Share News

నేడే ఎన్నికల సమరం

ABN , Publish Date - May 13 , 2024 | 12:12 AM

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన సార్వత్రిక ఎన్నికల సమరం రానేవచ్చింది.

నేడే ఎన్నికల సమరం
నందికొట్కూరులోని పంపిణీ కేంద్రం వద్ద సిబ్బంది

ఆత్మకూరు మే 12: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన సార్వత్రిక ఎన్నికల సమరం రానేవచ్చింది. సోమవారం ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు జరిగే ఈ ఎన్నికలకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆదివారం కరివేన సమీపంలో ఉన్న డీపౌల్‌ హైస్కూల్‌ కేంద్రంగా శ్రీశైలం నియోజకవర్గంలోని ఆత్మకూరు, వెలుగోడు, బండిఆత్మకూరు, మహానంది, శ్రీశైలం మండలాల్లో ఉన్న పోలింగ్‌ కేంద్రాలకు రూట్‌మ్యాప్‌ ప్రకారం ఈవీఎంలను పంపిణీ చేయడంతో పాటు పోలింగ్‌, భద్రతా సిబ్బంది నియమించారు. నియోజకవర్గంలోని మొత్తం 226 పోలింగ్‌ కేంద్రాలకు సంబంధించి 226 మంది పీవోలు, 226 ఏపీవోలు, 794 ఓపీవోలులతో పాటు 212 రిజర్వు సిబ్బందిని అందుబాటులో ఉంచారు. అలాగే 23 మంది సెక్టోరల్‌ అధికారులు, 35 మంది మైక్రో అబ్జర్వర్లు, 169 మంది వెబ్‌కాస్టింగ్‌ సిబ్బందితో పాటు బెల్‌ ఇంజనీర్లు ఎన్నికల సరళిని పర్యవేక్షించేలా ప్రణాళిక రూపొందించారు. పోలింగ్‌ కేంద్రాలకు ఈవీఎంలు, వీవీప్యాడ్స్‌తో పాటు ఎన్నికల సామగ్రి పంపిణీ, పోలింగ్‌ సిబ్బంది, భద్రత బలగాల కేటాయింపు ప్రక్రియను శ్రీశైలం నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి సుధారాణి పర్యవేక్షించారు. 226 పోలింగ్‌ కేంద్రాల్లో పార్లమెంట్‌, అసెంబ్లీ ఎన్నికలకు నిర్వహించబోవు ఈవీఎంలతో పాటు అదనంగా 20శాతం ఈవీఎంలను ఆయా గ్రామాల సెక్టోరల్‌ అఽధికారుల వద్ద అందుబాటులో ఉంచినట్లు పీవో వివరించారు. ఎన్నికల పరిశీలకుడు పంకజ్‌ కుమార్‌ డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రాన్ని పరిశీలించారు.

భారీగా భద్రతా బలగాలను మోహరింపజేసినట్లు నోడల్‌ ఆఫీసర్‌, సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ నాగభూషణ్‌ తెలిపారు. గుజరాత్‌ నుంచి సెంట్రల్‌ ఫోర్స్‌ కంపెనీ, కర్ణాటక నుంచి బీఎస్‌ఎఫ్‌ జవాన్లు 50 మంది, స్ర్టైకింగ్‌ ఫోర్స్‌ టీమ్స్‌, షాడో పార్టీ, ఏఆర్‌ కానిస్టేబుల్స్‌లతో పాటు ఆయా పోలీసు స్టేషన్ల ఎస్‌ఐలు, ఏఎస్‌ఐలు, హెడ్‌కానిస్టేబుళ్లు ఇతర పోలీసు సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొంటారని చెప్పారు. నియోజకవర్గంలో 33 సమస్యాత్మక గ్రామాలను గుర్తించినట్లు తెలిపారు. ఆయా సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల వద్ద నలుగరు ఆర్ముడ్‌ ఫోర్స్‌ను అందుబాటులో ఉంచామని తెలిపారు. సీఐడీ విభాగం డీఎస్పీ అబ్దుల్‌ కరీం నియోజక వర్గంలో జరిగిన ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించనున్నట్లు వెల్లడించారు.

ఓటర్లను ఆకర్షించేందుకు ఈసారి ఎన్నికల కమిషన్‌ విన్నూతమైన విధానానికి శ్రీకారం చుట్టింది. నియోకవర్గంలోని ప్రతి మండలంలో ఒక మోడల్‌ పోలింగ్‌ స్టేషన్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగానే ఆత్మకూరు పట్టణంలోని ఇస్లాంపేటలో గల 80వ బూత్‌ను ప్రత్యేకంగా అలకరించి ఎన్నికలకు సిద్ధం చేశారు.

శ్రీశైలం నియోజకవర్గంలో 1,96,116 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో 95,771 మంది పురుష ఓటర్లు ఉండగా 1,00,301 మంది మహిళా ఓటర్లు, 44 ఇతర ఓటర్లు ఉన్నట్లు ఓటరు జాబితాను సిద్ధం చేశారు. ఇందులో శ్రీశైలం మండలంలో 22,865 మంది ఓటర్లు, ఆత్మకూరు మండలంలో 63173, వెలుగోడులో 42344, బండిఆత్మకూరులో 37,974, మహానందిలో 29760 మంది ఓటర్లు ఉన్నారు.

నందికొట్కూరు: 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియకు సర్వం సన్నద్ధమైంది. నియోజకవర్గంలో ఈ ఎన్నికల క్రతువును పూర్తి చేసేందుకు ఎన్నికల సిబ్బందితో పాటు పోలీసులు ఇతర సిబ్బంది కలిసి 4 వేల మంది సిబ్బంది ఈ ఎన్నికల ప్రక్రియలో పాల్గొన్నారు. పట్టణంలోని సంతగేటు ప్రభుత్వ పాఠశాలలోని 70, 71 పోలింగ్‌ కేంద్రాలను తీర్చి దిద్దారు.

