దాహార్తి..!
ABN , Publish Date - Mar 06 , 2024 | 12:26 AM
దాహార్తి..!

జిల్లాలో ముంచుకొస్తున్న తాగునీటి ముప్పు!
జలాశయాల్లో తగ్గిపోతున్న నీటి నిల్వలు
అందుబాటులో ఉన్నది 4.294 టీఎంసీలే
నీటి పొదుపు పాటించకపోతే ఇబ్బందులు తప్పవంటున్న ఇంజనీర్లు
కలెక్టరుకు నివేదిక
వేసవి వచ్చేసింది. ఎండలు మండిపోతున్నాయి. 39-40 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు చేరాయి. ఇప్పటికే జిల్లాలో కొన్ని చోట్ల తాగు నీటి సమస్య వచ్చింది. ప్రజలు ఇబ్బందిపడుతున్నారు. జలాశయాల్లో నీటి నిల్వలు పడిపోతున్నాయి. జిల్లా దాహార్తిగా మారిపోతున్నది. వేసవి తీవ్రత దృష్ట్యా ఉన్న నీటిని పొదుపుగా వాడుకోకపోతే తాగునీటి ముప్పు తప్పదని ఇంజనీర్లు హెచ్చరిస్తున్నారు. ఏ ఏ జలాశయంలో ఎంత నీరు నిల్వ ఉంది..? పరిసర గ్రామాల్లో తాగునీటి అవసరాలు ఎలా ఉన్నాయి? అనే అంశాలను పరిశీలిస్తే రాబోయే రోజుల్లో వేసవి నీటి ఎద్దడి తీవ్రం అయ్యే ప్రమాదం కనిపిస్తున్నది. ఈ ప్రమాద ఘంటికలను గుర్తించి నీటి వినియోగంలో ముందస్తు పొదుపు చర్యలు తీసుకోకపోతే ఇబ్బందులు తప్పవని ఇంజనీర్లు అంటున్నారు. ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం శనివారం కలెక్టరు డాక్టర్ జి. సృజన గ్రామీణ తాగునీటి విభాగం, జలవనరుల శాఖ, పురపాలక శాఖ ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు.
కర్నూలు, మార్చి 5 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కర్నూలు, ఆదోని, ఎమ్మిగనూరు, ఆలూరు, మంత్రాలయం, కోడుమూరు, పత్తికొండ, పాణ్యం నియోజకవర్గాల పరిధిలో 721 హ్యాబిటేషన్ గ్రామాలు ఉన్నాయి. 2011 గణాంకాల ప్రకారం గ్రామీణ జనాభా 16.55 లక్షలు ఉన్నారు. తాజాగా 17.50 లక్షలు దాటి ఉంటుందని అంచనా. పల్లెసీమల్లో శుద్ధి చేసిన తాగునీరు అందించాలనే లక్ష్యంగా జిల్లా గ్రామీణ తాగునీటి సరఫరా విభాగం (ఆర్‌డబ్ల్యూఎస్) పర్యవేక్షణలో 32 సమగ్ర రక్షిత మంచినీటి పథకాలు (సీపీడబ్ల్యూఎస్) ఉన్నాయి. వీటి నిర్వహణ కోసం ఏటేటా రూ.42-45 కోట్లు ఖర్చు చేస్తున్నారు. 225 గ్రామాలకు శుద్ధి చేసిన స్వచ్ఛమైన తాగునీరు అందిస్తున్నామని ఇంజనీర్లు పేర్కొంటున్నారు. మరో 496 గ్రామాల్లో పీడబ్ల్యూసీ పథకాలు, చేతిబోర్లు ద్వారా తాగునీరు అందిస్తున్నారు. సోమవారం జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రత 39.1 డిగ్రీలకు చేరింది. ఉదయం 11.30 గంటలు దాటితే ఎండ తీవ్రతకు జనం తల్లడిల్లుతున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే.. ఏప్రిల్, మే నెలల్లో ఉష్ణోగ్రత 42-45 డిగ్రీలకు చేరవచ్చని అంచనా వేస్తున్నారు. పల్లె ముంగిట నీటి ఎద్దడి తలెత్తకుండా వేసవి దాహం తీర్చే దిశగా జిల్లా యంత్రాంగం తొలి ప్రాధాన్యతగా పనులు చేయాలి.. నీటి పొదుపుపై గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఎస్‌ఎస్ ట్యాంకులు నింపుకోవాలి
