Share News

వ్యాపారుల మాయాజాలం

ABN , Publish Date - Mar 04 , 2024 | 11:58 PM

ఆదోని వ్యవసాయ మార్కెట్‌ యార్డులో వేరుశనగ వ్యాపారులు రైతులను దగా చేస్తున్నారు.

వ్యాపారుల మాయాజాలం

పాసింగ్‌తో వేరుశనగ రైతు దగా

టెండర్‌ పూర్తయినా ఆలస్యంగా తూకాలు

క్వింటానికి రూ.500 పైగా నష్టపోతున్న రైతులు

అధికారులు హెచ్చరించినా వ్యాపారుల బేఖాతరు

ఆదోని వ్యవసాయ మార్కెట్‌ యార్డులో వేరుశనగ వ్యాపారులు రైతులను దగా చేస్తున్నారు. మార్కెటింగ్‌ శాఖ నిబంధనలు ఉల్లంఘించి పాసింగ్‌ (గ్రేడింగ్‌) విధానాన్ని కొనసాగిస్తుండడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ-నామ్‌ టెండర్‌ విధానం ఉన్నప్పటికీ వేరుశనగ వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. రైతులు పండించిన వేరుశనగను గ్రేడింగ్‌ చేసుకొని విక్రయానికి తీసుకొస్తారు. అయినా వ్యాపారులు మాత్రం పాసింగ్‌ పేరుతో గంటల కొద్దీ ఆరు బయట ఎండకు శేరుశనగ రాశిని ఆరవేసి కూలీలతో శుభ్రం చేయిస్తున్నారు. ఆ తరువాత నాణ్యత లేదంటూ తక్కువ ధరకు కొంటున్నారు. ఇష్టానుసారంగా తూకాలు వేస్తున్నారు. పైగా గన్ని బ్యాగులను ఆలస్యంగా ఇస్తున్నారు. దీంతో రైతులు బేజారుకు గురవుతున్నారు.

ఆదోని (అగ్రికల్చర్‌), మార్చి 4: ఆదోని వ్యవసాయ మార్కెట్‌ యార్డ్‌కు జిల్లా నలుమూలల రైతులే కాక, అనంతపురం, తెలంగాణ, కర్ణాటక, రైతులు సైతం తమ వేరుశనగను విక్రయానికి తెస్తుంటారు. వేరుశనగ కొనుగోళ్లకు ఇక్కడ ప్రసిద్ధి కావడంతో రైతులు సీజన్‌లో 30 వేల బస్తాలకు వేరుశనగను విక్రయానికి తెస్తారు. రైతు అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని వ్యాపారులు తాము ఆడిందే ఆట, పాడిందే పాటగా వ్యవహరిస్తున్నారు. ఉదయం 8 గంటలకే గ్రామాల నుంచి రైతులు మార్కెట్‌ యార్డుకు వేరుశనగ దిగుబడును తీసుకొచ్చి కమీషన్‌ ఏజెంట్‌ దుకాణం ముందు ఉన్న ప్లాట్‌ఫారమ్‌పై వేరుశనగను రాశిగా పోసి టెండర్‌కు ఉంచుతారు.

కమీషన్‌ ఏజెంట్‌ దుకాణదారులు వాటికి ఈ-నామ్‌ లాట్‌ నెంబర్‌ కేటాయించి టెండర్లకు ఉంచుతారు. వ్యాపారి వచ్చి టెండర్‌ దాఖలు చేస్తారు. ఎవరు ఎక్కువ ధర కోట్‌ చేస్తారో, ఆ వ్యాపారికి సరుకు ప్రకటన చేస్తారు. ప్రస్తుతం సీజన్‌ తక్కువగా ఉండడంతో సరుకు 2 నుంచి 3 వేలు క్వింటాలకు మించి రావడం లేదు. వ్యాపారులు వేసిన టెండర్‌ డిక్లరేషన్‌ మధ్యాహ్నం 12-1 గంటలోపు ప్రకటిస్తారు. ఆ వెంటనే తూకాలు వేసుకొని రైతుకు రొక్కం చెల్లించాలి. అలా కాకుండా వ్యాపారులు నిబంధనకు విరుద్ధంగా రైతులు తెచ్చిన వేరుశనగ ఎండకు బాగా ఆరవేయడమే కాకుండా పాసింగ్‌ చేసి అంటూ అందులో వాటన్నింటిని వేరు చేసి తూర్పార పట్టుకుని తూకాలు మధ్యాహ్నం 4-5 గంటల తర్వాత వేసుకుంటారు. రైతులు ఇంటి వద్దనే బాగా ఆరబెట్టుకొని వేరుశనగన శుభ్రంగా చేసుకొని విక్రయానికి తీసుకొస్తారు. ఇంత చేసినా వ్యాపారులు ధర తగ్గించుకోవడానికి పాసింగ్‌ పేరుతో కాలయాపన చేస్తూ రైతుల సహనాన్ని పరీక్షిస్తున్నారు. రైతులు ఇంటికి వెళ్లే లోపు రాత్రి 10:00 గంటలు అవుతోంది. అధికారులు సైతం పట్టించుకోకపోవడంతోనే వారి ఆటలు సాగుతున్నాయని రైతులు, రైతు సంఘ నాయకులు ఆరోపిస్తున్నారు.

గ్రేడింగ్‌తో క్వింటాకు రూ.500 పైగా నష్టం..