నందికొట్కూరు నియోజకవర్గంలో 251 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 2,18,047 మంది ఓటర్లు ఉండగా అందులో 1,06,689 మంది పురుషులు, 1,11,340 మంది స్త్రీలు, 18 మంది ఇతరులు ఉన్నారు. 251 పోలింగ్‌ కేంద్రాల్లో 38 పోలింగ్‌ కేంద్రాలు సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలుగా అధికారులు గుర్తించారు.

నందికొట్కూరు శ్లోకా స్కూల్‌లో డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రం ఏర్పాటు చేశారు. ఉదయం 9 గంటల నుంచే ఉద్యోగులు అక్కడికి చేరుకొని ఆర్వో సూచనలు సలహాలు తీసుకున్నారు. 25 సెక్టోరల్‌ ఆఫీసర్లు 73 బస్సుల్లో 1699 మంది ఉద్యోగులు ఎన్నికల సామగ్రిని తీసుకొని వారికి కేటాయించిన పోలింగ్‌ కేంద్రాలకు బయలుదే రి వెళ్లారు.

వెలుగోడు: వెలుగోడు పట్టణంతో పాటు మండలంలోని ఆయా గ్రామాలలో సోమవారం జరుగనున్న ఎన్నికలకు అధికారులు సర్వం సన్నదమధం చేశారు. మండలంలో మొత్తం 42,344 మంది ఓటర్లు ఉండగా 47 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇప్పటికే అధకారులు నియమించిన పోలింగ్‌ సిబ్బంది ఆయా కేంద్రాలకు చేరుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా ఎస్‌ఐ భూపాలుడు ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీస్‌ బలగాలతో పాటు స్థానిక పోలీసులతో బందోబస్తును ఏర్పాటు చేశారు. వెలుగోడు పట్టణంలోని ఉర్దూ పాఠశాలలో ప్రత్యేకంగా మోడల్‌ పోలింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.

మహానంది: ఎం.తిమ్మాపురం గ్రామంలో పోలింగ్‌ కేంద్రాన్ని రెవెన్యూ సిబ్బంది మామిడి తోరణాలతో సుందరంగా తీర్చిదిద్దారు. మండలంలో మెత్తం 37 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 29,760 మంది ఓటర్లు ఉన్నారు. తిమ్మాపురం గ్రామంలోని ప్రభుత్వ మోడల్‌ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రాన్ని పండగ వాతావరణం తలపించేలా అరటి చెట్లతో పాటు మామిడి ఆకులు, కొబ్బరి మట్టలతో సుందరంగా ముస్తాబు చేశారు.

కొత్తపల్లి: ఎవరి ప్రలోభాలకు గురి కాకుండా ఓటర్లు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని కొత్తపల్లి తహసీల్దార్‌ తిరుప తయ్య సూచించారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ సోమవారం జరిగే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్పారు. కొత్తపల్లి మండలంలో 25,374 మంది ఓటర్లు ఉన్నట్లు తెలిపారు. అందులో పురుషులు 12,604 మంది, మహిళలు 12,708 మంది ఉండగా.. ఇతరులు ఇద్దరు ఉన్నారని తెలిపారు. మండలంలో 35 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయగా.. అందులో ఒక్కొక్క పోలింగ్‌ కేంద్రానికి ఒక పీవోతో పాటు, ఇద్దరు ఓపీవోలతో పాటు మరో ఇద్దరు సిబ్బంది ఉంటారని చెప్పారు. మండలంలో 5 రూట్‌ మ్యాప్‌లు ఏర్పాటు చేశామన్నారు. ఉదయం 7 గంటలకు పోలింగ్‌ ప్రారంభమై సాయంత్రం 6 గంటలకు ముగుస్తుందని తెలిపారు.

పాములపాడు: సార్వత్రిక ఎన్నికలకు ఏర్పాట్లు చేసినట్లు తహసీల్దార్‌ వెంకటరమణ తెలిపారు. ఆయన మాట్లాడుతూ సోమవారం జరుగనున్న ఎన్నికల్లో మండలంలో 14 పంచాయతీలకు గాను 40 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. అందులో 200 మంది సిబ్బంది ఎన్నికల్లో విధుల్లో పాల్గొంటున్నట్లు తెలిపారు. మండలంలో మెత్తం 33,913 మంది ఓటర్లు ఉన్నారని అందులో పురుషులు 16,733 మంది ఉండగా, మహిళలు17,178 మంది ట్రాన్స్‌జెండర్లు ఇద్దరు ఉన్నారని తెలి పారు. బానకచెర్ల, వేంపెంట, వాణాల, మిట్టకందాల, రుద్ర వరం పంచాయతీల్లోని పోలింగ్‌ స్టేషన్లను ఎంపీడీవో సరస్వతి పరిశీలించారు.

గడివేముల: సార్వత్రిక ఎన్నికల ప్రక్రియకు అధికారులు ఆదివారం పూర్తి ఏర్పాట్లు చేశారు. మండలంలోని 42 పోలింగ్‌ బూత్‌లకు ఈవీఎంలను చేర్చారు. మండల కేంద్రంలోని 308వ పోలింగ్‌ కేంద్రాన్ని అధికారులు మోడల్‌ కేంద్రంగా తీర్చిదిద్ది ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మండలంలో 34,635 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఎన్నికల సందర్భంగా అవాంఛనీయ ఘటనలు జరుగకుండా ఎస్‌ఐ బీటీ వెంకటసుబ్బయ్య ప్రత్యేక చర్యలు తీసుకున్నారు.

Updated Date - May 13 , 2024 | 12:13 AM