Share News

గాజులదిన్నె ముప్పు

ABN , Publish Date - May 24 , 2024 | 11:42 PM

కోడుమూరు పట్టణం సహా ఆరు గ్రామాలను గాజులదిన్నె ప్రాజెక్టు ప్రమాదపు అంచుల్లో నిలబెట్టింది.

గాజులదిన్నె ముప్పు

గేట్లు పెట్టారు.. రోప్‌ కనెక్షన్‌ ఏదీ?

ఒక్క గేటు కూడా తెరవలేని పరిస్థితి

వానొచ్చి.. వరదొస్తే ఆనకట్టకు ప్రమాదం

అదే జరిగితే కోడుమూరు సహా ఆరు గ్రామాలకు ముంపు ముప్పు

రూ.10 కోట్ల బకాయి.. పనులు ఆపేసి వెళ్లిన కాంట్రాక్టరు

అసంపూర్తిగానే మట్టి పనులు

కర్నూలు, మే 24 (ఆంధ్రజ్యోతి): కోడుమూరు పట్టణం సహా ఆరు గ్రామాలను గాజులదిన్నె ప్రాజెక్టు ప్రమాదపు అంచుల్లో నిలబెట్టింది. వానొస్తే నిద్రలేని రాత్రులతో ఆ గ్రామాల ప్రజలు బిక్కు బిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. ప్రాజెక్టు మరమ్మతుల్లో భాగంగా ఆరు కొత్త గేట్లు పెట్టారు. ఆ గేట్లు ఎత్తి దించేందుకు వీలుగా రోప్‌ కనెక్షన్‌ ఇవ్వలేదు. ట్రయల్‌ రన్‌ కూడా చేయలేదు. ఎగువన 106 మిల్లీ మీటర్ల దాకా వర్షపాతం నమోదు అవుతున్నది. భారీ వర్షాలు కురిసి.. వరదొచ్చి జలాశయం నిండితే ఆపై వచ్చే వరదను ఎక్కడికి మళ్లించాలి..? ఒత్తిడి పెరిగితే గేట్లు కొట్టుకపోవడమో, ఆనకట్ట తెగిపోవడమో జరగవచ్చు. అదే జరిగితే కోడుమూడు పట్టణం సహా ఆరు గ్రామాలు ముంపు బారినపడినట్లే. ప్రభుత్వం కాంట్రాక్టరుకు సకాలంలో బిల్లు చెల్లించకపోవడంతో ఈ స్థితి ఏర్పడింది.

జిల్లాలో గోనెగండ్ల, కోడుమూరు, కృష్ణగిరి, దేవనకొండ, డోన్‌ మండలాల్లోని పలు గ్రామాలకు సాగునీరు, కర్నూలు నగరం, కృష్ణగిరి, డోన్‌ పట్టణాలతో పాటు 125 గ్రామాలకు తాగునీరు దామోదరం సంజీవయ్య సాగర్‌ (గాజులదిన్నె) జలాశయం అందిస్తుంది. ఆ ప్రాజెక్టు సామర్థ్యం 4.5 టీఎంసీలు. కుడి, ఎడమ కాలువ ద్వారా రబీ పంటకు 24,372 ఎకరాలకు సాగునీరు అందించాలి. బండగట్టు రక్షిత మంచినీటి పథకం ద్వారా ఒక్కటే 80 గ్రామాలకు పైగా తాగునీరు అందించాల్సి ఉంది. గత టీడీపీ ప్రభుత్వంలో ఎమ్మిగనూరు పట్టణానికి తాగునీటి సరఫరా కోసం ఈ ప్రాజెక్టు నుంచి పైపులైన్‌ పనులకు శ్రీకారం చుట్టారు. జిల్లాల పునర్విభజన తరువాత కర్నూలు జిల్లాకు మిగిలిన ఏకైక అతిపెద్ద ప్రాజెక్టు ఇది ఒక్కటే. సీఎం జగన్‌ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రాజెక్టు ప్రమాదంలో పడింది. పాలకులు, ఇంజనీర్లు తక్షణం స్పందించకపోతే భారీ నష్టం చవిచూసే ప్రమాదం లేకపోలేదని రాయలసీమ సాగునీటి నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అసంపూర్తిగా ఆధునికీకరణ పనులు

