Share News

ఉల్లి ఎగుమతులకు బ్రేక్‌

ABN , Publish Date - Nov 28 , 2024 | 12:18 AM

ఎగుమతులు ఆగిపోయాక ఒక్కసారిగా క్వింటంపై రూ.1000 దాకా ధర తగ్గిపోయిందని రైతులు ఆవేదన చెందుతున్నారు.

ఉల్లి ఎగుమతులకు బ్రేక్‌
కర్నూలు మార్కెట్‌ యార్డు ఉల్లి

పశ్చిమ బెంగాల్‌ వద్ద సరిహద్దులు మూసివేత

ఎక్కడికక్కడే ఉల్లి లారీలను నిలిపివేసిన వైనం

రూ.5వేల నుంచి రూ.మూడున్నర వేలకు పతనం

కర్నూలు అగ్రికల్చర్‌, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి):

ఈ రైతు పేరు సీమోన్‌. జులేకల్‌ గ్రామానికి చెందిన ఈయన 15 బస్తాల ఉల్లిని బుధవారం అమ్మకానికి కర్నూలు మార్కెట్‌ యార్డుకు తీసుకువచ్చాడు. మూడు రోజుల నుంచి మార్కెట్‌ యార్డులకు ఉల్లి విక్రయానికి తక్కువగా వస్తున్నందున ధర బాగా పలుకుతుందని ఆశించాడు. అయితే.. చావు కబురు చల్లగా చెప్పారు. ఇప్పటి దాకా విదేశాలకు సప్లయ్‌ అవుతున్న ఉల్లి ఎగుమతులు ఆగిపోయాయని వ్యాపారులు చెప్పారు. బంగ్లాదేశ్‌కు ఉల్లి లారీలు ఎగుమతి కాకుండా కేంద్ర ప్రభుత్వం పశ్చిమ బెంగాల్‌ వద్ద లారీలను నిలిపివేసింది. దీంతో కర్నూలు మార్కెట్‌ యార్డు నుంచి ఉల్లి ఎగుమతులకు బ్రేక్‌ పడింది. మొన్నటి దాకా రూ.4వేల నుంచి రూ.5వేల దాకా క్వింటం ఉల్లి అమ్ముడుపోయింది. ఎగుమతులు ఆగిపోయాక ఒక్కసారిగా క్వింటంపై రూ.1000 దాకా ధర తగ్గిపోయిందని రైతులు ఆవేదన చెందుతున్నారు. కర్నూలు, నంద్యాల జిల్లాలతో పాటు అనంతపురం, తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్‌ నగర్‌ జిల్లాల నుంచి కర్నూలు యార్డుకు ఉల్లిని తీసుకువస్తున్న రైతులు దీని వల్ల తీవ్రంగా నష్టపోతున్నారు

మహారాష్ట్రలో భారీ వర్షాల కారణంగా ఉల్లి పంట దిగుబడి తగ్గిపోవడంతో కర్నూలు, నంద్యాల జిల్లాల ఉల్లికి గతంలో ఎన్నడూ లేని విధంగా డిమాండ్‌ పెరిగింది. 10వేల క్వింటాళ్ల ఉల్లి విక్రయానికి వచ్చినా గరిష్ఠ ధర రూ.4500 నుంచి రూ.5వేల వరకు ధర అందింది. అయితే కేంద్ర ప్రభుత్వం ఉల్లి ధరను నియంత్రించేందుకు వివిధ రాష్ట్రాల నుంచి బంగ్లాదేశ్‌ తదితర దేశాలకు ఎగుమతి చేసే ఉల్లిపై నిషేధం విధించింది. దీంతో ఉమ్మడి జిల్లా నుంచి సప్లయ్‌ అవుతున్న ఉల్లి లారీలను ఎక్కడికక్కడ నిలిపివేశారు. ఈ పరిణామం వల్ల ప్రస్తుతం కర్నూలు మార్కెట్‌ యార్డుకు కేవలం రూ.2వేల నుంచి రూ.3వేల క్వింటాళ్లు మాత్రమే అమ్మకానికి వస్తున్నది.

కనీస స్థాయికి ధర పతనం:

గత శుక్రవారం క్వింటం ఉల్లికి గరిష్ఠ ధర రూ.5,099. బుధవారం రూ.4వేల గరిష్ఠ ధర నుంచి రూ.500 కనిష్ఠ ధరకు పడిపోయింది. రానున్న రోజుల్లో మరింతగా ధర పడిపోవచ్చని రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

ఉల్లి ఎగుమతులు నిలిచిపోయాయి

ఇప్పటి దాకా గతంలో ఎన్నడూ లేని విధంగా కర్నూలు యార్డులో ఉల్లికి మంచి ధర లభించింది. అయితే.. బంగ్లాదేశ్‌కు ఉల్లిని ఎగుమతి నిషేధించారని వ్యాపారులు చెబుతున్నారు. ఈ నిషేధం ఎంత వరకు ఉంటుందో చెప్పలేం. మహారాష్ట్ర నుంచి వివిధ రాష్ట్రాలకు ఇప్పుడిప్పుడే ఉల్లిని ఆ రాష్ట్ర రైతులు తీసుకుని వస్తున్నారు. దీనివల్ల కర్నూలు మార్కెట్‌ యార్డులో ఉల్లికి ధర ఏ స్థాయిలో అందుతుందో చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. ఏది ఏమైనా రైతుకు గిట్టుబాటు ధర అందించేందుకు చర్యలు తీసుకుంటాం. - జయలక్ష్మి, సెలక్షన్‌ గ్రేడ్‌ సెక్రటరీ

Updated Date - Nov 28 , 2024 | 12:18 AM