Share News

ఆ కళాశాల.. చదువుల ఊయల

ABN , Publish Date - Jan 07 , 2024 | 12:23 AM

కక్షలు, కార్పణ్యాలు రగిలిన చోట విద్యా కుసుమాలు విరబూశాయి.

ఆ కళాశాల.. చదువుల ఊయల

ఫ్యాక్షన్‌ ఘర్షణల మధ్యనే విద్యకు ప్రాధ్యానం

జూనియర్‌ కళాశాల కోసం ప్రభుత్వంపై ఒత్తిడి

దాతల సహకారంతో స్థల సేకరణ

నాటకాల ద్వారా కార్పస్‌ ఫండ్‌ చెల్లింపు

1971లో కాలేజీ ఏర్పాటు

50 వసంతాల అద్భుత ఘట్టం ఆవిష్కరణ

అన్ని బ్యాచ్‌ల విద్యార్థుతో సమ్మేళనం

గురువులందరికీ సన్మానం

నేడు స్వర్ణోత్సవ స్థూపం ఆవిష్కరణ

కక్షలు, కార్పణ్యాలు రగిలిన చోట విద్యా కుసుమాలు విరబూశాయి. నిత్యం పగలు ప్రతీకారాలతో అట్టుడికిన ఆ ప్రాంతంలో అక్షర పరిమళాలు వెదజల్లాయి. వర్గాల పేరుతో.. అర్థంపర్థం లేని పగలతో ఒకరిని ఒకరు తెగ నరుక్కున్న కాలంలోనే కొందరు విద్యకు ఉన్న ప్రాముఖ్యతను గుర్తించారు. ఇందులో భాగంగానే ఆలూరుకు కేటాయించిన కళాశాలను తమ ప్రాంతంలోనే ఏర్పాటు చేయాలని 1971లో అప్పటి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. కాలేజీకి అవసరమైన స్థలాన్ని దాతల ద్వారా సేకరించడంతోపాటు నాటకాల ద్వారా వచ్చిన డబ్బును కార్పస్‌ ఫండ్‌గా చెల్లించి అనుకున్నది సాధించారు. ఇలా పత్తికొండలో 1971లో జూనియర్‌ కళాశాల ప్రారంభమైంది. నాటి నుంచి ఈ కళాశాలలో ఎంతో మంది విద్యార్థులు చదువుకున్నారు. వారిలో చాలా మంది ఉన్నత స్థానాలకు చేరుకున్నారు. ఈ కళాశాల స్వర్ణోత్సవాన్ని 2022 డిసెంబరు 10న ఓ అపూర్వ ఘట్టంలా ఆవిష్కరించారు. 50 వసంతాల వేడుకను ప్రతి విద్యార్థి మదిలో గుర్తుండిపోయేలా చేశారు. కళాశాల ప్రారంభం నుంచి చదువుకున్న 50 బ్యాచ్‌ల పూర్వ విద్యార్థులను ఒకే వేదికపైకి తీసుకురావడంతోపాటు అప్పటి నుంచి చదువు చెప్పిన గురువులను ఘనంగా సత్కరించారు. ఇందుకు గుర్తుగా స్వర్ణోత్సవ సంబరాల స్థూపాన్ని కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. ఈ నెల 7న ఈ స్థూపాన్ని ప్రారంభించాలని ముహూర్తం నిర్ణయించారు. ఈ సందర్భంగా ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం..

పత్తికొండ, జనవరి 6:

కళాశాల ప్రస్థానం ఇలా..