పశ్చిమ పల్లెసీమల్లో కరువును నివారించే ఏకైక ప్రాజెక్టు గాజులదిన్నె. సాగునీటి ప్రాజెక్టు కాస్త కర్నూలు నగరం సహా వివిధ పట్టణాలు, గ్రామాల దాహం తీర్చే ఎస్‌ఎస్‌ ట్యాంక్‌గా మారింది. సాగు, తాగునీటి అవసరాలను దృష్ట్యా.. ముందు చూపులో గత టీడీపీ ప్రభుత్వం హంద్రీనీవా నుంచి గాజులదిన్నె ప్రాజెక్టుకు 3 టీఎంసీలు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో 7.5 టీఎంసీలు నిల్వ చేసేందుకు వీలుగా ఆనకట్ట బలోపేతం, ఎత్తు పెంచడం, గేట్లు మరమ్మతులు, ఆనకట్ట దిగువన ఆయా గ్రామస్తులు నది దాటేందుకు హైలెవల్‌ బిడ్జి నిర్మాణం, భూ సేకరణ.. వంటి పనుల కోసం రూ.108 కోట్లతో ప్రతిపాదనలు పంపారు. ఇంతలోనే టీడీపీ ప్రభుత్వం పడిపోయి.. సీఎం జగన్‌ సారథ్యంలో వైసీపీ ప్రభుత్వం వచ్చింది. టీడీపీ ప్రభుత్వంలో ప్రతిపాదనలను సవరించి 2020-21లో రూ.57.35 కోట్లకు ఇంజనీర్లు మరో ప్రతిపాదన పంపారు. ప్రభుత్వం పరిపాలన అనుమతులు, నిధులు ఇచ్చింది. రూ.37 కోట్లతో ఆనకట్ట బలోపేతం, ఎత్తు పెంచడం.. వంటి ఆధునికీకరణ పనులకు, మరో రూ.12 కోట్లతో గేట్ల ఆధునికీకరణ పనులకు టెండర్లు పిలిస్తే.. బీఎన్‌వీ కనస్ట్రక్షన్‌, శ్రీశ్రీ విజ్ఞేశ్వర కన్‌స్ట్రక్షన్‌ పనులు దక్కించుకున్నాయి. విజయవాడకు చెందిన కాంట్రాక్టరు కోటిరెడ్డి సబ్‌ కాంట్రాక్ట్‌ తీసుకొని పనులు చేపట్టారు. 2022 ఏప్రిల్‌ 26న ఒప్పందం చేసుకున్నారు. పనులు అసంపూర్తిగా ఆగిపోయాయి. ప్రభుత్వం నుంచి రూ.10 కోట్లు బకాయి ఉండడం. ఎన్నికల వేళ పనులు చేస్తే.. ఆ తరువాత వచ్చే ప్రభుత్వం బిల్లులు ఇస్తుందో లేదో..? అన్న భయంతో కాంట్రాక్టరు పనులు ఆపేసి వెళ్లిపోయారు.

ఇకనైనా కళ్లు తెరవండి!

వర్షాలు మొదలయ్యాయి. ప్రాజెక్టు ఎగువన దేవనకొండ, ఆస్పరి మండలాల్లో 106 మిల్లీ మీటర్లకు పైగా వర్షపాతం నమోదు అవుతోంది. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ప్రయోజనం ఉండదు. ప్రమాదం రాకుండానే కాంట్రాక్టరుపై ఒత్తిడి తెచ్చి తక్షణమే గేట్లకు రోప్‌ (ఇనుప తాడు) ఏర్పాటు, ఆ గేట్లు ఆపరేట్‌ చేసేందుకు వీలుగా ట్రయల్‌ రన్‌ పూర్తి చేయాలని పలువురు కోరుతున్నారు