తుంగభద్ర దిగువ కాలువ (ఎల్లెల్సీ) ద్వారా 195 గ్రామాలకు తాగునీరు అందిస్తున్నారు. తుంగభద్ర జలాశయం నుంచి 2023-24 నీటి సంవత్సరంలో ఎల్లెల్సీ వాటా 12.226 టీఎంసీలు, కేసీ వాటా 5.094 టీఎంసీలు కలిపి 17.32 టీఎంసీలు కేటాయించారు. కేసీ వాటాలో ఒక టీఎంసీ ఎల్లెల్సీకి, ఒక టీఎంసీ హెచ్చెల్సీకి మళ్లించారు. సోమవారం నాటికి కేవలం ఎల్లెల్సీ కోటా 0.55 టీఎంసీలు, కేసీ కోటా 1.19 టీఎంసీలు కలిపి 1.74 టీఎంసీలు మాత్రమే అందుబాటులో ఉంది. తుంగభద్ర డ్యాంలో ప్రస్తుతం 8.25 టీఎంసీలు మాత్రమే ఉంది. 4 టీఎంసీలకు పడిపోతే మన వాటా మిగులు జలాలు ఉన్నా.. టీడీపీ అధికారులు విడుదల చేసేందుకు అవకాశం ఉండదు. దీంతో మిగులు నీటిని ఎల్లెల్సీ ద్వారా తీసుకొని గాజులదిన్నె జలాశయం సహా ఎస్‌ఎస్ ట్యాంకులు, వివిధ చెరువుల్లో నిల్వ చేసుకోవాల్సిన అవసరం ఉంది. శ్రీశైలం జలాశయంలో 37.35 టీఎంసీలు నిల్వ ఉన్నా కర్నూలు జిల్లాకు పెద్దగా ఉపయోగం ఉండదు. ప్రస్తుతం ఎల్లెల్సీలో ఆదోని మండలం హానవాలు వద్ద 451 క్యూసెక్కులు ప్రవహిస్తున్నాయి. 210 క్యూసెక్కులు గాజులదిన్నెకు విడుదల చేస్తున్నారు. అదే క్రమంలో ఎస్‌ఎస్ ట్యాంకులు నింపుకోవాలని ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులను కలెక్టరు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు.
అందుబాటులో 4.294 టీఎంసీలే:
జిల్లాలో తుంగభద్ర డ్యాం, గాజులదిన్నె, కృష్ణగిరి, పత్తికొండ, పులికనుమ, సుంకేసులు జలాశయాలు ద్వారా ఆయా గ్రామాలు సహా కర్నూలు, ఎమ్మిగనూరు, ఆదోని, పత్తికొండ.. వంటి పట్టణాలకు తాగునీరు అందుతుంది. ఆయా జలాశయాల్లో శనివారం నాటికి అందుబాటులో ఉన్న నీటి నిల్వలు 4.294 టీఎంసీలే. అందులో వేసవి ఎండల తీవ్రతకు నెలకు 1.5 (రిజర్వాయర్ లాసెస్) నీటి ఆవిరి ఉంటుందని ఇంజనీర్లు అంటున్నారు. మూడు నెలలకు సగటున 2.5 శాతం చొప్పున 0.107 టీఎంసీలు నష్టపోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా లీకేజీలు, నీటి పంపిణీలో నష్టం, నీటి దొంగతనం.. రూపంలో సగటున 20-25 శాతం నీటి నష్టం పోవాల్సి ఉంటుంది. తుంగభధ్ర జలాశయం నుంచి ఎల్లెల్సీ ద్వారా మన వాటా నీటిని తీసుకుంటే 135 కి.మీలు కర్ణాటకలో ప్రవహించాల్సి ఉంటుంది. అక్కడ నీటి చౌర్యం, సిస్టమ్ లాస్ దాదాపు 30-35 శాతం ఉంటుందని అంటున్నారు. వీటన్నిటిని పరిగణలోకి తీసుకుంటే సరాసరి 3.25 టీఎంసీలకు మించి అందుబాటులో ఉండదని అంచనా వేస్తు న్నారు. ఇలాంటి పరిస్థితుల్లో జలవనరుల శాఖ, గ్రామీణ తాగునీటి సరఫరా విభాగం ఇంజనీర్లు, సిబ్బంది సమన్వయంతో ప్రతి నీటి బొట్టును పక్కాగా వినియోగించుకునేలా ప్రణాళికలు రూపొందించి పక్కాగా అమలు చేయాలి. నిర్లక్ష్యం చేస్తే నీటి ఎద్దడితో అల్లాడాల్సి వస్తుంది.