శ్రీశైల జలాశయం నాలుగు గేట్ల ఎత్తివేత
ABN , Publish Date - Oct 19 , 2024 | 11:50 PM
నీలం సంజీవరెడ్డి శ్రీశైలం జలాశయానికి ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి వరద ప్రవాహం భారీగా కొనసాగుతోంది.
శ్రీశైలం, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి) : నీలం సంజీవరెడ్డి శ్రీశైలం జలాశయానికి ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి వరద ప్రవాహం భారీగా కొనసాగుతోంది. జలాశయానికి వరద భారీగా కొనసాగుతుండడంతో శనివారం డ్యాం అధికారులు 4 క్రస్టుగేట్లు 10 అడుగుల మేర ఎత్తి దిగువ నాగార్జున సాగర్ జలాశయానికి నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల నుంచి 1,18,464 క్యూసెక్కులు, సుంకేసుల నుంచి 72,114 క్యూసెక్కులు, హంద్రీ నుంచి 250 మొత్తం 1,90,828 వరద నీరు వస్తోంది. శనివారం సాయంత్రం 6 గంటల సమాయానికి 1,25,641 క్యూసెక్కుల వరద నీరు జలాశయానికి వచ్చి చేరింది. జలాశయం పూర్తిస్థాయి నీటి నిల్వ 215.807 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 213.8824 టీఎంసీలుగా నమోదైంది. ఆంధ్రప్రదేశ్ జలవిద్యుత్ కేంద్రం ద్వారా 31,139 క్యూసెక్కులు, తెలంగాణ జల విద్యుత్ కేంద్రం ద్వారా 36,900 క్యూసెక్కులు విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. జలాశయం నాలుగు క్రస్టు గేట్ల ద్వారా 1,11,932 క్యూసెక్కుల నీటిని దిగువ నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు విడుదల చేస్తున్నారు.