ఉమ్మడి కర్నూలు జిల్లాలో అత్యంత వెనుకబడిన ప్రాంతాల్లో పత్తికొండది ప్రథమ స్థానం. 1970 ప్రాంతంలో ఇక్కడ హైస్కూల్‌(ఎస్‌ఎస్‌ఎల్‌సీ) వరకే ఉండేది. అది కూడా అద్దె భవనంలో కొనసాగేది. ఆ తర్వాత పీయూసీ చదవాలంటే కర్నూలు, అనంతపురం వంటి పట్టణాలకు వెళ్లాల్సి వచ్చేది. దీంతో చాలా మంది హైస్కూల్‌తోనే చదువు ఆపేసేవారు. ఈ క్రమంలోనే హైస్కూల్‌కు సొంతభవనం కావాలని కొందరు పెద్దలు కమిటీగా ఏర్పడి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. అధికారులు స్పందించి స్థలం చూపితే భవనాలు నిర్మిస్తామని చెప్పారు. దీంతో కొందరు దాతల సహకారంతో కమిటీ పెద్దలు పట్టణ శివారులో ఏడు ఎకరాల స్థలాన్ని సేకరించారు. ఇందులోనే ప్రభుత్వం పక్కా భవనాలు కట్టించింది. 1971 సంవత్సరంలో ఎస్‌ఎస్‌ఎల్‌సీ స్థానంలో ప్రస్తుతం ఉన్న హైస్కూల్‌ (పదోతరగతి)లోనే ఇంటర్మీడియట్‌ విద్యను ప్రవేశ పెట్టింది. వాస్తవానికి ఈ ఇంటర్మీడియట్‌ కళాశాలను పక్కనే ఉన్న ఆలూరులో ఏర్పాటు చేయాలని అప్పటి ప్రభుత్వం భావించింది. అయితే పత్తికొండ ప్రాంతంలో చాలా మంది ఉన్నత విద్యకు దూరమవుతున్నారని, ఇక్కడే కొత్త కళాశాల కేటాయించాలని ఒత్తిడి తేవడంతో ప్రభుత్వం దిగి వచ్చింది. అందుకు స్థలం చూపాలని, అలాగే రూ.25 వేలు కార్పస్‌ ఫండ్‌ కింద ప్రభుత్వానికి చెల్లించాలని అధికారులు షరతులు విధించారు. దీంతో హైస్కూల్‌లోనే కళాశాల ఏర్పాటుకు స్థలాన్ని కమిటీ పెద్దలు చూపారు. కార్పస్‌ ఫండ్‌ కోసం కళాకారుల ప్రదర్శనలు ఏర్పాటు చేసి నిధులను సమీకరించారు. ఆ మొత్తాన్ని ప్రభుత్వానికి చెల్లించడంతో పత్తికొండకు కళాశాల మంజూరైంది. 1971లో షెడ్‌లలో ప్రారంభమైంది. ఆ తర్వాత పక్కా భవనాలు ఏర్పాటు చేసుకొని 50 వసంతాలు పూర్తి చేసుకొని వేలాది మంది విద్యార్థులను ఉన్నత వ్యక్తులుగా తీర్చిదిద్దింది.

చదువు ప్రాముఖ్యతను గుర్తించి..

1987-89 బ్యాచ్‌ విద్యార్థులు చదువుకు ఉన్న ప్రాముఖ్యతను గుర్తించారు. తాము చదువుకున్న కళాశాల అభివృద్ధికి సహకారం అందించాలని భావించారు. కళాశాల విద్యార్థులకు కంప్యూటర్లు అందించారు. ఆ తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు కళా భవన్‌ నిర్మించారు. 2010లో పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించి గురువులకు సన్మానం చేశారు. పట్టణ ప్రజల కోసం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. 2022లో కళాశాల 50 వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. కళాశాల ప్రారంభం నాటి నుంచి చదువుకున్న 50 బ్యాచ్‌ల పూర్వ విద్యార్థులను ఒక వేదికపైకి తెచ్చారు. ఇందుకోసం అన్ని గ్రూపుల సభ్యులతో కలిసి కమిటీ ఏర్పాటు చేశారు. టీంగా పని చేసి ఆరు నెలలు కష్టపడ్డారు. 1971 నుంచి చదువుకున్న 50 గ్రూపుల విద్యార్థుల వివరాలు సేకరించి స్వర్ణోత్సవ వేడుకలకు ఆహ్వానించి ఘనంగా నిర్వహించారు.

ఉద్వేగం...ఉత్సాహం కలగలిసిన సంబరం

పూర్వ విద్యార్థుల కలయిక అంటే సాధారణంగా ఆ ఏడాది తమతో కలిసి చదువుకున్న తోటి మిత్రులతో జరుపుకోవడం సర్వసాధారణం. అయితే స్వర్ణోత్సవాల సందర్భంగా కళాశాల ఆరంభం నుంచి చదువుకున్న వారందరినీ ఒకే వేదికపైకి తీసుకు రావాలనుకున్నారు. ఒక తరగతికి చెందిన వంద మంది విద్యార్థులు కలిస్తేనే ఎంతో సందడిగా ఉంటుంది. అలాంటిది వేలాది మంది ఒకే వేదికపైకి చేరితే ఆ సంబరం మరింత అద్భుతంగా ఉంటుందని భావించారు. ఆ ఉత్సాహంతో.. ఉద్వేగంతో 2022 డిసెంబరు 10న జరిగిన స్వర్ణోత్సవాలకు తరలివచ్చారు. తమతో చదువుకున్న మిత్రులతో ఉల్లాసంగా గడిపారు. వేలాది పూర్వ విద్యార్థుల నడుమ జరిగిన ఆ సంబరాన్ని మదిలో దాచుకున్నారు. గురువులకు పాదాభివందనం చేశారు. వారిని సత్కరించి గౌరవాన్ని చాటుకున్నారు.

