Share News

దేవర ధర రూ.1.28 లక్షలు

ABN , Publish Date - Dec 17 , 2024 | 11:38 PM

కోసిగి సంతలో ఓ పొట్టేలు భారీ ధరకు అమ్ముడపోయింది.

దేవర ధర రూ.1.28 లక్షలు

కోసిగి సంతలో ఓ పొట్టేలు భారీ ధరకు అమ్ముడపోయింది. వందల సంఖ్యలో వచ్చిన పొట్టేళ్లలో ఆ ఒక్కటే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆ పొట్టేలు ధర ఎంతో తెలియాలంటే ముందుగా దేవర కథ తెలియాలి.

కోసిగి, డిసెంబరు 17 (ఆంధ్రజ్యోతి): కోసిగి మండలంలోని వందగల్లు గ్రామానికి చెందిన వెంకటేశ్‌ ఓ పొట్టేలుకు దేవర అనే పేరు పెట్టి పెంచాడు. మంగళవారం కోసిగిలో జరిగిన సంతలో దేవరను విక్రయించేందుకు తీసుకువచ్చాడు. దేవరను పెద్దకడుబూరు మండలం బాపులదొడ్డి గ్రామానికి చెందిన ఓ రైతు రూ.1.28 లక్షలకు తమ ఊరిలో జరిగే జాతర కోసం కొనుగోలు చేశాడు. ఇప్పటి వరకు కోసిగి మార్కెట్‌లో అత్యధిక ధరకు అమ్ముడైన పొట్టేలు ఇదే కావడం రికార్డ్‌. కోసిగితో పాటు ఆదోని, ఎమ్మిగనూరు, కౌతాళం, మంత్రాలయం, పెద్దకడుబూరు, పత్తికొండ, ఆలూరు, తదితర ప్రాంతాల నుంచి గొర్రెల వ్యాపారులు, రైతులు పెద్ద ఎత్తున కోసిగి సంతకు గొర్రెలను తెచ్చారు. పొట్టేళ్లను కొనుగోలు చేయడానికి వ్యాపారులు, రైతులు పోటీ పడ్డారు. రూ.20 వేలు మొదలుకొని రూ.లక్షకు పైగా ధర పలికాయి. మంగళవారం ఒక్కరోజే ఈ సంతలో రూ.కోటికి పైగా వ్యాపారాలు జరగడం విశేషం.

నాలుగు బైకులు గెలిచిన పొట్టేలు

నేను కర్ణాటక రాష్ట్రం బాగల్‌కోట నుంచి రూ.లక్షకు పైగా పెట్టి పొట్టేలును కొనుగోలు చేశాను. ఇప్పటి వరకు పందెం పోటీల్లో నాలుగు బైకులు గెలుచుకుంది. మంగళవారం కోసిగి సంతలో పొట్టేలు రూ.1.28 లక్షలకు కొనుగోలు చేశారు. ఇదే అత్యధికంగా పలికిన ధర. దేవర నా నుంచి దూరం అవుతున్నందుకు కాస్త బాధగానే ఉంది.

- వందగల్లు వెంకటేశ్‌

Updated Date - Dec 17 , 2024 | 11:38 PM