నిండు కుండలా శ్రీశైలం
ABN , Publish Date - Jul 28 , 2024 | 11:33 PM
శ్రీశైలం జలాశయానికి భారీగా వరద పోటెత్తింది. ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి గంట గంటకూ వరద ఉధృతి పెరుగుతుండడంతో శ్రీశైలం జలాశయం రేడియల్ క్రస్టుగేట్లను ఎత్తేందుకు జలవనరులశాఖ ఇంజనీర్లు సన్నాహాలు చేస్తున్నారు.

నేడు శ్రీశైలం జలాశయం గేట్లు ఎత్తివేత
4,41,222 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఫ ఆరు గేట్లు తెరిచే అవకాశం
శ్రీశైలం, జూలై 28: శ్రీశైలం జలాశయానికి భారీగా వరద పోటెత్తింది. ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి గంట గంటకూ వరద ఉధృతి పెరుగుతుండడంతో శ్రీశైలం జలాశయం రేడియల్ క్రస్టుగేట్లను ఎత్తేందుకు జలవనరులశాఖ ఇంజనీర్లు సన్నాహాలు చేస్తున్నారు. సోమవారం ఉదయం 11 గంటలకు రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు డ్యామ్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తారని ఎస్‌ఈ శ్రీరామచంద్రమూర్తి తెలిపారు. ఈ కార్యక్రమంలో నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి, శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి తదితరులు పాల్గొంటారు. మరోవైపు శ్రీశైలం జలాశయానికి జూరాల, సుంకేశుల ప్రాజెక్టుల నుంచి 4,41,222 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. ఆదివారం సాయంత్రం 6 గంటల సమయానికి జలాశయం నీటిమట్టం 885 అడుగులకుగాను 873.40 అడుగులుగా నమోదైంది. అదేవిధంగా నీటి నిల్వ 215.807 టీఎంసీలకుగాను ప్రస్తుతం 156.3860 టీఎంసీలుగా నమోదైంది. జలాశయం కుడి, ఎడమ గట్టు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ 61,111 క్యూసెక్కుల నీటిని దిగువ నాగార్జునసాగర్ జలాశయానికి విడుదల చేస్తున్నారు. గత ఏడాది తక్కువ వర్షపాతం నమోదు కావడంతో జలాశయం గేట్లు తెరవలేదు. ఈ ఏడాది ఊహించని విధంగా వరద రావడంతో శ్రీశైలం ప్రాజెక్టు కళకళలాడుతోంది.
పది రోజుల్లోనే భారీగా చేరిన వరద
పదిరోజులుగా శ్రీశైలం జలాశయానికి ఎగువ పరివాహ ప్రాంతాల నుంచి వరద ప్రవాహం కొనసాగింది. ఎగువ ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా దిగువ జలాశయాలకు వరద ఉధృతి క్రమ క్రమంగా పెరిగింది. దీంతో శ్రీశైలం జలాశయం నిండుకుండలా మారడంతో మంగళవారం జలాశయం క్రస్టుగేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలు, ఇతర రాష్ట్రాల నుంచి ప్రకృతి ప్రేమికులు, పర్యాటకులు భారీగా తరలివస్తున్నారు. గత ఏడాది తక్కువ వర్షపాతం నమోదు కావడంతో జలాశయం గేట్లు తెరవలేదు. ఈ ఏడాది ఊహించని విధంగా వరద రావడంతో శ్రీశైలం ప్రాజెక్టు కళకళలాడుతోంది.
ఆర్డీఎస్ ఆనకట్టకు భారీగా వరద
కోసిగి: మండల పరిధిలోని అగసనూరు గ్రామ సమీపంలోని తుంగభద్ర నదిపై ఉన్న ఆర్డీఎస్ ఆనకట్టకు భారీగా వరద పోటెత్తుతోంది. దీంతో ఆనకట్టపైన ఐదు అడుగుల మేర వరద నీరు దిగువకు పరవళ్లు తొక్కుతోంది. తుంగభద్ర నదికి భారీగా వరద నీరు పోటెత్తడంతో అగసనూరులోని వడ్డె సిద్దయ్య, ఉలిగయ్య, ఈరన్న రైతుల పొలాల్లోకి వరద నీరు వచ్చి చేరాయి. దీంతో రైతులు వేసిన వరిపైరు, ఉల్లి నారు పంట, వేరుశనగ పంటలు నీట మునిగాయి. వరదనీటి ప్రవాహం ఉధృతంగా ఉండటంతో నదీతీర గ్రామాల్లోని రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్ మురళి హెచ్చరికలు జారీ చేశారు.
ప్రమాదకర స్థాయిలో తుంగభద్ర ప్రవాహం
అప్రమత్తం చేసిన శ్రీమఠం అధికారులు, పోలీసులు
మంత్రాలయం, జూలై 28: ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాల మధ్య ప్రవహిస్తున్న తుంగభద్ర నది ఆదివారం సాయంత్రానికి ఉగ్రరూపం దాల్చింది. హోస్పేట్‌లోని తుంగభద్ర డ్యాం నుంచి 1,47,456 క్యూసెక్కులు దాగువకు వదలడంతో ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాల సరిహద్దులను తాకుతూ ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. మంత్రాలయం వద్ద 311.700 మీటర్ల నీటి మట్టంతో 1,35,800 క్యూసెక్కులతో ప్రవహిస్తోంది. గంగమ్మ గుడిని వరదనీరు దిగ్బంధం చేశాయి. పుష్కరఘాట్లన్నీ మునిగాయి. మఠం పీఠాధిపతి సుబుదేంద్రతీర్థుల ఆదేశాల మేరకు మఠం ఏఏవో మాధవశెట్టి, శ్రీనివాసరావు, వెంకటేశ్ జోషి, ఈఈ సురేష్ కోనాపూర్, ఏఈ బద్రినాథ్, మంత్రాలయం ఎస్‌ఐ గోపినాథ్, సర్పంచ్ తెల్లబండ్ల భీమయ్య ఆధ్వర్యంలో మఠం సెక్యూరీటీ, పోలీసు సిబ్బంది బందోబస్తు ఏర్పాటు చేశారు. గజ ఈతగాళ్లతో పాటు తెప్పలను ఏర్పాటు చేశారు. ఇన్‌చార్జి తహసీల్దార్ రాఘవేంద్ర, సీడబ్లూసీ అధికారులు ఎప్పటికప్పుడు నీటి మట్టాన్ని లెక్కిస్తూ అప్రమత్తం చేస్తున్నారు.