరం మత పెద్దలు ధార్మిక సందేశాలు ఇస్తారు. ఈ నేపథ్యంలో ఆయా ఈద్గాల్లో వందలాదిగా హాజరయ్యే భక్తులకు నగర పాలక సంస్థ అధికారులు తగిన సదుపాయాలు కల్పించారు. కర్నూలు నగరంలోని కొత్త బస్టాండు రోడ్డులోని పాత ఈద్గాను, సంతో్‌ష నగర్‌లోని కొత్త ఈద్గాను ఎస్పీ జి. కృష్ణకాంత్‌ పరిశీలించారు. బందోబస్తు, ట్రాఫిక్‌ మళ్లింపుపై పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇక పండుగ రోజున ఇళ్లలో తయారు చేసుకునే ప్రత్యేక తీపి వంటకాలకు కావాల్సిన సేమ్యా, డ్రైఫ్రూట్‌, మసాలా దినుసులు వంటి సామగ్రి కొనుగోళ్లకు పాతనగరంలోని మార్కెట్‌ ప్రాంతాలు సందడిగా కనిపించాయి.

దానగుణాన్ని, త్యాగ నిరతిని పెంచేదే బక్రీద్‌...

బక్రీద్‌ పండుగ సమాజంలోని వ్యక్తుల్లో దానగుణాన్ని, త్యాగ నిరతిని పెంపొందిస్తుంది. తమ ఇంటితోపాటు పేదలు, దగ్గరి బంధువులు, ఇరుగుపొరుగు వారిని కూడా ఈ సంతోషంలో భాగస్వామ్యం చేయాలని ఉద్బోధిస్తుంది. తమకు కలిగిన దానిలో కొంత దానం చేసి, తాము తినేదానిలో కొంత ఇతరులకు పెట్టాలని చెబుతుంది. అందుకే బక్రీద్‌ వేడుక రోజున త్యాగనిరతిని చాటుకుంటూ ఇతరులకు తమవంతు సహకారాలు అందిస్తారు.

Updated Date - Jun 17 , 2024 | 12:01 AM