మట్టికట్టకు ప్రమాదం.. దిగువ గ్రామాలకు ముంపు భయం

గాజులదిన్నె ప్రాజెక్టు (జీడీపీ)కు ఆరు గేట్లు డిశ్చార్జ్‌ కెపాసిటీ (వరద విడుదల సామర్ధ్యం) 80 వేల క్యూసెక్కులు. కీలకమైన గేట్లు దశాబ్దాలుగా మరమ్మతులకు నోచుకోలేదు. దీంతో రూ.12 కోట్లతో కొత్త గేట్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. 2023 సెప్టెంబరు నెలలోనే కొత్త గేట్లు తయారీ (ఫ్యాబ్రికేషన్‌) పూర్తయ్యాయి. డ్యాంలో నీరు దిగువకు పోకుండా స్టాప్‌లాక్స్‌ ఏర్పాటు చేసి కొత్త గేట్లను వాటి స్థానాల్లో అమర్చే (ఎరక్షన్‌) పనులు చేపట్టి ఆరు గేట్లు వాటి స్థానంలో అమర్చారు. అయితే.. ఆ గేట్లు కిందకు, పైకి ఎత్తేందుకు (లిఫ్ట్‌) వీలుగా రోప్‌ కనెక్షన్‌ వంటి కీలకమైన పనులు అర్థాంతరంగా ఆపేశారు. ఆరేడు నెలలు దాటినా గేట్ల పనులు మొదలు పెట్టలేదు. ట్రయల్‌ చేయలేదు. ప్రస్తుతం ఒక్క గేటు కూడా ఆపరేట్‌ చేసే పరిస్థితుల్లో లేదు. ఇది అత్యంత ప్రమాదకరమని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలం మొదలైంది. వరదొచ్చి జలాశయం పూర్తిగా నిండితే ఆనకట్టకు ప్రమాదం తప్పదని రైతులు భయందోళన వ్యక్తం చేస్తున్నారు.

అన్నమయ్య ప్రమాదం కళ్ల ముందే ఉన్నా..!

అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం ఆకేపాడు వద్ద చెయ్యేరు (బాహుదా) నదిపై 2.23 టీఎంసీల సామర్ధ్యంతో అన్నమయ్య ప్రాజెక్టు నిర్మించారు. ఐదు గేట్లకు గాను.. ఒక గేటు రోప్‌ తెగిపోయి పూర్తిగా మూసుకుపోయింది. 2012 నవంబరులో భారీ వరదలు రావడంతో మట్టి ఆనకట్ట పూర్తిగా కొట్టుకుపోయింది. డ్యాం దిగువన పులపుత్తూరు సహా పదికిపైగా గ్రామాలు ముంపుకు గురై ఆనవాళ్లు కోల్పోయాయి. ఈ ప్రమాదంలో రూ.వందల కోట్లు ఆస్తులు నష్టపోవడమే కాకుండా 40 మంది దాకా ప్రాణాలు కోల్పోయారు. ఇంతటి విషాద ఘటన పక్క జిల్లాలోనే కళ్లముందు కనిపిస్తున్నా గాజులదిన్నె ప్రాజెక్టుకు నెలల కాలం గడిచినా ఆరు గేట్లు పూర్తిగా పని చేసేలా ఆధునికీరించకపోవడం విమర్శలకు తావిస్తున్నది. 1996లో లక్ష క్యూసెక్కులకు పైగా భారీ వరద రావడంతో గేట్లు పట్టక ఫ్లడ్‌ బ్యాంక్‌ వద్ద గండి కొట్టాల్సి వచ్చింది. వర్షాలు మొదలయ్యాయి. భారీ వరద వచ్చి జలాశయం నిండితే.. ఆ తరువాత వచ్చే వరదను ఎలా మళ్లించాలి..? మట్టి ఆనకట్ట తెగిపోతే దిగువన హంద్రీ నది తీరంలో ఉన్న గాజులదిన్నె, హెచ్‌. కైరవాడి, పుట్టపాశం, వేముగోడు, తిప్పనూరు సహా కోడుమూరు పట్టణాలు ముంపుకు గురై తీవ్ర నష్టాన్ని చవిచూసే ప్రమాదం లేకపోలేదు.

కాంట్రాక్టరుకు లేఖ రాశాం

గాజులదిన్నె ప్రాజెక్టుకు ఆరు గేట్లు ఉన్నాయి. రూ.12 కోట్లతో కొత్త గేట్లు ఏర్పాటు పనులు చేపట్టాం. ఫ్యాబ్రికేషన్‌, ఎరక్షన్‌ పనులు పూర్తయ్యాయి. గేట్లకు రోప్‌ ఏర్పాటు చేయాల్సి ఉంది. ఆ పనులు చేయకపోతే గేట్లు ఆపరేట్‌ చేయలేం. వర్షాలను దృష్టిలో ఉంచుకొని తక్షణమే పనులు చేయాలని కాంట్రాక్టరకు లేఖ రాశాం. గేట్లను త్వరలో మరమ్మతులు పూర్తి చేస్తాం.

- విజయకుమార్‌, డీఈఈ, గాజులదిన్నె ప్రాజెక్టు

Updated Date - May 24 , 2024 | 11:42 PM