అలా కానిచ్చేశారు..!
ABN , Publish Date - Dec 27 , 2024 | 11:43 PM
వైసీపీ అధికారంలో ఉండగా ఏ చిన్న కార్యక్రమం చేపట్టినా వేలాది మందిని తరలించేవారు. బలవంతంగా జన సమీకరణ చేసి వారంతా మా వెంటే ఉన్నట్లు కలరింగ్ ఇచ్చారు.
మెజార్టీ నియోజకవర్గాల్లో జనస్పందన కరువు
కర్నూలు, పత్తికొండ, ఎమ్మిగనూరులో విభేదాలు
పలువురు నాయకులు ర్యాలీకి దూరం
కర్నూలు, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధికారంలో ఉండగా ఏ చిన్న కార్యక్రమం చేపట్టినా వేలాది మందిని తరలించేవారు. బలవంతంగా జన సమీకరణ చేసి వారంతా మా వెంటే ఉన్నట్లు కలరింగ్ ఇచ్చారు. ఎన్నికలకు ముందు జగన్ సీఎం హోదాలో నిర్వహించిన సిద్ధం సభలకు ఆర్టీసీ బస్సులు పెట్టి బలవంతంగా తరలించారు. అధికారం పోయాక ఆ పార్టీ నిర్వహించే కార్యక్రమాలకు ఆశించిన మేరకు జనం రాకపోవడంతో ముఖ్యనాయకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీనికితోడు ముఖ్య నాయకుల మధ్య అంతర్గత విభేదాలు వైసీపీని వెంటాడుతున్నాయి. వైసీపీ ప్రభుత్వ హయాంలో తీసుకున్న విద్యుత్ నిర్ణయాలు, చేసిన అప్పుల పాపాలే నేడు ప్రజలపై విద్యుత్ చార్జీల భారం పడుతోందని, ఆ పాపం వైసీపీ, ఆనాటి సీఎం జగన్‌నే అని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక విద్యుత్ చార్జీలు పెంచారంటూ వైసీపీ రాష్ట్ర నాయకత్వం ఇచ్చిన పిలుపు మేరకు జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో ఆ పార్టీ ఇన్‌చార్జిలు ఆధ్వర్యంలో శుక్రవారం ర్యాలీలు నిర్వహించారు. ఒకటి రెండు నియోజకవర్గాల్లో ఆశించినమేర వైసీపీ శ్రేణులు పాల్గొన్నప్పటికీ మెజార్టీ నియోజకవర్గాల్లో వందల జనంతో అలా ముగించారు. వారికి కూడా బలవంతంగా తరలించారు. ఎమ్మిగనూరులో వైసీపీ ఇన్‌చార్జి బుట్టారేణుక ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన ర్యాలీకి 150 మందికి పైగా వచ్చారని ఆ పార్టీ నాయకులు అంటున్నారు. అయితే వంద కూడా దాటలేదని తెలుస్తోంది. ఈ ర్యాలీకి మాజీ ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి, తనయుడు ఎర్రకోట జగన్మోహన్‌రెడ్డి దూరంగా ఉన్నారు. పత్తికొండలో మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి ఆధ్వర్యంలో నిర్వహించిన వైసీపీ ర్యాలీ పేలవంగా ముగిసింది. ఆ పార్టీ సీనియర్ నాయకులు మురళిధర్‌రెడ్డి, రామచంద్రారెడ్డిలు దూరంగా ఉన్నారు. అధికారం కోల్పోయాక చేపట్టిన తొలి కార్యక్రమంలోనే విభేదాలు భగ్గుమన్నాయి. కర్నూలులోనూ అదే పరిస్థితి ఉంది. వైసీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్‌రెడ్డి ర్యాలీ నిర్వహించి విద్యుత్ డీఈఈకి వి నతి పత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ దూరంగా ఉన్నారు. ఉద్ధేశపూర్వంగానే ఎస్వీ వర్గం ఆయనను దూరం పెట్టిందని, ముస్లిం నాయకులు వైసీపీకి అవసరం లేదా? హఫీజ్‌ఖాన్ వర్గం గుర్రుగా ఉంది. వైసీపీ తొలి ర్యాలీ సమయంలోనే పోయిన ఎన్నికల్లో ఉద్యోగానికి రాజీనామా చేసి వైసీపీ అఽభ్యర్థిగా పోటీ చేసిన ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ ఆ పార్టీకి రాజీనామా చేయడం, రాజకీయాలకు స్వస్తి చెబుతున్నానని ప్రకటించారు. కోడుమూరు నియోజకవర్గంలో ఆ పార్టీ ఇన్‌చార్జి ఆదిమూలపు సతీశ్ ఆధ్వర్యంలో విద్యుత్ చార్జీలకు వ్యతిరేకంగా చేపట్టిన నిరసన ర్యాలీకి కూడా మాజీ చైర్మన్ కోట్ల హర్షవర్ధన్‌రెడ్డి దూరంగా ఉన్నారు. అధికారంలో ఉండగా విచ్చలవిడిగా విద్యుత్ చార్జీలు పెంచి జనంపై మోయలేని భారం వేశారు.. రాజకీయాల కోసం ఇప్పుడు ర్యాలీలు అంటూ ప్రజలను మోసం చేస్తున్నారని సామాన్యులు చర్చించుకోవం కొసమెరుపు.