ఆ మధుర ఘట్టానికి గుర్తుగా..

స్వర్ణోత్సవాలకు గుర్తుగా కళాశాల ఆవరణలో ఒక చిహ్నం ఏర్పాటు చేయాలని పూర్వ విద్యార్థులు భావించారు. కళాశాల ఆవరణలో స్థూపం నిర్మాణం పూర్తి చేశారు. జనవరి 7వ తేదీ స్థూపాన్ని ఆవిష్కరించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ కార్యక్రమాన్ని కూడా ఓ పండగ వాతావరణంలా నిర్వహించనున్నారు. ఇందుకు ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి.

కళాశాల ఎంతో నేర్పింది.. మేం చేస్తున్నది కొంతే

మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన నేను సాధారణ మార్కులతో 10వ తరగతి పూర్తి చేసి కళాశాలలో చేరాను. కళాశాల ఎందరో మిత్రులను నాకు పరిచయం చేసింది. ఆడుతూ పాడుతూ మిత్రులతో కళాశాలలో గడిపిన జ్ఞాపకాలు ఇప్పటికి నా మనసులో పదిలంగా ఉన్నాయి. ఇంటర్‌లో కూడా సాధారణ మార్కులు వచ్చాయి. మా జువాలజీ అధ్యాపకుడు కుళ్లాయప్ప సార్‌ నాకు ఆ సమయంలో ఎంతో దైర్యాన్నిచ్చారు. చదవాలి, నేర్చుకోవాలి అన్న తపన నీలో ఉంది. ఎంసెట్‌ రాయి అని చెప్పారు. ఆయన ఇచ్చిన సలహాతో ఎంసెట్‌ రాసి ఎంబీబీఎస్‌ సీట్‌ సాధించాను. వైద్య వృత్తిలో మంచి పేరు సంపాదించాను. ఆ తర్వాత ఎండీ, డీఎం పూర్తి చేసి తిరుపతి స్విమ్స్‌ ఆసుపత్రిలో ప్రొఫెసర్‌గా పని చేస్తున్నాను. నేను ఈ స్థితికి రావడానికి కారణం జూనియర్‌ కళాశాలే. మా కళాశాలలో చదువుకున్న ఎందరో ఎంతో ఉన్నతమైన స్థానాల్లో ఉన్నారు. కళాశాలకు మేం ఎంత చేసినా తక్కువే.

- డాక్టర్‌ రామారావు, పూర్వ విద్యార్థి

షెడ్‌లలో చదువుకున్నాం

1971లో కళాశాల ప్రారంభం కావడంతో నేను అడ్మిషన్‌ కోసం వెళ్లాను. మొదటి ప్రిన్సిపాల్‌గా రామచంద్రమూర్తి నియమితులయ్యారు. దీంతో రామ్‌ పేరు ఉన్న విద్యార్థినినే మొదటగా తీసుకోవాలని భావించారు. దీంతో అడ్మిషన్‌కు వచ్చిన విద్యార్థులలో రామ్‌ అన్న పదం నా పేరులోనే ఉండడంతో మొదటి అడ్మిషన్‌ నాకు ఇచ్చారు. 50 వసంతాలు పూర్తి చేసుకున్న కళాశాలలో నేనే మొదటి విద్యార్థి కావడం ఎంతో గర్వంగా ఉంది. కళాశాల మొదట్లో భవనాలు లేకపోవడంతో రేకుల షెడ్డులోనే తరగతులు నిర్వహించేవారు. ఎండకు ఇబ్బందులు పడుతూనే కళాశాల చదువును పూర్తి చేశాం. అప్పట్లో ఎండవేడికి మాకు కలిగిన ఇబ్బందికంటే ఇంటర్‌ కళాశాల అందుబాటులో ఉందన్న ఆనందం ఎక్కువగా ఉండేది.

- రామ్మోహన్‌, కళాశాల మొదటి విద్యార్థి

జీవిత పాఠం కళాశాలలోనే నేర్చుకున్నాను

మా కళాశాలలో గురుదేవులు నేర్పించిన చదువుతోనే నేటి ఉద్యోగం, జీవితం. నా జీవితంలోని ప్రతిపేజీలోనూ అది ప్రతిబింబిస్తుంది. ఉన్నతంగా ఎలా జీవించాలి, పది మందికి ఎలా సహాయం చేయాలి అని మాగురువుల నేర్పారు.

