Share News

జడ్పీ ఆదాయానికి గండి..

ABN , Publish Date - May 29 , 2024 | 11:54 PM

జిల్లా పరిషత్‌ ఆవరణలో ప్రైవేటు, ప్రభుత్వ కార్యాలయాలకు అనువైన స్థలాలను, భవనాలను అద్దెకు ఇచ్చారు.

జడ్పీ ఆదాయానికి గండి..

ఒక్కపైసా అద్దె చెల్లించని మెగా సీడ్స్‌ కార్పొరేషన్‌

ఉచితంగా తహసీల్దారు, కార్మిక శాఖ మంత్రి కార్యాలయం

కర్నూలు(న్యూసిటీ), మే 29: జిల్లా పరిషత్‌ ఆవరణలో ప్రైవేటు, ప్రభుత్వ కార్యాలయాలకు అనువైన స్థలాలను, భవనాలను అద్దెకు ఇచ్చారు. ప్రైవేటు సంస్థలు ప్రతి నెలా అద్దె చెల్లిస్తున్నాయి. కొన్ని ప్రభుత్వ శాఖలు అద్దె చెల్లించడం లేదు. పైగా కరెంటు బిల్లులు కూడా కట్డడం లేదు. జడ్పీ భవనాలను అద్దెకు ఇవ్వడం ద్వారా వచ్చే ఆదాయాన్ని జడ్పీ సాధారణ నిధులలో జమ చేస్తారు. పాత జడ్పీ కార్యాలయంలో కొన్ని భాగాలను గతంలో మెగా సీడ్స్‌ పార్క్‌ కార్పొరేషన్‌ కార్యాలయం అద్దెకు తీసుకుంది. అయితే ఇప్పటి వరకు ఒక్కపైసా కూడా అద్దె చెల్లించలేదు. కరెంటు బిల్లు మాత్రం కడుతున్నారు. తహసీల్దారు, కార్మిక శాఖ మంత్రి క్యాంప్‌ కార్యాలయాలు అద్దె, కరెంటు బిల్లులు చెల్లించడం లేదని జడ్పీ అధికారులు అంటున్నారు. పంచాయతీరాజ్‌ శాఖల అద్దె తీసుకోకుండా భవనాలను ఇవ్వవచ్చని నిబంధనలు చెబుతున్నాయి. ఇతర శాఖలు కార్యాలయాలు ఈ భవనాల్లో ఏర్పాటు చేసుకోడానికి తప్పకుండా అద్దె చెల్లించాలి. 2020లో జిల్లా పరిషత్‌కు ప్రత్యేక అధికారి కలెక్టర్‌ కావడంతో తహసీల్దారు కార్యాలయాన్ని అనధికారికంగా అద్దెకు ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం.

మెగా సీడ్స్‌ పార్క్‌ కార్పొరేషన్‌ కార్యాలయానికి 2018 అక్టోబర్‌ 4న ప్రతి నెల రూ.20 వేలు అద్దె చెల్లించాలని, 25 నెలల కాల పరిమితి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఇప్పటి వరకు కార్పొరేషన్‌ నుంచి ఒక్కపైసా కూడా అద్దె చెల్లించలేదు. సుమారు రూ.5 లక్షల వరకు అద్దె వసూలు కావాలని అధికారులు చెబుతున్నారు.

కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం క్యాంపు కార్యాలయానికి 2019లో ఆద్దె భవనం ఇచ్చారు. అయితే ఇప్పటి వరకు అద్దె, కరెంటు బిల్లు కూడా జడ్పీ సాధారణ నిధుల నుంచే చెల్లిస్తున్నారు. క్యాంప్‌ కార్యాలయం ఏర్పాటు చేసినప్పటి నుండి ఇప్పటి వరకు మంత్రి గుమ్మనూరు జయరాం ఒక్కసారి కూడా అక్కడికి రాలేదని అధికారులే చెబుతున్నారు. అలాంటప్పుడు మరో శాఖకు అద్దెకు ఇస్తే జడ్పీకి ఆదాయం వస్తుందని కొందరు అంటున్నారు.

2021 సంవత్సరంలో అర్బన్‌ తహసీల్దారు కార్యాలయాన్ని అనధికారింగా అద్దెకు ఇచ్చారు. ఈ శాఖ నుంచి ఇప్పటి వరకు అద్దె రావడం లేదు. దీంతో పాటు కరెంటు బిల్లు కూడా చెల్లించడం లేదు. ప్రతి నెల సుమారు రూ.1300 నుంచి రూ.1400 దాకా జడ్పీ సాధారణ నిధుల నుంచి చెల్లింపులు జరుగుతున్నాయి. గత సంవత్సరం కరెంటు బిల్లు చెల్లించాలని జడ్పీ అధికారులు తహసీల్దారు కార్యాలయానికి నోటీసులు జారీ చేశారు.

వీటితో పాటు ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు, జడ్పీ ఆవరణ ముందు భాగంలో సైన్‌ బోర్డ్సు, కొత్త జడ్పీ భవనం పక్కనే బీఎస్‌ఎన్‌ఎల్‌ టవర్‌ ఏర్పాటు చేశారు. అయితే వీరంతా ప్రతి నెల అద్దెను చెల్లిస్తున్నారు.

Updated Date - May 29 , 2024 | 11:54 PM