Share News

పండగ వచ్చే.. సందడి తెచ్చే..!

ABN , Publish Date - Apr 06 , 2024 | 11:55 PM

శ్రీశైల మహాక్షేత్రంలో శనివారం ఉగాది మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.

పండగ వచ్చే.. సందడి తెచ్చే..!

శ్రీగిరిపై ఉగాది మహోత్సవాలు ప్రారంభం

భృంగి వాహనంపై విహరించిన స్వామి, అమ్మవార్లు

మహాలక్ష్మిగా దర్శనమిచ్చిన భ్రమరాంబికాదేవి

నేడు స్వామిఅమ్మవార్లకు కైలాస వాహన సేవ,

మహాదుర్గగా దర్శనమివ్వనున్న అమ్మవారు

భక్తులతో కిటకిటలాడి శ్రీశైల క్షేత్రం

శ్రీశైలం, ఏప్రిల్‌ 6: శ్రీశైల మహాక్షేత్రంలో శనివారం ఉగాది మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఐదు రోజులపాటు జరిగే ఈ ఉగాది మహోత్సవాలు 10న ముగియనున్నాయి. ఉదయం ఆలయ ప్రాంగణంలోని స్వామివారి యాగశాల ప్రవేశంతో ఉత్సవాలు మొదలయ్యాయి. ఆలయ కార్యనిర్వహణాధికారి, స్థానాచార్యులు, అర్చకులు, వేదపండితులు, అధికారులు సంప్రదాయబద్ధంగా యాగశాల ప్రవేశం చేశారు. తరువాత వేదపండితులు చతుర్వేద పారాయణాలతో వేదస్వస్తి నిర్వహించారు. ఆ తరువాత దేశం శాంతి సౌభాగ్యాలతో విలసిల్లాలని ఆలయ అర్చకులు, వేదపండితులు లోక క్షేమాన్ని కాంక్షిస్తూ సంకల్పాన్ని పఠించారు. దీనికే శివ సంకల్పం అని పేరు. ఉత్సవాలు నిర్విఘ్నంగా జరగాలని మహా గణపతికి పూజలు నిర్వహించారు. సాయంకాలం అంకురార్పణ కార్యక్రమం జరిపించారు.

భృంగి వాహనంపై స్వామి, అమ్మవార్ల విహారం

ఉగాది మహోత్సవాల్లో భాగంగా మొదటి రోజు శనివారం స్వామిఅమ్మవార్లకు భృంగి వాహన సేవ నిర్వహించారు. అర్ధనారీశ్వర రూపానికి మూలకారకుడైన భృంగి భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివార్ల సేవలో తరించారు. భృంగి వాహనంపై స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఆశీనులనుజేసి సుగంధ పుష్పాలతో అలంకరించారు. అనంతరం క్షేత్ర పురవీధుల్లో గ్రామోత్సవం నిర్వహించారు. అశేష భక్తజనం ఈ అద్భుత ఘట్టాన్ని కనులారా వీక్షించి పరవశించారు. గ్రామోత్సవం ముంగిట శంఖం, జే గంట, ఢమరుకం, కొమ్ము వాయిద్యం, కోలాటం, చెక్కభజన, వేషధారణలు, తప్పెట్లు, శంఖానాదాలు, కర్ణాటక జాంజ్‌, కర్ణాటక డోలు విన్యాసాలు, మంగళవాయిద్యాలతో కొనసాగింది. రాజగోపురం నుంచి గంగాధర మండపం మీదుగా బయలు వీరభద్రస్వామి ఆలయం వరకు గ్రామోత్సవ క్రతువు జరిగింది.

మహాలక్ష్మిగా భ్రమరాంబికాదేవి

ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు అమ్మవారు మహాలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. చతుర్భుజాలు కలిగిన ఈదేవి పైరెండు చేతులలో పద్మాలను, కింది చేతులలో కుడి వైపు అభయహస్తం, ఎడమ వైపు వరముద్రతో దర్శనం ఇచ్చారు.

నేడు కైలాసవాహన సేవ: ఉగాది మహోత్సవాల్లో భాగంగా రెండో రోజైన ఆదివారం స్వామివారికి విశేష అర్చనలు, మహాశక్తి స్వరూపిని అయిన భ్రమరాంబిక దేవికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.

సాంస్కృతిక కార్యక్రమాలు: ఉగాది మహోత్సవాల సందర్భంగా దేవస్థానం పలు సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా శనివారం సాయంత్రం కూచిపూడి నృత్యం, సంప్రదాయ నృత్యం, ఆధ్యాత్మిక ప్రవచనం, వేణుగాన కచేరి, తబలా కచేరి, భక్తి సంగీత విభావరి తదితర కార్యక్రమాలను నిర్వహించింది.

Updated Date - Apr 06 , 2024 | 11:55 PM