- అమీనాబీ, అగ్రికల్చర్‌ డిప్యూటీ డైరెక్టర్‌, తెలంగాణ

గురువులు చూపిన మార్గనిర్దేశం, అండగా నిలిచిన స్నేహం

నా కళాశాల అనుభవాలు పంచుకోవడం ఆనందంగా ఉంది. మేం చదువుకున్న తరగతి గదులు మాకు విజ్ఞానాన్ని అందించిన వారధులు. గురువులు నేర్పిన పాఠాలు, చేసిన మార్గనిర్దేశాలు నేటి మా జీవన విధానాలకు సాక్ష్యాలు. అల్లరితోపాటు స్నేహితులతో పంచుకున్న గడిపిన క్షణాలు తీపి గుర్తులు. పూలరెమ్మలతో చేసిన గాలిబుడగలు, వేసవిలో వారితో కలిసి తిన్న ఐస్‌క్రీంలు అన్నీ గతాన్ని గుర్తు చేస్తున్నాయి.

- లక్ష్మీబాయి, మార్కెటింగ్‌ డైరెక్టర్‌, తెలంగాణ

ఈ జీవితం గురువులు పెట్టిన భిక్ష

పత్తికొండకు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న గుండు తండా అనే గిరిజన గ్రామం మాది. ఐదో తరగతి వరకు చెట్టుకింద గ్రామంలో ఉన్న బడిలో చదివాను. అమ్మకు చదువంటే ఇష్టం కావడంతో నన్ను పత్తికొండ హాస్టల్లో ఉంచి చదివించింది. ఆ తర్వాత బయట మిత్రులతో కలిసి రూంలో ఉంటూ ఇంటర్‌ కళాశాలలో చేరాను. అక్కడ గురువులు చెప్పిన చదువులు, వారు చెప్పిన మంచి విషయాలు భవిష్యత్‌లో ఏం చేయాలన్న ఆలోచనను కలిగించాయి. మ్యాఽఽథ్స్‌ అఽధ్యాపకులు సర్వేశ్వరావు, నాగేశ్వరరావు ఇంజనీరింగ్‌ వైపు వెళ్లాలని మార్గనిర్దేశం చేశారు. దీంతో ఎంసెట్‌ ద్వారా సీటు సాధించి ఇంజనీరింగ్‌ పూర్తి చేశాను. ప్రస్తుతం ఇరిగేషన్‌ డిపార్ట్‌మెంట్‌ డిప్యూటీ ఇంజనీర్‌గా పని చేస్తున్నాను. నాకు ఇంతటి అవకాశం రావడానికి నాడు నా గురువులు పెట్టిన భిక్షగానే భావిస్తాను.

- క్రిష్ణానాయక్‌, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌, ఇరిగేషన్‌

ఫ్యాక్షన్‌ గ్రామం నుంచి కస్టమ్స్‌ ఆఫీసర్‌గా వచ్చాను

మాది దేవనకొండ మండలం కప్పట్రాళ్ల గ్రామం. మా గ్రామంలో ఫ్యాక్షన్‌ ఎక్కువ అలాంటి వాతావరణంలో ఐదో తరగతి పూర్తి చేశాను. అమ్మకు నన్ను చదివించాలని ఆశ. దీంతో పత్తికొండలో రూమ్‌ తీసి మాకు తోడుగా నాన్నమ్మను ఉంచింది. అలా హైస్కూల్‌ చదువు పూర్తి చేసుకొని ఇంటర్‌లోకి ప్రవేశించాను. మేం చదివే సమయంలో స్టూడెంట్‌ ఆర్గనైజేషన్స్‌ కళాశాలలో కీలకంగా పని చేసేవి. నేను ఎస్‌ఎఫ్‌ఐలో పని చేసేవాడిని. అల్లరి ఎంత చేసినా తరగతిలో అధ్యాపకులు చెప్పిన పాఠాలను ఎప్పుడు అశ్రద్ధ చేయలేదు. అప్పటి అధ్యాపకులు విద్యార్థులను తీర్చిదిద్దేందుకు ఎంతగానో కృషి చేసేవారు. అధ్యాపకుల మంచిమాటలు భవిష్యత్‌ ఏం చేయాలో నేర్పించాయి. ఎస్‌ఎఫ్‌ఐ నాలో దేన్నయినా ప్రశ్నించడం నేర్పించింది. ఇంటర్‌ తరువాత ఎంసెట్‌ ద్వారా ఇంజనీరింగ్‌ పూర్తి చేసి ప్రస్తుతం ముంబాయిలో కస్టమ్స్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌గా పని చేస్తున్నాను. నా ప్రస్థానంలో పత్తికొండ జూనియర్‌ కళాశాల ఎంతో కీలకం. అందుకే కళాశాలలో పూర్వ విద్యార్థులు ఏ కార్యక్రమం నిర్వహించినా ఎంత దూరంలో ఉన్నా హాజరై ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటాను.

- నరేష్‌, ఇండియన్‌ కస్టమ్స్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌, ముంబాయి

Updated Date - Jan 07 , 2024 | 12:23 AM