రైతులు తమ వేరుశనగ దిగుబడిని నాణ్యతతో ఇంటి వద్దనే గ్రేడింగ్‌ చేసుకొని మార్కెట్‌ కమిటీకి విక్రయానికి తీసుకొస్తాడు. దానివల్ల మంచి ధర పొందచ్చని ఆశతో ఇక్కడ తెస్త్తారు. గ్రేడింగ్‌ పేరుతో వేరుశనగను కూలీ చేత వేరు చేయించడం వల్ల క్వింటానికి రూ.500 వరకు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది. ఒక్కో రైతు ఇదు కింటాల నుంచి 50 క్వింటాళ్ల వేరుశనగను విక్రయానికి తీసుకొస్తారు. ఈ లెక్కన రైతు రూ.2 వేల నుంచి రూ.15 వేల వరకు నష్టం వస్తుంది. ఎక్కువసేపు ఎండలో ఆరబెట్టడం వల్ల కూడా తూకం తక్కువ అవ్వడంతో మరింత నష్టపోవాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టెండర్‌ ఫామ్‌ డిక్లరేషన్‌ అయిన వెంటనే ఆ లాట్‌ను దక్కించుకున్న వ్యాపారి వెంటనే తూకాలు వేసుకొని కొనగోలు చేయాల్సి ఉంటుంది. ఉద్దేశపూర్వకంగా వ్యాపారులు ఆలస్యంగా తమ గన్ని బ్యాగులను ఇవ్వడం.. తుకాలు వేసుకోవడం చేస్తున్నారు.

జిల్లాలో ఎక్కడా లేని విధానం..

జిల్లాలో ప్రధానంగా కర్నూలు, ఎమ్మిగనూరు, ఆదోని, మార్కెట్‌ కమిటీలో నిత్యం వేరుశనగ కొనుగోలు జరుగుతున్నాయి. అన్ని మార్కెట్‌ కమిటీలకు ఒకే మార్కెటింగ్‌ శాఖ చట్టం ఉంది. చట్టాన్ని ఉల్లంఘించి ఆదోని మార్కెట్‌ కమిటీలోనే వ్యాపారులు రైతులు రాశులుగా పోసి టెండర్‌కు ఉంచిన వేరుశనగ గ్రేడింగ్‌ (పాసింగ్‌) చేస్తున్నారు. అనాదిగా ఇది కొనసాగిస్తుమంటూ వ్యాపారులు బుకాయిస్తున్నారు. ఇక్కడ లైసెన్స్‌ కలిగి కొనుగోలు చేస్త్తున్న వేరుశెనగ వ్యాపారులే ఎమ్మిగనూరు, కర్నూలు మార్కెట్‌ కమిటీలకు వెళ్లి గ్రేడింగ్‌ లేకుండానే నేరుగా టెండర్‌ వేసి వెంటనే తూకాలు వేసుకొని ఆదోనిలోని పరిశ్రమలకు దిగుమతి చేసుకుంటున్నారు. ఎక్కడా లేని గ్రేడింగ్‌ విధానం ఇక్కడ ఎందుకని రైతులు ప్రశ్నిస్త్తున్నారు. చాలామంది రైతులు ఈ గ్రేడింగ్‌ విధానం వల్ల నష్టపోవాల్సి వస్తుందని కర్నూలు, ఎమ్మిగనూరు మార్కెట్‌ కమిటీలకు తమ దిగుబడిని తీసుకెళ్లి విక్రయించుకుంటున్నారు.

వ్యాపారంలో తీరు మారదు..

గత రెండు నెలల కిందట మార్కెట్‌ యార్డ్‌ కార్యదర్శి రామ్మోహన్‌ రెడ్డి దృష్టికి కొందరు రైతులు, రైతు సంఘ నాయకులు గ్రేడింగ్‌ వల్ల తీవ్రంగా నష్టపోతున్నామని ఆయన దృష్టికి తీసుకువచ్చారు. వ్యాపారులతో సమావేశం ఏర్పాటు చేసి నిబంధనలకు విరుద్ధంగా గ్రేడింగ్‌ చేస్తే లైసెన్స్‌ రద్దు చేస్తామని, ఈ విధానానికి స్వస్తి పలకాలని హెచ్చరించారు. అప్పటి వరకు వ్యాపారులు తల ఊపారు. నిదానంగా తాము గ్రేడింగ్‌ చేయకుండా కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చినా, వ్యాపారులు మాత్రం వారి తీరును మార్చుకోవడం లేదు.

ఈ విధానం చట్ట విరుద్ధమని వ్యాపారులకు చెప్పాం

వ్యాపారులు పాసింగ్‌ (గ్రేడింగ్‌) కూలీలతో చేయించడం చట్ట విరుద్ధమని వారికి తెలియజేశాం. స్వస్తి పలకాలని, లేకపోతే చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించాం. గత నెల కిందట సమావేశం పెట్టి తెలియజేశాం. ముందు నుంచి ఈ విధానం అమలులో ఉందని మొండి వాదన చేశారు. కచ్చితంగా ఈ విధానాన్ని రూపుమాపి రైతులకు న్యాయం చేస్తాం.

-రామ్మోహన్‌ రెడ్డి మార్కెట్‌ యార్డ్‌ కార్యదర్శి ఆదోని

Updated Date - Mar 04 , 2024 | 11:59 PM