Share News

సార్వత్రిక ఎన్నికల ఫైట్‌ షురూ..!

ABN , Publish Date - Apr 18 , 2024 | 11:37 PM

సార్వత్రిక ఎన్నికలకు గురువారం నుంచి నామినేషన్ల ప్రక్రియ షురూ అయింది.

సార్వత్రిక ఎన్నికల ఫైట్‌ షురూ..!

తొలిరోజు తొమ్మిది నామినేషన్లు

నంద్యాల, ఏప్రిల్‌ 18 (ఆంధ్రజ్యోతి): సార్వత్రిక ఎన్నికలకు గురువారం నుంచి నామినేషన్ల ప్రక్రియ షురూ అయింది. జిల్లాలో మొదటి రోజు ఒక్క శ్రీశైలం నియోజకవర్గం నుంచి మినహా మిగతా చోట్ల నుంచి ప్రధాన పార్టీల నాయకులెవరూ నామినేషన్లు దాఖలు చేయలేదు. జిల్లాలోని ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లో స్వతంత్ర అభ్యర్థులు, ఎస్‌డీపీఐ (సోషల్‌ డెమోక్రటిక్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా), బీఎస్‌పీ (బహుజన సమాజ్‌ పార్టీ) నుంచి ఏడుగురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా, నంద్యాల పార్లమెంటు నియోజకవర్గానికి ఇద్దరు అభ్యర్థులు నామినేషన్లు వేశారు. వెరసి మొదటి రోజు జిల్లా వ్యాప్తంగా తొమ్మిది నామినేషన్లు దాఖలయ్యాయి. శ్రీశైలం అసెంబ్లీ నియోజకవర్గానికి టీడీపీ నుంచి బుడ్డా రాజశేఖరరెడ్డి, ఆయన సతీమణి బుడ్డా శైలజ విడివిడిగా నామినేషన్లు దాఖలు చేశారు. ఇక అధికార పార్టీ నుంచి శిల్పా చక్రపాణిరెడ్డి నామినేషన్‌ దాఖలు చేయగా, జాతీయ చేతి వృత్తుల ఐక్య వేదిక పార్టీ నుంచి పి. నాగేశ్వరరావు నామినేషన్‌ వేశారు. నంద్యాల అసెంబ్లీ నియోజవర్గం నుంచి ఎన్నికల్లో పోటీ చేసేందుకు స్వతంత్ర అభ్యర్థులైన విష్ణువర్ధన్‌రెడ్డి, బి శ్రవణ్‌ కుమార్‌ నామినేషన్లు వేయగా, ఎస్‌డీపీఐ నుంచి షేక్‌ మహమ్మద్‌ ఫాజిల్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. నంద్యాల పార్లమెంటుకు సంబంధించి ఎస్‌డీపీఐకి చెందిన మహమ్మద్‌ అతుల్లా ఖాన్‌, బీఎస్‌పీ నుంచి చిన్న మౌలాలి నామినేషన్లు దాఖలు చేశారు. ఆళ్లగడ్డ, నందికొట్కూరు, బనగానపల్లె, డోన్‌ నియోజకవర్గం నుంచి తొలిరోజు ఒక్క నామినేషన్‌ కూడా దాఖలు కాలేదు.

Updated Date - Apr 18 , 2024 | 11:38 PM